భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద ఇటీవల ఒక న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది ప్రజలను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. మన న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద దాడి సామాన్య విషయం కాదు. ఇది సుప్రీం కోర్టు న్యాయవాది చెయ్యటం విస్మయం కలిగిస్తున్నది.
సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు న్యాయశాస్త్రంలో నిష్ణాతులైనవారు. న్యాయం, చట్టం, రాజ్యాంగం, కోర్టు సంప్రదాయాల మీద మంచి అవగాహన కలవారై ఉంటారు. మరి ఆ స్థాయి న్యాయవాది సభ్యత, సంస్కారం, విచక్షణ, వివేకం గాలికి వదిలేసి ఆవేశానికి లోనైనాడంటే దేశంలో విస్తరిస్తున్న అసహన వాతావరణానికి దీన్ని ఒక నిదర్శనంగా చూడాలి. పైగా, ఇది సనాతన ధర్మం పేరిట జరగటం చాలా తీవ్రమైన విషయం. ఈ హేయమైన దాడి మన రాజ్యాంగ చరిత్రలో ఒక చీకటి ఉదంతంగా మిగిలిపోతుందనటంలో సందేహం లేదు. కానీ, ఈ ఉదంతం నుంచి భావి తరాలవారు ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్పించాలి? ఇది అందరూ లోతుగా ఆలోచించాల్సిన అంశం.
మనం ఒక అధునాతన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. సనాతన ధర్మం స్థూలంగా నాలుగు అంశాల మీద నిలబడి ఉన్నది. ఒకటి కర్మ సిద్ధాంతం, రెండవది పునర్జన్మ, మూడవది స్వర్గం నరకం, నాలుగవది మనుశాస్త్రం. మను ధర్మశాస్త్రం అని పిలవటం పరిపాటి. ధర్మశాస్త్రంగా సంబోధించి దానికి అర్హతలేని గౌరవాన్ని ఆపాదించారు పూర్వీకులు. ఈ నాలుగు అంశాలు కూడా ఛాందసవాదుల చేతిలో ఉన్న కాలం చెల్లిన అస్ర్తాలు. కానీ, గత పది పన్నెండేండ్లుగా సనాతనధర్మ వాదులు కొంత బలం పుంజుకున్న విషయం మనకు తెలియనిది కాదు. దీనికి కారణం నేటి పాలకులు ఈ ధోరణి పట్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తమ సానుభూతిని, సమ్మతిని వ్యక్తం చెయ్యటమే. అందులో ఎలాంటి సందేహం లేదు. పాలకుల అండ, ఆదరణ లేకపోతే ఆ శక్తులు ఇంత విశృంఖలంగా చెలరేగటం కష్టం. ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు వర్ణ వ్యవస్థ ద్వారా ఏర్పడిన కులవ్యవస్థను కాదని వర్ణ వ్యవస్థను నిర్వీర్యం చేసి కులానికి పెద్దపీట వేసింది హిందూ సమాజం.
ఈ సంప్రదాయాన్ని కాలదన్ని మనం ఒక అధునాతన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ప్రజలు అందరూ ఒకటే అని నొక్కివక్కాణించి చెప్తుంది మన రాజ్యాం గం. కులం, మతం, జెండర్, భాష, ప్రాం తం, పుట్టుక అనే అంశాలతో సంబంధం లేకుండా భారతీయులందరూ సమాన హోదా కలిగిన ఒక జాతి. ఇదే కదా మన రాజ్యాంగం ఉద్బోధిస్తున్నది. దీని ప్రకార మే కదా హిందువులు ఎక్కువగా ఉన్నా ఈ దేశంలో మహమ్మదీయులు రాష్ట్రపతి అ య్యారు! ఈ రాజ్యాంగం వల్లనే కదా ఎన్నో తరాలుగా వివక్షకు గురైన మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎదిగారు.
ఇట్లాంటి వ్యక్తుల న్యాయశాస్త్ర పట్టాను రద్దుచెయ్యాలి. సమాజానికి కనువిప్పు కలిగించేవిధంగా శిక్ష విధించాలి. కానీ, ఇదొక వ్యక్తికి పరిమితం కాదు. వ్యవస్థను ఏ విధంగా సంస్కరించాలనేది అన్ని వర్గాల మేధావులూ ఆలోచించాలి. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు రాజ్యాంగస్ఫూర్తిని జీర్ణించుకోవాలి.
దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఈ రాజ్యాంగం వల్లనే కదా దళితులు రాష్ట్రపతులు అయ్యారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవ్వగలిగారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా వేడుక చేసుకుంటున్నాం. ఇది మొక్కుబడిగా చేసే ప్రహసనమా లేక రాజ్యాంగం పట్ల గౌరవంతో చేసేదా? ఏదీ గౌరవం? ఎక్కడ గౌరవం.
రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమా ణం చేసిన ప్రజా ప్రతినిధులు ‘మేం నిఖార్సయిన సనాతన ధర్మ పరిరక్షకులం’ అని నొక్కి వక్కాణిస్తుంటే వ్యవస్థ పోడియం చూ స్తూ ఊరకుండిపోయింది గానీ ఇదేం విడ్డూ రం అని అడిగిన నాథుడు లేడు. పైరును కంచె మేసినట్టు, రాజ్యాంగం మీద ప్రమా ణం చేసిన వారి నుంచి రాజ్యాంగానికి ము ప్పు ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించాలి?
ఒక దళితుడు అత్యున్నత న్యాయమూర్తి పదవిని అధిరోహించటం జీర్ణించుకోలేకనే కదా ఈ ఉన్మాద ధోరణి బయటపడింది. న్యాయస్థానాన్ని గౌరవించవలసిన ప్రథమ బాధ్యత న్యాయవాదుల మీదే ఉంటుంది. తీర్పు ఏ విధంగా ఉన్నా కోర్టును, కోర్టు ఇచ్చే తీర్పును గౌరవించాలని ప్రతి న్యాయవాది బాధ్యతగా తన కక్షిదారులకు తెలియజేయాలి. కానీ, న్యాయవాదులు, న్యాయమూర్తుల మీద దాడికి దిగటం అత్యంత గర్హనీయమైన చర్య ఇది రాజ్యాంగానికి సవాల్ విసరటమే. సదరు నిందితుడిని పట్టుకొని ఉండవచ్చు. అతనికి శిక్ష పడవచ్చు. కానీ, విషపూరితమైన ఈ ఉన్మాదం అనే భావజాలాన్ని ఎలా ఎదుర్కోవాలి? దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనే శక్తి న్యాయవ్యవస్థకు ఉన్నది. కానీ, ఆ అవకాశాన్ని కోర్టు చేజార్చుకున్నది. పదవీ విరమణ తర్వాత అందే ఆకర్షణలకు న్యాయమూర్తులు అతీతులు కాదని నిరూపించారు మన పాలకులు.
ఈ మధ్యకాలంలో గట్టిగా మాట్లాడవలసిన సందర్భాల్లో కోర్టు గొంతు మూగపోయినట్టు అనిపిస్తుంది సామాన్య ప్రజానీకానికి. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు వారి గౌరవాన్ని కానీ కోర్టు గౌరవాన్ని కానీ ఇనుమడించేలా లేవు ఈ మధ్యకాలంలో. న్యాయమూర్తులు కూ డా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనం గా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. న్యాయవ్యవస్థ సంస్కరణల్లో ఇదొక ముఖ్య అంశం. ఈ మాటల ఉద్దేశం జరిగిన ఘాతుకాన్ని సమర్థించినట్టుగా భావించరాదు. ఇక్కడ ఆగంతకుడి దుశ్చర్యను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అందులో ఎటువంటి సంశయం లేదు. ఇట్లాంటి వ్యక్తుల న్యాయశాస్త్ర పట్టాను రద్దుచెయ్యాలి. సమాజానికి కనువిప్పు కలిగించేవిధంగా శిక్ష విధించాలి. కానీ, ఇదొక వ్యక్తికి పరిమితం కాదు. వ్యవస్థను ఏ విధంగా సంస్కరించాలనేది అన్ని వర్గాల మేధావులూ ఆలోచించాలి. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు రాజ్యాంగస్ఫూర్తిని జీర్ణించుకోవాలి. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏం ఉద్బోధిస్తున్నాయి? శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోమని ఆదేశిస్తున్నాయి. ఆ దిశగా మనం ఏమైనా అడుగులు వేస్తున్నామా?
పండుగలూ పబ్బాలు ఒకప్పుడు సమాజంలో అందరూ కలిసి ఆనందంగా జరుపుకొనే వేడుకలు. కానీ, నేడు పండుగలు శాంతిభద్రతల సమస్యలై కూర్చున్నాయి! ఉన్మాదం పెరిగిపోతుంది. హేతుబద్ధత నీలిగిపోతుంది. ఈ పోడియాన్ని న్యాయ వ్యవస్థ కూడా చూస్తూ ఊరుకుంది గానీ నోరు మెదపలేదు. ఇకనైనా మనం ఈ నిద్ర నుంచి లేవాలి.
ఇది ఒక వర్గంతో అయ్యే పని కాదు. అన్నివర్గాల వారు ముందుకురావాలి. మీడి యా, అకడెమియా, మేధావులు, న్యాయస్థానం, పార్లమెంట్, కవులు, కళాకారులూ అందరూ కలిసి ముప్పేట దాడి చేస్తేనే గానీ ఈ దురవస్థ నుంచి బయటపడలేం. నేడు ఏ రంగంలో చూసినా కులం కంపు ముక్కు పుటాలను అదరగొడుతుంది. ఏమిటి ఈ కులం అనే గజ్జికి విరుగుడు? ప్రపంచంలో మరే సంస్కృతికీ లేదు ఇంత కఠినమైన వ్యవస్థ. మతాన్ని మార్చుకోవచ్చు, భావజాలాన్ని మార్చుకోవచ్చు. కానీ కులవ్యవస్థ నుంచి బయటపడలేకపోగా విదేశాల్లోనూ కుల మూలాలు వేర్లూనుతున్నాయంటే ఇది ఎంత లోతుగా పాతుకుపోయిందో అందరికీ తెలుసు. తెలియనిదల్లా కుల కోరల నుంచి బయటపడటం ఎట్లా అని.
– గుమ్మడిదల రంగారావు