గత మార్చి నెల 30వ తేదీన టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్) చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. అసలు ఇవి రాత పరీక్షలో వచ్చిన మార్కులేనా లేక ఆబ్జెక్టివ్ టైప్ (మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్) తరహా పరీక్షలో వచ్చిన మార్కులా అని అనుమానం వస్తున్నది. మార్చి 10వ తేదీన విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్స్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు చాలాసార్లు అనుమానాలను వ్యక్తం చేస్తూనే వచ్చారు. అది ఈరోజు జీఆర్‌ఎల్‌లో స్పష్టమైంది. నియమ, నిబంధనలు అంటూ లేకుండా మూల్యాంకనం చేయడం వల్లనే ఈ రోజు ఊహకందని మార్కులు ఒక వైపు, ఎంతో కష్టపడి కంటెంట్‌తో జవాబులు రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం మరోవైపు కనిపిస్తున్నాయి. ఇంతటి హెచ్చుతగ్గులు ఎలా జరిగాయో తెలుసుకుందాం.
మొదటి నుంచే ఆటంకాలు: ‘గ్రూప్-1’ ఒక పరీక్ష మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలను సరైన క్రమంలో నడిపించే ఒక సైన్యానికకి గీటురాయి. ఇంతటి ప్రత్యేకత ఉన్న పరీక్షను నవ్వులపాలు చేసింది టీజీపీఎస్సీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆ తదనంతరం మెయిన్స్ పరీక్షకు వి డుదల చేసిన రోస్టర్ పద్ధతికి వచ్చేసరికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత జీవో 55 ను రద్దుచేసి జీవో 29 ద్వారా మెయిన్స్ పరీక్ష నిర్వహించి బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. ముఖ్యంగా బీసీ-బీ, బీసీ-డీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇన్ని సమస్యలున్నా, మంచి మార్కులతో ఉద్యోగం సాధిస్తాంలే అనే నమ్మకంతో, ఆశతో దాదాపు 20,000 మంది విద్యార్థులు గ్రూప్-1 మెయిన్స్‌ను రాశారు.
కనీస నియమాలు పాటించని కమిషన్: గ్రూప్-1 మెయిన్స్ పూర్తయిన తర్వాత వెంటనే కమిషన్ మూల్యాంకనం కోసం కసరత్తు సిద్ధం చేసింది. ఎవరో తరుముతున్నట్టు హడావుడిగా పూర్తిచేసింది. నవంబర్ 1న ప్రారంభించి జనవరి 30లోపు పూర్తిచేశామని కమిషన్ తన వెబ్‌నోట్‌లో తెలిపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అదే రోజు ఆ వెబ్‌నోట్‌ను వెబ్సైట్ నుంచి కమిషన్ తొలగించింది. గ్రూప్-1 పేపర్లు ఇంతమంది ప్రొఫెసర్లతో దిద్దించాం అని చెప్పడం, దానికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌నోట్ విడుదల చేయడమనేది అసలు దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చేయలేదు. ఇదొక వింత. కొంతమంది అభ్యర్థులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఒక్కో పేపర్‌ను కేవలం 10-15 నిమిషాల్లో మూల్యాంకనం చేశారని తెలిసింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన 15 ప్రశ్నలున్న రాత పరీక్షలో ఒక్కో పేపర్‌కు దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అంటే ఇక్కడే అర్థమవుతున్నది టీజీపీఎస్సీ మూల్యాంకనం ఏ విధంగా ఉన్నదో. ఇదిలా ఉంటే, గ్రూప్-1 మెయిన్స్‌లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. చాలామంది అభ్యర్థులు 350-450 మార్కుల వద్దే ఆగిపోయారు. దీనికి కారణం ఏమంటే… తెలుగులో మూల్యాంకనం చేసేటప్పుడు ఒక నియమం అంటూ పాటించకపోవడమని తెలుస్తున్నది.
కండ్లు బైర్లు కమ్మే మార్కులు, ర్యాంకులు: పోటీ పరీక్షలో, అందులోనూ ఒక రాత పరీక్షలో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. దేశంలో యూపీఎస్సీ నుంచి రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వరకు సగటున ఒక టాపర్ మొత్తం మార్కుల్లో (గ్రాస్ టోటల్లో) 55 శాతానికి మించి మార్కులు రావు. సహజమైన బెంచ్ మార్క్‌గా దీనిని పాటిస్తుంటారు. కానీ, టీజీపీఎస్సీ విషయంలో మార్కులు కొందరికి బుర్జ్ ఖలీఫాని మించిపోయాయి. మరికొందరికి కొన్ని సబ్జెక్టులో ఏకంగా 150కి 45 మార్కులు కూడా రాని పరిస్థితి.
మూల్యాంకనం అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. రాత పరీక్షలో ఒక 10 మార్కుల ప్రశ్నకు అద్భుతంగా రాస్తే 6.5, సాధారణంగా రాస్తే 5-5.5, లేదా ఎలాంటి విషయం లేకుండా రాస్తే 3-4 మార్కులు వేస్తారు. ఇది అందరు పాటించే పద్ధతి. కానీ, మొన్న వచ్చిన గ్రూప్-1 మార్కులు టెన్త్ క్లాస్ విద్యార్థుల మార్కులకు పోటీగా వేయడమనేది ఒక విచిత్రం. ఇదిలా ఉంటే, మరికొందరు కొన్ని సబ్జెక్టులు బాగా రాసినప్పటికీ 150కి కేవలం 45-55 మార్కులు కూడా దాటలేదు. ముఖ్యంగా 420-460 మార్కులు సాధించిన అభ్యర్థులకు వ్యాసరూపం (పేపర్-1), తెలంగాణ ఉద్యమ పేపర్ (పేపర్-6) మూల్యాంకనం కొంప ముంచింది. ఈ రెండు పేపర్ల మూలా ్యంకనం సరిగా జరగకపోవడం వల్ల కొందరికి నష్టం జరిగింది. ఈ పేపర్లలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారు 480 మార్కుల పైన సాధించారు. వాస్తవానికి అభ్యర్థులందరూ తెలంగాణ ఉద్యమం పేపర్‌కు సంబంధించి జవాబులు బాగా రాస్తారు. కానీ, ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చిందో అర్థం కావడం లేదు.
మాకు ఉన్న సమాచారం మేరకు రెండవసారి మూల్యాంకనం దశలో ఈ 480, 500 పైచిలుకు మార్కులు సాధించిన అభ్యర్థులకు భారీగా మార్కులు పడ్డాయని తెలిసింది. ఒక్కో జవాబుకు కనీసం ఒక్క మార్కు పడినా 60-70 ప్రశ్నలకు ఒకే సారి 70 మార్కులు పెరిగే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల అభ్యర్థులు 480, 490, 520, 530 వరకు చేరుకోగలిగారని సమాచారం.
జనరల్ ర్యాంకింగ్ లిస్టులో విచిత్రమైన మార్కులు: రాత పరీక్షలకు, ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు చాలా అరుదుగా వస్తుంటాయి. కానీ, టీజీపీఎస్సీ విషయంలో సేమ్ మార్క్స్ ఎంతమందికైనా రావచ్చు అనుకోవాలి. 451 మార్కులు 31 మందికి, 450 మార్కులు 18 మందికి, 452 మార్కులు 22 మందికి, 453 మార్కులు 19 మందికి, 454 మార్కులు 15 మందికి, 456 మార్కులు 20 మందికి.. ఇలా 500 వరకు ఒకే మార్కులు అనేకమంది అభ్యర్థులకు వచ్చాయి. ఇదొక విడ్డూరం. 500 మార్కులు దాటినవారి సంఖ్య 52. ఇదింకో విచిత్రం. దీని ద్వారా ఈ రోజు 450 వచ్చిన అభ్యర్థులు అంటే మొత్తం గ్రాస్ మార్కుల్లో (900) సగం 50 శాతం సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ టీజీపీఎస్సీ కమిషన్ కల్పించింది. ఇవే మార్కులు దేశంలోని ఇతర రాష్ర్టాల పరీక్షల్లో సాధిస్తే రాష్ట్ర టాపర్‌గా ఉండేవారు. కానీ, మన రాష్ట్రంలో ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతటి అడ్డగోలుగా, ఒక నియమం, నిబంధన అంటూ లేకుండా మూల్యాంకనం చేసిన టీజీపీఎస్సీ వేలాది మంది అభ్యర్థులను మోసానికి గురిచేసింది. అందుకే వారు, కమిషన్ తీరుపై మండిపడుతున్నారు.
న్యాయం కోసం ఎదురుచూపు: ఇంత ఘోరంగా మూల్యాంకనం చేసిన టీజీపీఎస్సీ ఈరోజు ఎంతోమంది అభ్యర్థుల రోదనకు కారణమైంది. అందుకే, ఇప్పటికైనా రీ వ్యాల్యూయేషన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక కేసు కోర్టులో ఉన్నందున కోర్టు సైతం కమిషన్‌కు కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువును ఇచ్చింది. ఇంతలోనే జీఆర్‌ఎల్‌ను విడుదల చేసింది. కోర్టు పరిధిలోనే అనేకమంది అభ్యర్థులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని న్యాయమూర్తులను కోరుతున్నాం.
– కన్నోజు శ్రీహర్ష
89851 30032