ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్‌కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అసలు పతారా ఎంతున్నదో బయటపడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, జర్నలిస్టులు ఎవరినీ వదలకుండా దూషణలకు పాల్పడిన సీఎం.. సొంత పార్టీలో మాత్రం ఒక్క వివాదం రాగానే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? అనేదే ఇప్పుడు చర్చ.
‘ఎవరు నా వెంట ఉన్నరో చెప్పండి బాబూ’ అంటూ చేస్తున్న బ్రతిమిలాటను చూసి అసలు కాంగ్రెస్ వాదులు ముసిముసిగా నవ్వుకుంటున్నారట. ఢిల్లీ నుంచి ఆదేశించి ప్రెస్‌మీట్ ద్వారా బల ప్రదర్శన ఏర్పాటు చేస్తే పట్టుమని 16 మంది ఎమ్మెల్యేలే హాజరైండ్రు. ఇదిచూసి ‘అయ్యగారి పతారా ఇంతేనా?’ అని రాజకీయ ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ కార్యకర్తలూ ముక్కున వేలేసుకుంటున్నరు. పార్టీ మీద పట్టు అంటే పదవులు, మైకులు, మీటింగులు కాదు సారూ.. కష్టం వచ్చినప్పుడు పక్కన నిలబడే క్యాడర్, ఎమ్మెల్యేలే అసలు బలం. ’వాపును చూసి బలం’ అనుకొని విర్రవీగితే ’ఆపద వచ్చినప్పుడు అసలు బలం’ తెలిసి నవ్వులపాలు కాకతప్పదు!!!

అరెరే.. ఏంది సామి మీ లీలలు! ఎన్నికలప్పుడు రైతన్న కాళ్ల మీద పడి, దేవుండ్ల్ల మీద ఒట్టేసి.. ‘మీ వెంటే మేం’ అని చెప్పినోళ్లు, గద్దెనెక్కగానే హామీలన్నీ గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు ‘ఉద్యోగులకు కోటి రూపాయల బీమా’ అంటూ ఊరూవాడా డప్పు కొడ్తున్నరు. కానీ అసలు కథ ఏందంటే.. ఉద్యోగుల జీతాల టర్నోవర్ చూసి బ్యాంకులు ఇచ్చే బీమా సదుపాయాన్ని కూడా సర్కారు తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శలు వస్తున్నయ్. సర్కారు వాటా పైసా లేకపోయినా.. ప్రచారం మాత్రం కోటికి!
మరి అదే సర్కార్‌కు రైతన్న గుర్తొస్తే మాత్రం లెక్కలు యాదికొస్తయ్. రైతుకు రూ.5 లక్షల బీమా అంటే ఏడాదికి దాదాపు రూ.1,300 కోట్ల ప్రీమియం. ఒక్కో రైతు పేరు మీద ఏడాదికి చెల్లించే ప్రీమియం కేవలం రూ. 2,5003,000 కట్టాలంటే ఖజానాకు భారం అవుతున్నదట! ఉద్యోగికి బ్యాంకు ఇచ్చే బీమా ప్రభుత్వానికి ఘనత.. రైతుకు ఇచ్చే బీమా మాత్రం ప్రభుత్వానికి భారం అట?!
కష్టపడి పంట పండించి అందరి కడుపు నింపే రైతన్నకు ‘ఏం కాదు.. మేమున్నం’ అనే ధీమా ఇవ్వాల్సింది పోయి.. హామీలకే పరిమితం అయితే ఎలా? ఉద్యోగికి కోటి బీమా అంటూ ఘనంగా చెప్పుకొనే సర్కార్, రైతుకు కనీసం ఐదు లక్షల భరోసా ఇవ్వలేకపోతే.. ఇది ‘రైతు ద్రోహి ప్రభుత్వం’ అంటే తప్పయితదా?

‘తేలు మంత్రం రానోడు.. పాము కాటుకు మందేసిండని’ సామెత. ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ పరిస్థితి చూస్తుంటే ఇదే సామెత యాదికస్తున్నది. ‘విద్యా వ్యవస్థను బాగు చేద్దామనే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా.. నన్నెందుకు వద్దంటున్నరు? నేను మంచి చేస్తున్నందుకేనా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ప్రశ్నిస్తున్నడు. మరి ఆ ‘మంచి’ ఫలితం మాత్రం ఎక్కడ ఉన్నదో చెప్పాలని విద్యార్థులు అంటున్నరు. ఫీజు రీయింబర్స్మెం ట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు దాటిపోయినా విద్యార్థులు, కాలేజీలు అవస్థలు పడుతూనే ఉన్నయి.
‘ఎప్పుడు ఇస్తరు?’ అని అడిగితే.. ‘పక్క రాష్ట్రంలో ఇస్తున్నరా? వాళ్లు ఇచ్చినప్పుడు చూద్దాం’ అంటూ దబాయించడం మరీ విచిత్రం. ఇంతలో పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ పథకం కిందకు తీసుకురావడంతో విద్యార్థులు రోడ్డెక్కిండ్రు. మూ డేండ్లు పాలిటెక్నిక్ చదివి నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే అవకాశంపై అనిశ్చితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నరు.
వాళ్ల భయానికి కారణాలు ఏందో వినాల్సింది పోయి.. పోలీసులతో విద్యార్థుల గొంతు పిసికి ఆందోళనలను కర్కశంగా అణచివేయించాలని చూస్తే సమస్య పరిష్కారమవుతదా? విద్యార్థులు ప్రశ్నిస్తే పాలకులు సమాధానం చెప్పాలి, సముదాయించాలి. అంతేగానీ పీక పిసికించి అణచివేయాలని చూస్తే బొద్దింకల్లా రెచ్చిపోతారు.. ప్రజాకంటక పాలనను బొందపెడుతారు. అసలే జెన్-జీ తరం… జాగ్రత్త!!

‘మీ ఏడుపే మా ఎదుగుదల’.. లారీలు, ఆటోలు, జీపుల వెనకాల కనిపించే ఈ నినాదం ఇప్పుడు తెలంగాణ పాలనకు కూడా అచ్చుగుద్దినట్టు సరిపోతుందేమో. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక హైడ్రా, మూసీ.. ఇప్పుడు 22-ఏ. పేరు ఏదైనా టెన్షన్ మాత్రం పరపతి లేనోడికే. ఇల్లు కట్టుకున్నోడికి ఇబ్బంది.. స్థలం కొనుకున్నోడికి గుబులు.. రిజిస్ట్రేషన్ చేసుకునే వాడికి కొత్త తిప్పలు!
తాతల కాలం నుంచి భూమికి పట్టా ఉన్నది, పాస్‌బుక్ ఉన్నది, కాగితాలు ఉన్నయ్.. పన్నులు కట్టిన రసీదులున్నయ్. కానీ 22-ఏలో పేరు ఉన్నదంటే చాలు.. రిజిస్ట్రేషన్ ఆగిపోతది. ’భూమి మాది, పత్రాలు మావి, రిజిస్ట్రేషన్ మాత్రం మీ ఇష్టం!’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అమ్మేవాడికే కాదు కొనేవాడికీ కష్టం. బ్యాంకు లోను, పిల్లల చదువు, పెండ్లి, అత్యవసర ఖర్చులు.. ఏ అవసరానికైనా భూమిని అమ్ముకుందామంటే ’22-ఏ’ మెడ మీద కత్తిలా తయారయింది.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చినా.. భూమి బ్లాక్‌లో, రిజిస్ట్రేషన్ లాక్‌లో.. ఫిర్యాదు మాత్రం టోల్ ఫ్రీలో! అక్రమాలను అడ్డుకోవడం మంచిదే. కానీ సక్రమమైన ఆస్తులనూ అనుమానపు జాబితాలో పెట్టి సామాన్యుడిని కార్యాలయాల చుట్టూ తిప్పితే మాత్రం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని పైకి చెప్తూ.. సామాన్యుడి ఆస్తిని ఆగం చేయొద్దు.
– దాము నర్మాల