గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలిగించి ‘రామ్’ అని నామకరణం చేసి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. 140 కోట్ల భారతీయులకు జాతిపిత అయిన మహాత్మాగాంధీ పేరిట 2005లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 2006-07లో దేశంలోని 200 వెనుకబడిన జిల్లాల్లో ప్రారంభించిన ఈ పథకాన్ని 2008-09లో అన్ని రాష్ర్టాల్లో అమలు చేశారు. అయితే, ఈ పథకం పేరును మారుస్తూ కేంద్రప్రభుత్వం 197/2025 బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి ‘జీ-రామ్-జీ’ పేరు పెట్టి ఎవరైనా వ్యతిరేకిస్తే రాముడిని వ్యతిరేకించారనే భావన కలిగే విధంగా వ్యవహరిస్తున్నది. పథకం పేరు మార్చినంత మాత్రాన గత విధానాలకు మించి గ్రామీణ పేదలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అనుకోవడం పొరపాటే.
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ర్టాలకు ఈ పథకం మోయలేని భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉపాధి పనులకయ్యే ఖర్చులో 40 శాతం రాష్ర్టాలు భరించాలని నిబంధన విధించడం సబబు కాదు. పనుల ప్రాంతాలను, పనుల స్వరూపాన్ని నిర్ణయించే పూర్తి అధికారం కేంద్రానికి మాత్రమే ఉండటం గమనార్హం. రాష్ర్టాల హక్కులను, ఆకాంక్షలను హరించే విధంగా కేంద్రం చట్టంలో మార్పులు చేసింది. ఒకవేళ పని వ్యయం ఎక్కువైతే మిగిలిన పని ఖర్చు పూర్తిగా రాష్ట్రమే భరించాలి. కొత్త చట్టంలో కార్మికులకు ఉపాధి కల్పించే రోజులను 100 నుంచి 125కు పెంచామని చెప్తూనే, వ్యవసాయ పనులు జరిగే సమయంలో రెండు నెలలు ఉపాధిహామీ పనులు నిషేధించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
కార్మికులకు పని దినాలు కల్పించాల్సిన ప్రభుత్వం యంత్రాలను ఉపయోగించే విధంగా ఎందుకు మార్పులు చేసిందో చెప్పాలి? ప్రస్తుతమున్న కేంద్ర పథకాల్లో చాలా క్రియాశీల కార్యక్రమంగా అమలవుతున్న పథకం నరేగా. ఇప్పటివరకు 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వడంతో రాష్ర్టాలకు ఆర్థిక భారం తప్పింది. దాని వల్ల రాష్ర్టాలు అనేక పథకాలను రూపకల్పన చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషిచేశాయి. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాబ్‌కార్డులు ఉన్న 9 కోట్ల మందిలో 4 కోట్ల మంది మాత్రమే ఉపాధి పొందారు. 2025-26లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా తగ్గాయి. 2020-21లో ఈ పథకానికి రూ.1.11 లక్షల కోట్లు కేటాయించగా, 2025-26 నాటికి అవి రూ.80 వేల కోట్లకు పడిపోయాయి.
గ్రామీణ ఉపాధిహామీ పథకం గ్రామీణ భారతంలో కోట్ల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. నిరుపేదలకు భరోసా ఇచ్చింది. వృద్ధులు, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించింది. అయితే, మోదీ ప్రభుత్వం తెస్తున్న వికసిత్ భారత్ జీ-రామ్-జీ బిల్లు కార్మికులకు ఉన్న పని హక్కును కాలరాసే విధంగా ఉన్నది. స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ క్రియాశీల పాత్ర పోషించారు. ఇది స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆయన చరిత్రను చెరిపివేసే కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రాజకీయ అవసరాల కోసం కేంద్రం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ర్టాలకు మాత్రమే న్యాయం చేస్తామని బెదిరించే విధంగా చట్టంలో అధికారాలన్నీ కేంద్రం చేతుల్లో ఉంచుకోవడం దారుణం. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక పథకాల పేర్లు మార్చింది.
ఫెడరల్ స్ఫూర్తిని విస్మరిస్తూ చట్టాల విధానాలను రూపొందించింది. పేర్ల మార్పే తప్ప పేద ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. చట్టంలో మార్పులు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2014 నుంచి ఇప్పటివరకు 32 పథకాల పేర్లను బీజేపీ ప్రభుత్వం మార్చింది. అంతేకాదు, చాలా పథకాల పేర్లు హిందీ భాషకు, ముఖ్యంగా ఉత్తర భారతానికి ప్రాముఖ్యం ఇచ్చే విధంగా ఉన్నాయి. పథకాల పేర్లలో గతంలో ఉన్న నెహ్రూ, గాంధీ పేర్లు తొలగించి దీన్ దయాల్, అటల్ బిహారీ వంటి బీజేపీ సిద్ధాంతకర్తల పేర్లను చేర్చింది. ఈ మార్పులో భాగంగా దేశంలో పేదరికం తగ్గిందని చెప్తూ, గ్రామీణ ఉపాధిలో పేదలకు పని లేకుండా చేసే విధానాలు అమలు చేయడం అమానుషం.
ఏడాది చర్చల తర్వాతే పాత చట్టం అమల్లోకి వచ్చింది. కానీ, కొత్త చట్టంపై కనీసం పార్లమెంట్ సభ్యులతో అయినా చర్చించకపోవడం విడ్డూరం. కొత్త పథకంలో సామాజిక స్థితిగతులకు అనుకూలంగా, ఫెడరల్ స్ఫూర్తితో సమూల మార్పులు తీసుకువచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పేర్లను కాదు, ప్రజలకు లబ్ధి చేకూరేలా విధానాలను మార్చారు. గతంలో ఉన్న ఎన్నో పథకాలను అదే పేరుతో కొనసాగించారనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. స్వాతంత్య్ర పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేయడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో లేని బీజేపీ కుటిల యత్నం చేస్తున్నది. తమ భావజాలాన్ని ప్రభుత్వ వ్యవస్థలపై రుద్దాలని చూస్తున్నది.
కేంద్రంలో పేర్ల మార్పును వ్యతిరేకిస్తూనే తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అమలు చేస్తున్నది. తెలంగాణలో రైతుబంధు పేరును రైతు భరోసాగా, ధరణిని భూ భారతిగా, ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా, టీఎస్‌ని టీజీగా మార్చింది. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తీసివేసింది. కానీ, పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైంది. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లను చెరిపివేసే కుటిలయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని చెప్పవచ్చు.
కేంద్రంలో పేర్ల మార్పును వ్యతిరేకిస్తూనే తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అమలు చేస్తున్నది. తెలంగాణలో రైతుబంధు పేరును రైతు భరోసాగా, ధరణిని భూ భారతిగా, ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా, టీఎస్‌ని టీజీగా మార్చింది. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తీసివేసింది. కానీ, పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైంది.
– (వ్యాసకర్త: బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్) దేవీప్రసాద్