గిల్లి ఏడుస్తుంటే బుజ్జగించినట్టే ఉన్నది జీఎస్టీ సంస్కరణల తంతు. అసలు సామాన్యుల వినియోగానికి అవసరమయ్యే అన్నిరకాల వస్తువులపై నాలుగు శ్లాబుల కింద 5, 12, 18, 28 శాతం వడ్డింపులు తెమ్మన్నది ఎవరు? వాటి కిందపడి నలిగి ప్రజలు తమ కొనుగోలు శక్తిని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ‘రెండే శ్లాబులు తెస్తున్నాం, రాయితీలు ఇస్తు న్నాం’ అని ఊదరగొడుతూ, ‘బెల్లం ముక్క ఇస్తున్నాం పండుగ చేసుకోండి’ అన్నటున్న ది కేంద్ర ప్రభుత్వం వైఖరి. ఈ శ్లాబులు అర్థరహితమని ఎందరు, ఎంతగా మొత్తుకున్నా కేం ద్రం దిగిరాలేదు. ఇప్పుడు సంస్కరణల పేరిట జరుగుతున్నది కేవలం దిద్దుబాటే. ఇప్పుడిక 5, 18 శాతం అనే రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి.
ఈ సర్దుబాటు వల్ల ఎనిమిదేండ్ల బాదుడు కొంత తగ్గిపోయి ఉపశమనం కలుగుతుందన్న మాట నిజమే. కానీ, ‘పండగ చే స్కోండి’ అనేది కొంచెం అతిశయోక్తిగానే ఉంటుంది. కాగా, 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. దసరా-దీపావళి పండుగ సీజన్‌కు ముందే సంస్కరణలు అమల్లోకి రానుండటం గమనార్హం. ప్రస్తుత విధానంలో 18 శాతం శ్లాబు నుంచే అత్యధికంగా 65 శాతం రెవెన్యూ సమకూరుతున్నది. సంస్కరణల తర్వాత కూడా ఈ శ్లాబ్ నుంచే అత్యధిక ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
రోజువారీగా ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ సుంకాలు తగ్గుతాయని ఊదరగొడుతున్నవారు నిజానికి వాటిపై పన్నుల అవసరమే లేదన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చదువుకునే పిల్లలు ఉపయోగించే పెన్సిళ్లు, రబ్బరుపై సుంకాల కోత ఈ కోవలోకే వస్తుంది. ఆరోగ్య, జీవిత బీమాలపై 18 శాతం సుంకం మొత్తంగా ఎత్తివేయడం, కార్లపై సుంకాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించడం కూడా అలాంటివే. క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 33 రకాల ఔషధాలపై సుంకాలు పూర్తిగా ఎత్తివేసినప్పటికీ, మరెన్నో ఇతర అత్యవసర ఔషధాలపై సుంకాలు కొనసాగుతుండటం సమర్థనీయం కాదు. పన్నుల సరళీకరణ, సామాన్యులపై భారం తగ్గించడం మం చిదే. కానీ ఆలస్యంగా, అరకొరగా ఉపశమనం కలిగించడమే అసలు సమస్య. ఇకపోతే ఈ తగ్గింపుల ప్రయోజనం ప్రజలకు చేరుతుం దా? అనేది అనుమానాస్పదంగానే ఉంది. పన్ను రాయితీని వినియోగదారులకు చేరేలా చూడాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అభ్యర్థించినప్పటికీ, కంపెనీలు ధరలు పెంచి గండికొట్టవనే గ్యారెంటీ ఏమీ లేదు.
కేంద్రం ఈ సంస్కరణలు తెస్తున్న సమయం మరో రకంగా కూడా ప్రత్యేకమైనదే. అమెరికా సుంకాల బాదుడుతో భారతీయ పరిశ్రమల రంగంతో పాటు వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభం ఎందుర్కొంటున్నది. ఎగుమతుల సంక్షోభ ప్రభావం తగ్గించేందుకు స్వదేశీ వినిమయం పెంచక తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. జీఎస్టీ మార్పులతో వచ్చే 4-6 త్రైమాసికాల్లో ఉత్తమ ఫలితాలు నమోదవుతాయని, జీడీపీకి 100-120 బేసిస్ పాయింట్లు దీనివల్ల సమకూరుతాయని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ర్టాలు, ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్నవి, తాము ఎదుర్కొంటున్న నష్టాల మాటేమిటని కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. దీనిపై సంస్కరణల్లో పెద్దగా ఏమీ ప్రస్తావించలేదు. రాష్ర్టాలకు నెలవారీగా రేట్ల సవరణ వల్ల 3-4 శాతం రెవెన్యూ తగ్గుతుందని అంటున్నారు. అయితే వినిమయం పెరగడం వల్ల ఇది సర్దుబాటు అవుతుందని కేంద్రం అంటున్నది. కానీ, గత అనుభవం మరోలా చెప్తున్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీ వ్యవస్థలో మరిన్ని సవరణలు, సంస్కరణలు తప్పవని చెప్పక తప్పదు.