శ్రీలంక అధ్యక్షుడిగా 55 ఏండ్ల అనూరకుమార దిస్సనాయకే ఎన్నిక కావడం ఈ ద్వీపదేశంలో మార్పులకు సంకేతం. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఆశమార్పు’ అనే మాటలు ఆఫ్రికన్-అమెరికన్ జూనియర్ సెనెటర్ బరాక్ ఒబామాకు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పదవిని కట్టబెట్టాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ తునాతునకలై దివాలా మార్గంలో పయనిస్తున్న లంకను ఒడ్డున చేర్చే శక్తి అనూరకు ఉందనే ఆశ, పాలనలో పరివర్తన వస్తుందనే అంచనాలు లంక అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక ఫలితానికి నాంది పలికాయి.
అనూర నాయకత్వంలో జనతా విముక్తి పెరమునా (జేవీపీ) అధ్యక్ష పీఠం ఎక్కడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని కులీన కుటుంబాలకు చెందిన నేతలే దేశాధ్యక్ష, ప్రధానమంత్రి తదితర ఉన్నత పదవులను చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన తొలితరం నాయకుడు అనూర అధ్యక్ష పీఠమెక్కడం విశేషం.
Sri Lanka | లంకలోని సెంట్రల్ ప్రావిన్స్‌లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న ఓ కుటుంబంలో అనూర జన్మించారు. అతని తండ్రి ప్రభుత్వ చిరుద్యోగి. అనూర చదువుకున్న పాఠశాల నుంచి యూనివర్సిటీలో అడుగుపెట్టిన తొలి విద్యార్థి కూడా ఆయనే కావడం గమనార్హం. ఈ తరుణంలో విద్యార్థి దశ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనూర అంచెలంచెలుగా ఎదిగి దేశంలోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు.
మార్క్సిజం కరదీపికగా ఆరంభమైన జేవీపీ తన తీవ్రవాద, హింసాత్మక గతం నుంచి, రాడికల్ ఇమేజ్ నుంచి నెమ్మదిగా బయటపడింది. 1994 తర్వాత ప్రధాన స్రవంతి పార్లమెంటరీ పార్టీగా అవతరించింది. 1970ల ఆరంభంలో, 1980ల్లో ప్రభుత్వంతో, రాజకీయ ప్రత్యర్థులతో హింసామార్గంలో తలపడి వేలాది మంది కార్యకర్తలను ఆ పార్టీ కోల్పోయింది. మార్క్సిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన విప్లవ సంస్థగా రాజకీయ పోరాటం ప్రారంభించి, మధ్యలో మెజారిటీ సింహళ జాతీయవాదానికి మరో ప్రతినిధిగా మారి బలపడింది.
ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని తమిళుల ఈలం డిమాండ్ వల్ల వచ్చిన అంతర్యుద్ధం ఫలితంగా జేవీపీ మెజారిటీ సింహళ ప్రయోజనాలు కాపాడే సంస్థగా ఉంటూనే శ్రామికవర్గం తరఫున పోరాడే మార్క్సిస్టు పార్టీగా తన పేరును నిలబెట్టుకోగలిగింది. ఈ క్రమంలో వ్యధాభరిత ప్రయాణంతోనే దాదాపు ఏడున్నర దశాబ్దాల తర్వాత అధ్యక్ష పీఠాన్ని జేవీపీ కైవసం చేసుకోగలిగింది.
మార్క్సిస్టులు తమ విశ్లేషణ సామర్థ్యంతో భవిష్యత్తులోకి తొంగిచూడడంలో నిష్ణాతులని పేరుగడించారు. అందుకేనేమో 1960 చివర్లో లంక రాజకీయ క్షేత్రంలోకి అడుగిడిన జేవీపీ హింసామార్గంలో నడిచి నష్టపోయింది. భారీ ప్రాణనష్టంతో పాటు పార్టీ నేతలూ జైలుపాలయ్యారు. 1970ల ఆరంభంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక గతాన్ని, భవిష్యత్తునూ జేవీపీ తన విధాన పత్రంలో చక్కగా అంచనా వేసింది.
‘1948లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఒకదాని తర్వాత ఒకటిగా అధికారం చేపట్టిన బూర్జువా పార్టీలు పెట్టుబడిదారీ అభివృద్ధి అనే దివాలాకోరు పంథాను క్రమం తప్పకుండా అనుసరించాయి. ప్రజాతంత్ర సామ్యవాదం, సామ్యవాద ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఇదంతా సాగింది. ఫలితంగా నేడు శ్రామికవర్గంపై పెరుగుతున్న అణచివేత, దేశవ్యాప్తంగా నిరుద్యోగం, మైనారిటీల హక్కులను కాలరాయడం, మనుషులుగా స్త్రీలకు కనీస హోదా దక్కకపోవడం లాంటి ఎన్నో దారుణాలను చూస్తున్నాం’ అని 1970ల ఆరంభంలో జేవీపీ నేతలు నిర్బంధంలో ఉండి రూపొందించిన పార్టీ విధాన ప్రకటనలో విశ్లేషించారు.
లంకకు స్వాతంత్య్రానంతరం పాతికేండ్లలో దిగజారిన నాటి పరిస్థితులు ఐదు దశాబ్దాల తర్వాత 2022 నాటికి మరింత క్షీణించాయి. దేశాధ్యక్షుడు గొటబయా రాజపక్స పదవీచ్యుతుడు కావడానికి అవి దారితీశాయి. అధ్యక్ష భవనంపై దాడికి ప్రజలు ఉవ్వెత్తున కదిలారు. ఈ సంక్షుభిత సమయంలో ప్రజాందోళనకు అనూర దిస్సనాయకే సారథ్యంలోని జేవీపీ నాయకత్వం వహించడమే గాక, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం గొప్ప చారిత్రక పరిణామం. గత అధ్యక్ష ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లు సాధించిన పార్టీని ఐదేండ్లలో విజయపథంలో నడిపించడం అనూర నాయకత్వ సామర్థ్యానికి, రాజకీయ పరిణతికి తార్కాణం.
మధ్య ప్రావిన్స్‌లోని గలెవెలా అనే కుగ్రామంలో 1968 నవంబర్ 24న పుట్టిన అనూర.. 1992లో కొలంబో సమీపంలోని కెలానియా యూనివర్సిటీలో తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకున్నారు. ఆ పునాదే నేడు అత్యున్నత పదవిని అధిష్ఠించడానికి తోడ్పడింది. 1997 నుంచి వరుసగా ఆయనకు పార్టీలో దక్కిన పదవులు జేవీపీని సక్రమ మార్గంలో నడిపించడానికి దోహదపడ్డాయి.
మొదట సెంట్రల్ ప్రొవిన్షియల్ ఎన్నికల్లో ఓటమి పాలైన అనూర ఆ తర్వాత రెండేండ్లకే 2000లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో కూడా గెలిచి, శ్రీలంక ఫ్రీడం పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారులో వ్యవసాయం, పశుసంవర్ధకం, భూములు, సాగు నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన పరిపాలనా దక్షునిగా నిరూపించుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, గ్రామీణాభివృద్ధిపై విస్తృత చర్చకు కారకుడయ్యారు.
అనూర పాలనపై శ్రీలంకలో ఎన్నో అనుమానాలు, సంశయాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. హింసామార్గంలో దశాబ్దాల పాటు పయనించిన రాజకీయ సంస్థగా జేవీపీకి ఉన్న ఇమేజ్, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలే ఈ అనుమానాలకు కారణం. అంతేగాక, సింహళ జాతీయవాద పక్షంగా ఎదిగిన దాని నేపథ్యం కూడా లంక తమిళుల సమస్య శాశ్వత పరిష్కారానికి అడ్డంకిగా మారుతుందని, హిందూమహా సముద్ర ప్రాంతంలోని ఇతర చిన్న దేశాల మాదిరిగానే శ్రీలంక కూడా జేవీపీ పాలనలో చైనాకు మరింత దగ్గరవుతుందని, ఇండియాతో గతంలో తలెత్తిన వివాదాలు మరింత ముదిరిపోతాయనే అంచనాలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఊహించనలవికాని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతుల అమలును కొత్త సర్కారు ఎలా మార్చగలుతుందనే ప్రశ్న అన్నిటికన్నా ముఖ్యమైనది.
దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసే సమయంలో చెప్పిన మాటలు, తర్వాత ఎక్స్ ద్వారా ఇచ్చిన పిలుపు దేశ ప్రజలను వ్యాపార, వాణిజ్య వర్గాల భయాలను పోగొట్టేవిగా ఉన్నాయి. ఈ విజయం మనందరిదీ. ‘మనమంతా శ్రీలంక చరిత్రను కలిసి తిరగరాయబోతున్నాం. సింహళీయులు, తమిళులు, ముస్లింలు.. ప్రత్యేకించి, శ్రీలంక ప్రజల ఐక్యతే శుభారంభానికి పునాది. మనమంతా చేతులు కలిపి మన భవిష్యత్తును రూపుదిద్దుకుందాం’ అని నూతన అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు జేవీపీ పాలనపై కొంత వరకు ఆందోళనలను పోగొట్టింది. ‘ప్రజలు భిన్నమైన రాజకీయ సంస్కృతిని కోరుకున్నారు. శ్రీలంకలో పరిశుద్ధ రాజకీయాలు నెలకొల్పుతాను’ అని అధ్యక్షుడిగా చేసిన మొదటి ప్రసంగంతోనే దిస్సనాయకే ఆకట్టుకున్నారు.
ఐఎంఎఫ్‌తో విక్రమసింఘే కుదుర్చుకున్న 300 కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ఒప్పందాన్ని అనూర మొదటినుంచీ విమర్శించారు. అంతేగాక, తాను అధికారంలోకి వస్తే దాని అమలు తీరును సవరించేలా ఐఎంఎఫ్‌తో మళ్లీ సంప్రదింపులు జరుపుతానని ప్రకటించారు. ఐఎంఎఫ్ సాయం కోసం పాత ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యల ఫలితంగా జనంపై పన్నుల భారం పడింది. ఐఎంఎఫ్ షరతులు లేదా ఆదేశాలను సవరించి అమలు చేస్తామని జేవీపీ గట్టిగా ప్రకటించిన నేపథ్యంలో కొత్త సర్కారుతో సంప్రదింపులకు సిద్ధమేనని ఐఎంఎఫ్ ప్రకటించింది. ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలకు పూర్తిగా స్వస్తి పలకకుండానే, వాటిని సవరించాలని జేవీపీలో మెజారిటీ నేతలు కోరుతున్నారు.
మొత్తం మీద ఐఎంఎఫ్‌తో కీలక సంప్రదింపులు జరపడంతో పాటు శ్రీలంక దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడే రీతిలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య రంగాలను ముందుకు నడిపించాలని దిస్సనాయకే పార్టీ యోచిస్తున్నది. స్థానికంగా పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తూ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేయడమే అనూర సర్కారు పంథాగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేగాక కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ పూర్వపు సోవియట్ యూనియన్‌లో, ఫిడెల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో దశాబ్దాల క్రితం వచ్చిన విప్లవాల రీతిలో శ్రీలంకలోని మార్క్సిస్టు జేవీపీ సర్కారు నడవదనే అవగాహన ప్రజల్లో ఉంది. ఐరోపా దేశాల కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ పంథాలో ప్రవేశించాక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినట్టే.. శ్రీలంక మార్క్సిస్టు ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. సామ్యవాదం, ప్రజాస్వామ్యం పేరిట సాగిన పాత సర్కార్ల కుహనా విధానాలు అనూర పాలనలో ఉండవనే ఆశే శ్రీలంక ప్రజలను ఈ ఎన్నికల్లో వినూత్న తీర్పు ఇవ్వడానికి ముందుకు ఉరికించింది.
– నాంచారయ్య మెరుగుమాల