Tata Nano : భారతీయ వాహన రంగంలో టాటా సంస్థ రూపొందించిన నానో కారు ఒక సంచలనం. అనుకున్నంత విజయం సాధించకపోయినా.. భారతీయులపై నానో కారు చూపిన ప్రభావాన్ని మర్చిపోలేం. సామాన్యుడికి కూడా తక్కువ ధరలోనే కారు (ఫోర్ వీలర్) అందించాలనే టాటా ప్రయత్నం మెచ్చుకోదగ్గదే. 2009లో మార్కెట్లోకి విడుదలైన ఈ కారు 2018లో నిలిచిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా. అదీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా. త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈవీల హవా నడుస్తోంది. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కూడా ఈవీ మోడల్లో వస్తున్నాయి.
ఈవీ కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది. అందులోనూ టాటా నానో తరహా ఈవీ, కాంపాక్ట్ కార్లు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నకార్లను కోరుకుంటున్నారు. అందువల్ల నానో ఈవీకి ఇదే మంచి టైమ్ అని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తగ్గట్లే నానో ఈవీని కంపెనీ రూపొందిస్తున్నట్లు సమాచారం. నానో ఈవీ అందుబాటులోకి వస్తే అనేక రకాలుగా ఉపయోగం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు చిన్న సైజ్‌లో ఉంటుంది. దీంతో సిటీ రోడ్ల మీద సులభంగా తిరగడానికి వీలుంటుంది. అలాగే, తక్కువ స్పేస్‌లోనే ఈజీగా పార్క్ చేయొచ్చు. ఈవీ కాబట్టి, ఖర్చు తక్కువ. మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. దీంతో టూ వీలర్స్ నుంచి చాలా మంది ఈజీగా నానో ఈవీకి మారిపోతారు. అందులోనూ మొదటిసారి కార్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. రెండో చిన్న కార్ కొనేవారికి కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. అయితే, గతంలోలాగా తక్కువ ధర అనే కాన్సెప్ట్ మాత్రమే కాకుండా.. ఈసారి సేఫ్టీ, స్టైల్, ఫీచర్స్, డిజైన్ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది అనేది వాహనదారుల మాట.
ప్రధానంగా మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉండాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే, బెటర్ పెర్ఫామెన్స్, మంచి ఇంటీరియర్, లేటెస్ట్ స్మార్ట్ టెక్నాలజీ వంటివి యాడ్ చేస్తే నానోకు తిరుగుండదు. సైజ్, కాస్ట్ తక్కువగా ఉన్న పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం వెనుకడుగు వేయొద్దని ప్రజల ఆలోచన. ఇందుకు అనుగుణంగా నానో ఈవీ వస్తే మంచి సక్సెస్ సాధించడం ఖాయం. ఇక, టాటా ఇప్పటికే ఈవీ కార్లలో దూసుకెళ్తోంది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీతోపాటు కొన్ని ఎస్‌యూవీలను కూడా లాంఛ్ చేసింది. ఇవన్నీ మంచి విజయం సాధించాయి. మరి టాటా నానో ఈవీ కూడా ఈ లిస్టులోకి వెళ్తుందేమో చూడాలి. అయితే, నానో ఈవీపై టాటా సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.