కేంద్ర ప్రభుత్వం 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ కాలయాపన కోసమే ఉద్దేశించినదని తెలంగాణ ప్రజలకు తెలుసు. కమిటీకి నివేదికలు సమర్పించాలా వద్దా అనే విషయంలో తెలంగాణ వ్యాప్తంగా చాలా తర్జనభర్జన జరిగిన తర్వాత అంతిమంగా కమిటీకి నివేదికలు సమర్పించడమే సరైనదనే తెలంగాణవాదులు నిర్ణయానికి వచ్చారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు నివేదికలు తయారు చేసే పనిలో పడినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ రంగంలో తెలంగాణాకు జరిగిన అన్యాయాలను, ముల్కీ రూల్స్, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను తయారు చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం సంకల్పించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో ఉద్యోగుల సంఘం నేతలు ‘ముల్కీ రూల్స్ పునరుద్ధరణ ఆవశ్యకత’పై ఒక పుస్తకాన్ని, రచించారు. 2009లో అదే అంశంపై మరొక సమగ్రమైన పుస్తకాన్ని రాసి ఉన్నారు. కాబట్టి ఈ అంశంపై శ్రీధర్‌రావు దేశ్‌పాండే వద్ద సమగ్రమైన సమాచారం ఉండింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే నివేదిక తయారీ కోసం మరింత పరిశోధనలు జరిపి అదనపు సమాచారాన్ని సేకరించి పెట్టారు. నెల రోజులు శ్రమించి ఉద్యోగ రంగ సమస్యలపై ఒక అద్భుతమైన నివేదికను తయారు చేశాము. ఈ కృషిలో దేశ్‌పాండే భాగస్వామ్యం ముఖ్యమైనది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి ప్రభుత్వంలో సాగునీటి మంత్రి హరీశ్‌రావు గారి వద్ద ఓఎస్డీగా దేశ్‌పాండే చేరడము, అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ప్రభుత్వం నన్ను నియమించడంతో సాగునీటి ప్రాజెక్టులపై.. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలపై అనేక కేసులపై వాదనలు వినిపించే విషయంలో తరచూ కలుసుకునే అవకాశం కలిగేది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఎన్జీటీలో ప్రాజెక్టులపై పలువురు వేసిన కేసులపై అఫిడవిట్లు తయారు చేసి కేసుల నుంచి బయటపడేయడంలో దేశ్‌పాండే నాకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించేవారు. అట్లే ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు ఎన్జీటీలో బలమైన వాదనలు వినిపించడానికి దేశ్‌పాండే, ఆయన సహచరులు సమాచారం ఇచ్చారు.
ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి సుదీర్ఘ కాలం ప్రయాణించాం. మా మధ్య స్నేహానికి మించిన అనుబంధం బలపడింది. ఆ చొరవతోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విశ్లేషణా వ్యాసాల సంకలనానికి నన్ను ముందుమాట రాయుమని దేశ్‌పాండే అడిగారు. గినారు. కమిషన్ 665 పేజీల నివేదికను 2025 జూలై 31ననే ప్రభుత్వానికి సమర్పించినా ఆగస్ట్ 31న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతనే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నివేదికలోని సాంకేతిక అంశాలపై సమగ్ర విశ్లేషణ అవసరమైంది. ఈ విశ్లేషణ చేయగలిగే సమర్థుడైన వ్యక్తి దేశ్‌పాండే అనిపించింది. అప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని తెలిసి ఫోన్ చేశాను. నివేదికపై నోట్ రాసి పంపుమని కోరాను. కమిషన్ నివేదికను మెయిల్ చేశాను. నా మాట కాదనలేక సరేనని అన్నారు. నివేదికను చదివి ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘అన్నా.. ఇది ఒక నోట్‌తో అయ్యే పని కాదు. కమిషన్ ప్రధానంగా దృష్టి పెట్టిన ఎనిమిది అంశాలపై సమగ్రమైన విశ్లేషణ చేయాల్సి ఉన్నది. అవి రాసిన తర్వాత మీకు పంపుతాను’ అని అన్నారు. నేను సరే అన్నాను. అక్టోబర్ నెలలో విశ్లేషణా వ్యాసాలూ పూర్తి చేసి నాకు పంపించారు.
ఘోష్ కమిషన్ నివేదిక మరొక శ్రీకృష్ణ కమిటీ నివేదికగా తేలిపోయిందని దేశ్‌పాండే నిర్ధారించారు. నివేదికలో Intellectual dishonestyని బలంగా నొక్కి చెప్పారు. ఇది ఒక సాహసమే అనుకోవాలి. 2010 డిసెంబర్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత ఆ నివేదికను విశ్లేషించి ‘తెలంగాణ ప్రజల పట్ల విశ్వాస ఘాతుకం శ్రీకృష్ణ కమిటి నివేదిక’ అనే పుస్తకాన్ని 2011 ఫిబ్రవరిలో వెలువరించారు. ఆ అనుభవంతోనే ఈ పుస్తకానికి ‘మరో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక’ అని శీర్షిక ఎంచుకున్నారని అనుకుంటున్నాను.
ఈ పుస్తకంలో దేశ్‌పాండే నిర్ధారణలు అక్షరాల నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే కమిషన్ సాంకేతిక అంశాల్లోనే కాదు చట్టపరమైన అంశాల్లోనూ తప్పులో కాలు వేసింది. విచారణ కమిషన్ చట్టంలో ఉన్న 8 (బీ), 8 (సీ) సెక్షన్లను కమిషన్ అసలే పట్టించుకోలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్, సాగునీటిశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ చీఫ్ సెక్రటరి ఎస్కే జోషీ, ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులను సాక్షులుగా కమిషన్ విచారణకు పిలిచింది. కానీ వారికి వ్యతిరేకంగా ఎవరు, ఏ సాక్ష్యం చెప్పారో తెలియపరచలేదు. సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాన్ని కమిషన్ వారికి కల్పించలేదు. కనీసం సాక్షుల అఫిడవిట్లను అందజేసి వాటికి వివరణలు ఇచ్చే ఆవకాశాన్ని కూడా ఇవ్వలేదు. నివేదిక బయటపడిన తర్వాత గానీ కమిషన్ దోషులుగా నిలబెట్టిందని వారికి తెలియరాలేదు. ఇది వారి హక్కుల ఉల్లంఘన, విచారణ కమిషన్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుంది. దేశంలో ఇటువంటి అనేక విచారణ కమిషన్ నివేదికలను సుప్రీంకోర్టు కొట్టి వేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉల్లంఘనలను హైకోర్టు దృష్టికి తీసుకుపోయాం. ఈ కేసుల్లో ఇటీవలే వాదనలు ముగియగా, తీర్పు వెలువడాల్సి ఉన్నది. ఈ కేసుల సందర్భంగా సాంకేతిక అంశాలను హైకోర్టుకు వివరించడంలో దేశ్‌పాండే విశ్లేషణలు మాకు చాలా సహాయపడినాయి.
ఉద్యమంలో, ఆ తర్వాత కూడా తెలంగాణ సాగునీటి రంగ అభివృద్దిలో తన వంతు పాత్రను చిత్తశుద్ధితో, సమర్థవంతంగా నిర్వహించిన దేశ్‌పాండేకు మాటలతో కృతఙ్ఞతలు సరిపోవు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన తపన, మేధస్సు అంతా తెలంగాణ కోసమే వెచ్చిస్తున్నారు. 2025లో నాలుగు పుస్తకాలు ప్రచురించారు. 2026 లో పీసీ ఘోష్ కమిషన్ విశ్లేషణ వ్యాసాల పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. ఆయన కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా మేధో కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. పుస్తకాన్ని చదివి ఘోష్ కమిషన్ నిర్ధారణల్లో లోపాలను పాఠకులు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకానికి ముందుమాట రాసే అవకామిచ్చిన దేశ్‌పాండేకు దాన్యవాదాలు.. సెలవు.
(వ్యాసకర్త: మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్)
(మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక పుస్తకానికి రాసిన ముందుమాట నుంచి)
(నేడు ‘మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక’ పుస్తకావిష్కరణ సందర్భంగా )
– జె.రామచంద్రరావు