భారత్ ఈ ఏడాది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న జపాన్ను భారత్ దాటేస్తుందని ఓ నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యన్ ఈ సరికే దాటేసిందని గతవారం ఓ ప్రకటన ఇచ్చేశారు. దీనిపై ఆర్థిక నిపుణులలో ఏకాభిప్రాయం లేదన్నది వేరే సంగతి. మోదీ అనుకూల జాతీయ మీడియాకు ఈ శషభిషలు ఏమీ ఉండవు కదా! దేశం ఓ గొప్ప ఆర్థిక మైలురాయి దాటేసిందని, ఏకంగా జపాన్నే ‘ఓడించిందని’ టాంటాం వేస్తున్నది. మోదీ ‘విజన్-47’ అప్పుడే ప్రభావం చూపుతున్నదని చర్చలతో, విశ్లేషణలతో ఆకాశానికెత్తుతున్నది.
ఇదంతా పదకొండేండ్ల బీజేపీ పాలన వల్లే సాధ్యమైందంటూ ఊదరగొడుతున్నది. నాలుగో సంఖ్య చెప్తున్నది ఎంత? దాస్తున్నది ఎంత? సగటు భారతీయునికి దీనివల్ల దక్కేదేమిటి? ‘మాది ఇంత గొప్ప ఆర్థిక వ్యవస్థ’ అని జబ్బలు చరుచుకోవడం వరకు సరే. తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచీ వంటి అంశాల్లోకి తొంగిచూస్తే కనిపించే వాస్తవాలు వేరేగా ఉన్నాయి. మన తలసరి జీడీపీ 2,500 డాలర్ల కంటే తక్కువగానే ఉన్నది. అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. అదే శిశు మరణాల రేటులో మాత్రం (24.5 శాతం) ఐదు అగ్రస్థాయి దేశాల్లో శిఖరాగ్రంలో ఉన్నాం.
ఈ మధ్యకాలంలో మోదీనామిక్స్ అనే పదబంధాన్ని కొందరు ఉపయోగిస్తున్నారు. మోదీ హయాంలో అమలైన ఆర్థిక విధానాల సారాంశంగా వారు దీన్ని ఎంచుకొని ఉండవచ్చు. ఇంతకూ ఆ విధానాల రూపురేఖలు ఏమిటనేది పరిశీలిస్తే నిరాశాజనకమైన దృశ్యమే ఆవిష్కృతమవుతుంది. ప్రపంచ కుబేరుల సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. మరి అంతరాల మాటేమిటి? కుబేరుల సంఖ్యను బట్టి దేశ ప్రజల స్థితిగతులను అంచనా వేయలేం. జీడీపీ తలసరిలో మన ర్యాంకు 144. కొనుగోలు శక్తి అంతరాల్లో 127. మనం ఓడించామని ప్రచారం చేస్తున్న జపాన్లో తలసరి జీడీపీని మనం ఇప్పట్లో అందుకునే అవకాశమే లేదు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన సంపద భారీగా కనిపించవచ్చు. కానీ, తలాపిడికెడు అంటే మాత్రం ఎక్కడా నిలవలేం. సంపన్నులు మరింత సంపన్నులవుతుంటే, పేదలు మరింత పేదలవుతున్నారు. భారతదేశంలో దుర్భర పేదరికం దశాబ్ద కాలంలో 27.1 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గిందని తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రకటించడాన్ని కూడా కేంద్రప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. కానీ, రోజుకు 3 డాలర్ల కనీస ఆదాయం ఆధారంగా ఈ అంచనా వేస్తారనే సంగతి దాచేస్తున్నారు.
డాలర్ రూ.80కి అటిటుగా అనుకున్నా రోజుకు 250 రూపాయలతో గౌరవప్రదమైన జీవితం సాధ్యమేనా అనేది ప్రశ్న. శిఖరాగ్రంలో ఉన్న ఒక శాతం సంపన్నుల దగ్గర 40 శాతానికిపైగా దేశ సంపద మూలుగుతున్నది. 10 శాతం దగ్గర అయితే 77 శాతం సంపద ఉన్నది. అట్టడుగుస్థాయిలోని 50 శాతం జనాభా దగ్గర 11 శాతం సంపద మాత్రమే ఉన్నది. సంపద పంపిణీలో దారుణమైన వ్యత్యాసాలు ఇంకా కొనసాగుతుండటం సంబురాలు చేసుకునే విషయమైతే కాదు.