హైడ్రా కూల్చివేతల తతంగం ఇష్టారాజ్యంగా, అమానుషంగా కొనసాగుతున్నది. అది రాజ్యాంగేతర శక్తిలా విరుచుకుపడుతున్నది. నిస్సహాయులైన సామాన్యులను కడగండ్ల పాలు చేస్తున్నది. శత్రుదేశం మీదకు శతఘ్నులను నడిపినట్టుగా పేదల గుడిసెల మీదకు బుల్డోజర్లను తోలుతున్నది. కష్టజీవులు పైసా పైసా పోగేసి కట్టుకున్న పూరిండ్లను, రేకుల షెడ్లను కనికరం లేకుండా ధ్వంసం చేస్తున్నది. పిల్లల పుస్తకాలు, ఆటబొమ్మలు చెల్లాచెదురవుతున్నాయి. పేదోడి కంచంలో అన్నం మెతుకు కూల్చివేత దృశ్యాలు గాజాను తలపిస్తున్నాయి.
పిల్లలకు అన్నం తినిపించేందుకూ సమయం ఇవ్వకుండా ఇండ్లను క్షణాల్లో నేలమట్టం చేయడం అమానుషమే. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో బుల్డోజర్లు తాజాగా సృష్టించిన బీభత్సం ఏ మాత్రం క్షమార్హం కాదు. భగీరథమ్మ చెరువు ఆక్రమణల తొలగింపు పేరిట కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చి బుల్డోజర్లతో విధ్వంసకాండకు పాల్పడటం హృదయాన్ని కలచివేసింది. పైగా ‘మానవతా దృక్పథంతో 24 గంటల సమయమి చ్చి మరీ కూల్చేసినట్టు కమిషనర్ వివరణ ఇవ్వడం మరింత విడ్డూరం. కొత్త సంవత్సరం ప్రారంభానికి కొన్ని గంటల ముందు నిరుపేదలను తట్టాబుట్టతో రోడ్డుపైకి ఈడ్చి ఏం బావుకుంటరు?
ఖాజాగూడ హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అమ్మా అన్నం పెట్టు’ అని అడుగుతుంటే గూడు చెదిరిన తల్లి ఏం చేస్తుంది? శిథిలాల మధ్య చిన్నపిల్లలు బిక్కుబిక్కుమంటూ నిల్చున్న దృశ్యం ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తుంది. కనికరం లేని సర్కారు కనీస గడువు ఇవ్వకుండా యంత్ర భూతాలకు పనిచెప్పడం హేయం. హైకోర్టు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించడమే అందుకు నిదర్శనం.
నిజానికి హైడ్రా తెంపరితనంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. వివరణ కోరకుండా, గడువు ఇవ్వకుండా కూల్చివేతలు వద్దని ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ చివరలో హైడ్రా కమిషనర్‌ను కోర్టుకు పిలిపించి మరీ హెచ్చరించింది. పొలిటికల్ బాస్‌ల మాట వింటే జైలుకే వెళ్తారని తీవ్రంగానే మందలించింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని, చట్టబద్ధమైన సంస్థ కాదనీ తేల్చిచెప్పింది. ఏది చేసినా చట్టబద్ధంగా షోకాజ్ ఇచ్చి, వివరణకు తగు గడువు ఇచ్చి ఆ తర్వాతే చర్యలు చేపట్టాలని నొక్కిచెప్పింది. అయినా హైడ్రా తీరు మారలేదు. కోర్టును ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు మరోసారి కమిషనర్‌ను తమ ముందుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించాల్సి వచ్చింది.
హైడ్రా దుందుడుకుతనంతో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఖాజాగూడలో కూల్చిన ఇండ్లల్లో ఎక్కువగా వలస కూలీలే నివసిస్తున్నారు. ఏ ప్రాంతం వారు వచ్చినా అక్కున చేర్చుకొని బతుకుదెరువు చూపి ఆదరించే కల్పవల్లి లాంటి హైదరాబాద్ నగరానికి హైడ్రా చర్యలతో చెడ్డపేరు వస్తున్నది. ఆక్రమణలు జరిగితే తొలగించాల్సిందే. ఎవరూ కాదనరు. హైడ్రా ఏం చేసినా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. నిస్సహాయుల మీద నిరంకుశ అధికారం చెలాయించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వాదన వినిపించేందుకు బాధితులకు గడువు ఇవ్వక తప్పదు. అది వారి హక్కు. ఆ హక్కును ఉక్కుపాదంతో తొక్కేయడం సరికాదు. హైడ్రా పనితీరు పదే పదే కోర్టుల అభిశంసనకు గురవుతుండటం దురదృష్టకరం.