రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ భూమి మాది’ అంటూ ఎస్బీఐ కోర్టుకు వెళ్లటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే, తమను ఇబ్బంది పెట్టాలనే దృష్టితోనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని కోర్టు దాకా లాగారని ప్రభుత్వం భావిస్తున్నది. అంతటితో ఆగకుండా రాజకీయకక్ష కోణంలో ఈ వివాదాన్ని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మీ బ్యాంకు మాకు వద్దు’ అని ప్రభుత్వ నిధులను ఇంకో బ్యాంకుకు మార్చే ఆలోచనకు తెరలేపింది. ఈ దెబ్బతో బ్యాంకు దిగివస్తుందని సర్కార్ భావిస్తున్నది.
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, రాయదుర్గ్ పాన్ మక్తాలో గల 5.09 ఎకరాల భూమిని జూన్ 1న టీజీఐఐసీ వేలం వేసింది. ఎకరానికి రూ.204 కోట్ల చొప్పున రూ.1,038.36 కోట్లకు బేరం కుదిరింది. అయితే ఇదే భూమిని 2010లోనే ఎస్బీఐ రూ.13.33 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. నిర్ణీత సమయంలో వినియోగించకుంటే ఆ భూమిపై బ్యాంకు హక్కు కోల్పోతుందని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే, భూమిని తిరిగి వెనక్కి తీసుకొనే క్లాజు సేల్డీడ్లోగాని, మరే ఒప్పందపత్రంలోగాని లేదని బ్యాంకు వాదన. మే 20న రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు రద్దు చేసినట్లు తెలియజేసింది. అయితే ఆ లేఖ తమకు చేరలేదని బ్యాంకు అంటున్నది. ఆ భూమిలో నిర్మాణ పనులకు మరింత సమయం కావాలని బ్యాంకు చేసిన అభ్యర్థనను సర్కార్ అంగీకరించలేదని తెలుస్తున్నది. ఈ వివాదం తలెత్తగానే మరోచోట 2.30 ఎకరాల భూమిని కేటాయిస్తామనే ప్రతిపాదనను ప్రభుత్వ అధికారులు బ్యాంకు ముందుకు తెచ్చారు. దానికి బ్యాంకు అంగీకరించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే, ఆ ప్రతిపాదనకు కట్టుబడి ఉండకుండా చట్టపరంగా న్యాయం కోరుతూ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. ఇదంతా చూస్తుంటే ఆనాటి అమ్మకపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించలేదా? అనే అనుమానం కలుగుతున్నది.
ఇక రాష్ట్ర సర్కార్‌కు సదరు బ్యాంకుపై ఉన్న కోపం చూస్తే విడ్డూరంగా ఉన్నది. ఎస్బీఐలో ప్రభుత్వ లావాదేవీల వివరాలు కావాలని ఈనెల 19వ తేదీన అన్ని విభాగాల ప్రభుత్వ కార్యదర్శులకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ఖాతాలు, లావాదేవీలు ఎస్బీఐ నుంచి వేరే బ్యాంకులకు మార్చే ప్రక్రియ మొదలైంది. సుమారు 80% ప్రభుత్వ చెల్లింపులు ఎస్బీఐ ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఎస్బీఐని దూరం పెట్టవచ్చేమో కానీ రాష్ట్రంలో బ్యాంకు సేవలను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఈ వివాదం కారణంగా రాష్ట్రంలోని వేతనజీవులు, పింఛనుదారులు వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరవటం శ్రమతో కూడిన వ్యవహారం. ఒకవేళ చర్చల ద్వారా భూ సమస్య పరిష్కారమైతే మళ్లీ వెనక్కి వెళ్లటం మరో తలనొప్పి.
ఎస్బీఐని రాష్ట్రంలో లీడ్‌బ్యాంక్ హోదా నుంచి తప్పిస్తామని కూడా మన సర్కార్ చెప్తున్నది. లీడ్ బ్యాంకు స్కీమ్‌పై అవగాహన లేనివారే ఇలా మాట్లాడుతారు. రాష్ట్రంలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంకును ఆర్బీఐ స్టేట్ లీడ్ బ్యాంకుగా నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో అన్ని బ్యాంకులకు ప్రభుత్వ పథకాల సమన్వయకర్తగా పెద్దన్న పాత్రను లీడ్ బ్యాంకు నిర్వహిస్తుంది. ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకులు పాటిస్తున్న విధానాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో బ్యాంకుల పాత్రను పరిశీలించే అధికారం లీడ్ బ్యాంకుకు ఉంటుంది. రాష్ట్రంలో, జిల్లాల్లో అధిక శాఖలు ఉన్న బ్యాంకుకు సహజంగా ఈ హోదా దక్కుతుంది. దీనిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ప్రతి యేడూ చివర్లో ఎస్ఎల్ బీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకులు ఇచ్చే రుణాల లక్ష్యాలను నిర్ధారించే బాధ్యత లీడ్ బ్యాంకుపై ఉంటుంది. రాష్ట్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కూడా ఎస్బీఐ ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఈ కోపం ఆ బ్యాంకు మీద కూడా చూపించవలసి వస్తుంది.
తమ ఖాతాలను ఇష్టమైన బ్యాంకుల్లో నిర్వహించే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉన్నది. అయితే భూమి విషయంలో తకరారు పెడుతున్నదనే కోపంతో ఎస్బీఐపై కక్షసాధింపు సరైంది కాదు. బ్యాంకు సేవల్లో విఘాతం ఉంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకొనే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ న్యాయవివాదాల కారణంగా ఫండ్స్ మరో బ్యాంకుకు మార్చటం బెదిరింపు చర్య అవుతుంది. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేపట్టే ఈ చర్య రాష్ర్టానికి నష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ తగాదాలను కేంద్రం, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనకు ఢిల్లీ పెద్దలు అనుకూలంగా స్పందిస్తారన్న ఆశ లేదు.
ఈలోగా బ్యాంకుకేదో నష్టం చేయాలనే దృష్టితో ఖాతాలు తొలగిస్తే వివాదాన్ని మరింత లాగినట్లే అవుతుంది. ఇదిలావుండగా, 2024 ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వం, ఎస్బీఐ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం, తమ బాధ్యత లేదని బ్యాంకు అనటంతో వివాదం కోర్టు దాక వెళ్లింది. దాంతో ఆ సర్కార్ ఎస్బీఐని పక్కనబెట్టింది. అయితే ప్రభుత్వ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చటం ద్వారా నిధుల నిర్వహణ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఉద్యోగులు వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరువకపోవటంతో ఆ మేరకు లావాదేవీలను ప్రభుత్వం ఎస్బీఐతో నెరపక తప్పటం లేదు.
– బద్రి నర్సన్