మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. నూతన సంవత్సరం ముందుకు వచ్చింది. ఒకసారి వెనక్కి తిరిగిచూస్తే 2024లో ఎడతెగని సంక్షోభాల పరంపర కనిపిస్తుంది? అటు గాజా యుద్ధం రావణకాష్టమైంది. ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వీడని చిక్కుముడిలా తయారైంది. ప్రపంచ శాంతిపై ఉత్తరకొరియా క్షిపణుల మీద క్షిపణులు ఎక్కుపెడుతూనే ఉన్నది. చైనా-తైవాన్, అఫ్ఘాన్-పాక్ తగాదాలు ముదిరి పాకానపడ్డాయి.
యుద్ధాల నీడలో ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. జర్మనీ వంటి దిగ్గజాలే సమస్యల్లోకి దిగజారి దిగులు పడుతున్నాయి. కోరలు చాస్తున్న కాలుష్యంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. 2024 అత్యంత వేడిమి చూసిన సంవత్సరంగా రికార్డులకెక్కింది. పారిశ్రామిక విప్లవ పూర్వస్థితితో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. కాలుష్యానికి కళ్లెం వేసేందుకు అవసరమైన నిధుల సేకరణపై ఏర్పాటైన కాప్-29 సదస్సు పెద్దగా ముందంజ వేయలేకపోయింది.
ఎన్నికల నామ సంవత్సరంగా ముద్ర వేసుకున్న 2024లో 80కి పైగా దేశాల్లో ప్రజలు తీర్పు చెప్పారు. అందరి అంచనాలు తారుమారయ్యాయి. వీసాలపై పగబట్టిన, టారిఫ్‌లపై తొడగొట్టిన డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనేక చోట్ల అంచనాలు తారుమారైనట్టుగానే భారత్‌లోనూ మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు కలిసిరాలేదు. జాతీయ పార్టీలమని విర్రవీగే బీజేపీ-కాంగ్రెస్‌లకు గుణపాఠాలు ఎదురయ్యాయి. ‘చార్ సౌ పార్’ అన్న బీజేపీ కనీస మెజారిటీ దక్కించుకోలేక చతికిల పడింది. అటు కాంగ్రెస్ ఆశలూ వమ్మయ్యాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలు బీజేపీకి ఊరటనిస్తే కాంగ్రెస్ మాత్రం ఖేల్ ఖతం దుకాణ్ బంద్ స్థితికి చేరుకున్నది. మొత్తం మీద ప్రజలు సంకీర్ణాలే కోరుకున్నారని చెప్పకతప్పదు.
తెలంగాణకు సంబంధించి 2024 ‘ఏడాది బర్బాది’ అన్నట్టుగానే గడిచిపోయింది. సుమారు పదేండ్లపాటు కొనసాగిన అభివృద్ధి ప్రస్థానానికి బ్రేకులు పడుతుండటం మనం ప్రస్ఫుటంగా చూస్తున్నం. కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టులు కుట్ర రాజకీయాలకు బలవుతున్నాయి. అభివృద్ధి అడుగంటింది. సంక్షేమం సంక్షోభంలో చిక్కున్నది. సాగును సర్కారీ నిర్లక్ష్యపు చీడ పట్టుకున్నది. ఉచిత కరెంటు ఉత్తదైపోయింది. రైతుబంధు ఊగిసలాటలో పడింది. రుణమాఫీ ప్రహసనమైపోయింది. ఉద్యోగుల ఆశలు ఎండమావులవుతున్నాయి. గురుకులాలు కొడిగట్టిన దీపాలవుతున్నాయి.
అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి అమలుచేయడం చేతకాక సాకుల కోసం సర్కారు తంటాలు పడుతున్నది. అప్పులు తేవడం తప్పని ఇదివరకు ఇల్లెక్కి కూసిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. మోసపోయి గోసపడుతున్నామని ప్రజలు గ్రహించారు. రాష్ట్ర సాధనకు సుదీర్ఘ పోరాటం జరిపిన గడ్డ ఇది. కపట నాటకాల కాంగ్రెస్ మెడలు వంచిన చరిత్ర ఉంది. చావు అంచుల వరకూ వెళ్లి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతే ప్రజలు ఊరుకుంటారా? ఈనగాచి నక్కల పాలు కానిస్తారా? కారుకూతల, నూరుకోతల కాంగ్రెస్ పాలన పట్టు జారుతున్నది. కొత్త ఏడాది తలుపు తట్టిన వేళ ప్రజల స్వరం మారుతున్నది. సంకల్పం పదును దేరుతున్నది. తెగువకు, సాహసానికి మారుపేరైన తెలంగాణ బిడ్డలు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అందుకు 2025 వేదిక కాబోతున్నది.