ఒత్తిడి లేదా ఓటమిలో హుందాతనాన్ని ప్రదర్శించడమే అసలైన ధైర్యసాహసాలని అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పారు. అయితే, డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఓటమి తర్వాత అంతకుమించి పరిణతిని చూపించారు. ఇంకా కోల్పోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో, శూన్యంలో నుంచి వచ్చిన హుందాతనం అది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఓడిపోలేదు, సెనేట్‌లోనూ ఆ పార్టీ తన మెజారిటీని కోల్పోయింది. ఇదొక విధంగా ఆ పార్టీని షాకింగ్‌కు గురిచేసే విషయం. ఒకవేళ కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేవారు. శ్వేత సౌధంలోకి కాలుమోపిన మొదటి మహిళగా, రెండో నల్ల జాతీయురాలిగా, దక్షిణాసియా మూలాలున్న మొదటి వ్యక్తిగా నిలిచేవారు.
కమలా హ్యారిస్ విజయానికి ఆమె జాతి, లింగం అడ్డంకిగా మారాయా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే ఉదారవాదానికి పట్టుగొమ్మగా ప్రచారం చేసుకునే అమెరికా దృక్పథం ఇంకా మారలేదని అర్థం చేసుకోవచ్చు. హిల్లరీ క్లింటన్ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన రెండో మహిళ కమలా హ్యారిస్. శ్వేతసౌధంలో ఒక మహిళను చూడటాన్ని అమెరికా ప్రజలు ఇష్టపడటం లేదా? ఇప్పటికీ వారు అందుకు సిద్ధంగా లేరా? అన్న ప్రశ్నలను ఆమె ఓటమి లేవనెత్తుతున్నది. అంతేకాదు, అమెరికాలో శ్వేతజాతీయుల ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నదని దీని ద్వారా తెలుస్తున్నది. కమ లా హ్యారిస్ ఓటమిలో ఈ రెండూ కీలకపాత్ర పోషించాయి. అయితే, ఈ అంశాలు ఆమె పోరాటంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
వాస్తవానికి, క్లిష్ట సమయంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నారు. గత నాలుగేం డ్లు అధికార డెమొక్రాటిక్ పార్టీకి గడ్డుకాలం నడిచింది. కరోనా సంక్షోభం, ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, గాజా-ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు డెమొక్రాట్లను బాగా దెబ్బతీశాయి. బైడెన్ పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ, రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ.. డెమొక్రాటిక్ పార్టీ నుంచి జో బైడెన్ మళ్లీ అధ్యక్ష బరిలో నిలిచారు. పోటీ నుం చి ఆయనను తప్పించడానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ రంగంలోకి దిగా ల్సి వచ్చింది. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌కు ముందు కమలా హ్యారిస్ నామినేషన్‌కు మార్గం సుమగం చేసేందుకు జో బైడెన్‌కు 11 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమెకు 107 రోజుల సమయం మాత్రమే మిగిలింది. అప్పటికే బైడెన్ ఎన్నికల ప్రచారంలో పట్టు కోల్పోయారు. పాపులర్ రేటింగ్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. డొనా ల్డ్ ట్రంప్‌తో జరిగిన టీవీ డిబేట్లోనూ ఘోరం గా తడబడ్డారు.
డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే టీవీ డిబేట్లకు ఘన చరిత్ర ఉన్నది. 1960లో మొదటిసారి ఈ డిబేట్ ప్రారంభమైంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జాన్ ఎఫ్ కెన్నెడీ, రిపబ్లికన్ అభ్యర్థి రిచర్డ్ ఎం నిక్సన్ మధ్య మొదటి డిబేట్ జరిగింది. ఆ ఎన్నికలో నిక్సన్‌పై కెన్నెడీ గెలుపొందారు. కానీ, 2024లో జరిగిన డిబేట్లో బైడెన్ గందరగోళానికి గురై డెమొక్రాటిక్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లారు. అక్కడినుంచే ఆ పార్టీ గెలుపు అవకాశాలకు గండిపడ్డాయి.
అయినప్పటికీ, కమలా హ్యారిస్ ఆ అంతరా న్ని పూడ్చగలిగారు. హోరాహోరీగా సాగిన పోరు లో ట్రంప్‌కు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. అతి తక్కువ సమయమే ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ప్రచారం చేయడానికి ఆమె చాలా కష్టపడ్డారు. ఒక నెరేటివ్‌ను సృష్టించడానికి, ఒక విజన్‌ను ఆవిష్కరించడానికి, తన మద్దతుదారులు, ప్రజల్లో ఉత్సాహం తీసుకురావడానికి ఆమె దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు.
మంచి సమాజాన్ని నిర్మించడం, ప్రజలను ఏకం చేయడం, అమెరికా భవిష్యత్తు కోసం దేశం పై ప్రేమతో ఉత్సాహంగా పోరాటం చేయడం తదితర విషయాల్లో కమలా హ్యారిస్ చాలా ఉత్సుకత తో ఉన్నారు. ‘మనల్ని విడదీసే అంశాల కంటే మనందరినీ కలిపి ఉంచే ఉమ్మడి అంశాలే ఎక్కువగా ఉన్నా’యని ఆమె ఇటీవల పేర్కొన్నారు. ఆమె ఓటమి పాలవడం విచారకరం. అయినప్పటికీ, హుందాతనంతో ‘నేను ఈ ఎన్నికలను అంగీకరిస్తా. కానీ, ఎన్నికల ప్రచారానికి ఆజ్యం పోసిన పోరులో మాత్రం వెనకడుగు వేయ’నని ఆమె అన్నారు. అంతేకాదు, అమెరికా ప్రజలకు భవిష్యత్తుపై ఆశ కల్పిస్తూ ఓటమి అనంతరం కమల సం దేశమిచ్చారు. ‘కొన్నిసార్లు పోరాటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అంటే, దానర్థం మనం గెలవలేమని కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాన్ని మధ్యలో ఆపవద్దు.
ప్రపంచాన్ని మరింతగా మెరుగుపరిచే ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు’ అని ఆమె పేర్కొన్నారు. ఓటమిని అంగీకరిస్తూ కమలా హ్యారిస్ చేసిన ప్రసంగంలో డెమొక్రాటిక్ పార్టీ భవిష్యత్తును ఆమె ఆవిష్కరించారు. డెమొక్రాట్లు చేయాల్సిన పోరు గురించి వివరించారు. భావోద్వేగంతో కూడిన తన మద్దతుదారులను ఉద్దేశి స్తూ ఆమె చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలో ఇలా అన్నారు. ‘స్వేచ్ఛ కోసం పోరాటం, అవకా శం కోసం పోరాటం, ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం, మన దేశం గుండెల్లో ఉన్న ఆదర్శాల కోసం పోరాటం. అమెరికా ఉత్తమంగా ప్రతిబింబించే ఆదర్శాల కోసం జరిగే పోరాటాన్ని నేను ఎప్పటికీ ఆపను’ అని ఆమె పేర్కొన్నారు. ఇలాం టి ఆదర్శ రాజకీయాలు రిపబ్లికన్ క్యాంప్‌లో కరువయ్యాయి. కమలపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగడమే ఇందుకు తార్కాణం.
ఎన్నికల్లో ఓడిపోయి, డెమొక్రాట్లు తీవ్ర నిరాశలో ఉన్న ప్రస్తుత తరుణంలో కమ లా హ్యారిస్ ఆశలు కల్పిస్తున్నారు. భవిష్యత్తు కోసం పోరాడాలనుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారుల్లో ఉన్న ఉత్సాహాన్ని, కాంక్షను ఆమె మరింతగా రగిలించారు. ఈ క్రమంలో హ్యారిస్ ఇలా మాట్లాడారు. ‘చీకటిగా ఉన్నప్పుడే నక్షత్రాలను చూడగలమనేది ఒక సామెత. మనం ఇప్పు డు చీకట్లోకి ప్రవేశిస్తున్నామని చాలామంది అనుకుంటున్నారని నాకు తెలుసు. అయితే, అది మనందరి మంచికే జరుగుతున్నది. ఇక్కడో విష యం చెప్పుకోవాలి. అదేమిటంటే.. ఆశావాదం, విశ్వాసం, సత్యం, సేవ లాంటి బిలియన్ల కొద్దీ అద్భుతమైన నక్షత్రాల కాంతితో అమెరికా అనే ఆకాశాన్ని నింపుదాం’ అని పేర్కొంటూ భవిష్యత్తు పై ఆశావాదంతో ఆమె ముందుకుసాగడం విశేషం.
– వెంకట్ పర్సా