దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 28కి కుదించేందుకు గాను కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 4న గ్రామీణ బ్యాంక్ చైర్మన్లకు, వాటి స్పాన్సర్ బ్యాంక్‌ల ఎండీలకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేసింది. ఒక రాష్ర్టానికి ఒకే గ్రామీణ బ్యాంక్ అనేది ఈ విలీనానికి ప్రధాన ప్రాతిపదిక. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ ప్రక్రియ పూర్తికావచ్చు. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకే గ్రామీణ బ్యాంక్ ఏర్పడుతుంది. దాని పేరు ‘తెలంగాణ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్’ అని ఉంటుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రం పేరుతో గ్రామీణ బ్యాంక్‌ల పేర్లు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో రెండు గ్రామీణ బ్యాంక్‌లు పనిచేస్తున్నాయి. 18 జిల్లాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, మిగతా 15 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలందిస్తున్నాయి. ఈ రెండింటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్నది.
వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ తర్వా త కూడా అవి గ్రామాల్లో తమ శాఖల ను తెరవడానికి ముందుకురాలేదు. స్థాయికి తగ్గ వ్యాపారం లభించక ఇప్పటికే తమ గ్రామీణ శాఖలు నష్టాల్లో ఉన్నాయని కేంద్రానికి అవి మొర పెట్టుకున్నాయి. చివరికి ఆనాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనల ప్రకారం తక్కువ ఖర్చుతో ‘వాణిజ్య బ్యాంకు విధానాలు, గ్రామీణ ప్రజల అవసరాలు’ కలిసే రీతిలో గ్రామీణ బ్యాంక్‌ల రూపకల్పన జరిగింది. గ్రామీణ బ్యాంక్ మూలధనంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 35 శాతం స్పాన్సర్ బ్యాంక్, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాలుంటాయి. అలా బాధ్యతలు, లాభనష్టాలు మోసేందుకు మూడింటి భాగస్వామ్యం అవసరమైంది.
1975లో ప్రథమ గ్రామీణ బ్యాంక్ యూపీలోని మొరాదాబాద్‌లో ఏర్పడింది. 1976లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం వచ్చింది. అలా పదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా 196 గ్రామీణ బ్యాంక్‌లు విస్తరించాయి. బ్యాంక్‌ల వ్యాపార లక్ష్యం ఆర్థిక లాభం కాగా, గ్రామీణ బ్యాంక్‌ల లక్ష్యం మాత్రం సామాజిక లాభంగా ప్రభుత్వం గుర్తించిం ది. వాటి నష్టాలను నష్టాలుగా భావించలేదు. రైతులకు, గ్రామీణులకు అవి అందిస్తున్న ఆర్థిక సేవలనే లాభాలుగా పరిగణించింది. అయితే, 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణల రాకతో ప్రభుత్వరంగ సంస్థలపై కేంద్ర దృక్కోణం మారిపోయింది. నష్టా ల్లో ఉన్నవి కూడా లాభాల బాట పట్టక తప్పదు.
అప్పటికే గ్రామీణ భారతంలో ప్రధాన పరపతి సంస్థగా వేళ్లూనుకున్న గ్రామీణ బ్యాంక్‌ల నిర్వహణ ఖర్చులను తగ్గించాలనుకున్నది. అలా 2004-05లో మొదలైన వీటి సంఖ్య తగ్గింపు ప్రక్రియ దశలవారీగా సాగి 2020-21 నాటికి 196 నుంచి 43కు చేరింది. ఒక రాష్ట్రంలో ఒక స్పాన్సర్ బ్యాంక్‌కు ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలనే నిబంధనతో ఉమ్మడి ఏపీలో ఉన్న 16 గ్రామీణ బ్యాంకులు 6గా మారాయి.
తెలంగాణ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధీనంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శాతవాహన గ్రామీణ బ్యాంక్, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ గ్రామీణ బ్యాంక్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని శ్రీ సరస్వతి గ్రామీణ బ్యాంక్, రంగారెడ్డి జిల్లా గోల్కొండ గ్రామీణ బ్యాంక్ ఉండేవి. విలీన ప్రక్రియలో భాగంగా మార్చి 2006లో ఈ 4 గ్రామీ ణ బ్యాంక్‌లు కలిసి దక్కన్ గ్రామీణ బ్యాంకు ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాను కూడా ఇం దులో కలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014, అక్టోబర్‌లో బ్యాంక్ పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌గా మార్చారు. తెలంగాణలోని మిగతా ఐదు జిల్లాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూడు గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వాటితోపాటు ఏపీలోని శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు కలిసి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌గా ఏర్పడింది.
2016లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ విలీనం కావడంతో తెలంగాణలోని రెండు గ్రామీణ బ్యాంక్‌ల స్పాన్సర్ బ్యాంక్ ఒక్కటైంది. స్పాన్సర్ బ్యాంక్ పరంగా గ్రామీ ణ బ్యాంక్‌లు కలిపివేస్తున్నందున టీజీబీ, ఏపీజీవీబీలు రెండు కలిసిపోవాలి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఒకే గ్రామీణ బ్యాంక్ ప్రతిపాదన తెచ్చినందున తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏపీజీవీబీ శాఖలను టీజీబీలో కలపాలి. అలా కొత్తగా ‘తెలంగాణ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్’ పురుడు పోసుకుంటుంది.
ఈ ఏడాది మొదట్లోనే రాష్ర్టానికి ఒక గ్రామీణ బ్యాంక్ అనే ప్రతిపాదనను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెరపైకి తెచ్చినా రెండు తెలుగు రాష్ర్టాల్లో ఏపీజీవీబీ ఉండటంతో చర్చ ముందుకు సాగలేదు. ఏపీజీవీబీ శాఖలు రెండు రాష్ర్టాల్లో ఉన్నందున ఆ వాటా లెక్కలను రెండు రాష్ర్టాలు కలిసి తేల్చుకోవాలి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రాష్ర్టానికి చెందిన 15 శాతం వాటా పరిస్థితి తెలుసుకొని ఉండాలి. కానీ, అలా జరగలేదు. రాబోయే రోజుల్లో రాష్ర్టానికి ఒకే గ్రామీణ బ్యాంక్ కాబట్టి హన్మకొండలో ఉన్న ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయం తరలిపోతున్నది. పైగా ఏపీలోని గ్రామీణ బ్యాంక్‌లకు కెనరా బ్యాంక్ స్పాన్సర్ కానున్నది. ఏపీజీవీబీ వాటాను తెలంగాణలో ఎస్బీఐ, ఆంధ్రలో కెనరా బ్యాంకు పంపకాలు చేసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది.
– నర్సన్ బద్రి 94401 28169