ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ‘మూర్ఖపు గాడిద’ కథ బాగా వైరల్ అయ్యింది. ఆ మూర్ఖపు గాడిద వారసులుగా కొంతమంది రాజకీయ నేతలు తెలంగాణలో తయారై తాము చెప్పే అబద్ధాలను నిజమని నమ్మించేందుకు తంటాలు పడుతున్నరు. కండ్ల ముందు కనిపిస్తున్న వాటిని కూడా చూడ నిరాకరిస్తూ వక్ర భాష్యాలు చెప్తున్నరు. నిందారోపణలు చేస్తున్నరు. ఆ మూర్ఖపు గాడిద కథ మీ కోసం…
ఒక అడవిలో గడ్డి రంగు గురించి ఒక గాడిద పులితో ఇలా వాదించడం మొదలు పెట్టింది.
గాడిద: ఈ గడ్డి నీలం రంగులో ఉంది చూశావా?!
పులి : నీకేమైనా పిచ్చా? గడ్డి ప్రపంచంలో ఎక్కడైనా పచ్చగానే ఉంటుంది కదా?
గాడిద: అదంతా నాకు తెల్వదు. ఈ గడ్డి నా కళ్లకు నీలంగానే కనిపిస్తున్నది!
గడ్డి ‘రంగు’ ఏ రంగులో ఉంటుందనే వాదన చివరికి రచ్చగా మారింది! ఎవరి వాదన సరైందో తెలుసుకోవడానికి మృగరాజును ఆశ్రయించాయి.
సింహాసనంపై సింహం ఠీవిగా కూర్చొని ఉంది. గాడిద నక్క వినయం ప్రదర్శిస్తూ…
గాడిద: ప్రభూ గడ్డి నీలం రంగులో ఉంటుందన్న నిజాన్ని మీరు కాదంటారా?!
సింహం : నిజమే కదా! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది!
గాడిద: చూడండి ప్రభూ… ఈ మతి లేని పులి నేను చెప్తే ఒప్పుకోవడం లేదు. ఈ పొగరుబోతును కఠినంగా శిక్షించండి.
వెంటనే మృగరాజు తన తీర్పును ప్రకటించింది.
సింహం- ఈ పులి ఐదేళ్లు నోరు మూసుకుని ఉండాలని శిక్ష విధిస్తున్నాను!
గాడిద సంతోషంగా గంతులేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మృగరాజు తీర్పు విని పులి విస్తుపోయింది. అయిష్టంగానే తనకు విధించిన శిక్షను అంగీకరించింది.
పులి : ప్రభూ… గడ్డి ఆకుపచ్చగా ఉంటుందని తెలిసి కూడా మీరు నన్నెందుకు శిక్షించారు?
సింహం: నిజమే! గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది. ఎవరు కాదన్నారు?!
పులి : మరయితే నన్నెందుకు శిక్షించారు?
సింహం- గడ్డి రంగు గురించి కాదు నీకు శిక్ష విధించింది. నీలాంటి మేధావులు, ధైర్యవంతులు ‘గాడిదల’తో వాదించి కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. పైగా నా దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు. అందుకే నీకు మౌన శిక్ష విధించాను.
కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నా ఏమీ లేనేలేదని కొందరు వాదిస్తున్నారు! కాళేశ్వరం జల సిరులు, రికార్డు స్థాయి ధాన్యం దిగుబడులు, వెల్లువెత్తుతున్న పెట్టుబడులు, పటిష్ఠంగా ఉన్న శాంతి భద్రతలు…. ఇవేమీ వారు పట్టించుకోరు. వారి కళ్లు మూసుకుపోయి ఉంటాయి. పగ, ప్రతీకారాలతో వారు రగిలిపోతూ ఉంటారు. వాళ్లు కోరుకునేది ఒక్కటే, తాము చెప్పింది సరైంది కాకపోయినా, అదే సరైనదని వాదించడం! నిజాలను, వాస్తవాలను పట్టించుకోని ఇలాంటి వారితో వాదించడమంటే విలువైన సమయాన్ని వృథా చేసుకోవడమే. ఇంతకీ వారెవరో మీకు తెలియదా!