బీహార్లో ఓటర్ల జాబితా పునఃపరిశీలన పేరిట చేపట్టిన తతంగం తేనె తుట్టెను కదిపినట్టే కనిపిస్తున్నది. కమిషన్ ప్రత్యేకమైన తీక్షణ పునఃపరిశీలన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టడం అనుమానాలకు దారితీయడమే కాకుండా, దానివెనుక గల ఉద్దేశాలపై ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో ఓటర్ల జాబితాను సమూలంగా సవరించడం ఇదే కొత్త కాకపోవచ్చు. 1952 నుంచి 2024 మధ్యకాలంలో అనేక రాష్ర్టాల్లో 13 సార్లు జరిగాయి. బీహార్లో చివరిసారిగా 2003లో ఈ ప్రక్రియ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న తరుణంలో ఇప్పుడు తీక్షణమైన జాబితా సవరణ చేపట్టడం దేనికి అనేది ప్రధానమైన ప్రశ్న. తీక్షణమైన అనే పదంగానీ, ఆ మాటకు వస్తే జాబితా సవరణ అనే అంశం కానీ 1950 రాజ్యాంగంలో లేవు. 1960లో ప్రవేశపెట్టిన నిబంధనల్లో సవరణ అనేది చేరిస్తే, 1987లో తీక్షణమైన అనేది వచ్చిచేరింది. ఎన్నికల్లోగా ప్రజల నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) కమిషన్ సూచించిన ‘తీక్షణమైన’ రీతిలో సమాచారం సేకరించగలరా? ఓటర్లు కమిషన్ సూచించిన గొంతెమ్మ కోరికల్లాంటి పౌర గుర్తింపు పత్రాలను సమర్పించగలరా? అనేవి అనుబంధ ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. అమాయక ప్రజలను అనవసరమైన ఇబ్బందులకు గురిచేయడం తప్పిస్తే పరిమిత సమయంలో ఇదంతా సాధ్యమా అనే సందేహాలు పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సత్వర పట్టణీకరణ, తరచుగా వలసలు పోవ డం, చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపుతో పా టుగా కొత్తగా ఓటుహక్కు పొందిన యువజనుల పేర్లు ఎక్కించడం లక్ష్యంగా తీక్షణమైన సవరణ చేపట్టినట్టు కమిషన్ చెప్పుకొన్నది. అయితే ఇవి సాధారణ సవరణలో భాగంగా జరిగేవే. ఇందుకు తీక్షణమైన చొరవ అవసరం లేదు. అయితే కమిషన్ అదనంగా చేర్చిన కార ణం ఒకటుంది. విదేశీ చట్టవిరుద్ధ వలసదారుల పేర్లు జాబితాలో ఉండిపోయాయని, వాటిని తొలగించాల్సి ఉందని తొలుత విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే బీహార్లోగానీ, ఆ మాటకు వస్తే యావత్తు దేశంలో అలాంటి పేర్ల గురించిన సమాచారం కానీ, తొలగించాల్సిన అగత్యం కానీ ఎక్కడా ప్రస్ఫుటంగా వెల్లడి కాలేదన్నది గమనార్హం. పైగా సులభ సాధ్యం కాని పత్రాలు, అతితక్కువ సమయంలో సమర్పించాలనే షరతు అమాయక బీహార్ ఓటర్లను అగ్నిపరీక్షకు గురిచేస్తుందనేది వాస్తవం.
సకాలంలో రుజువులు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోతారనేది కమిషన్ నిబంధనల సారాంశం. అందుకే ఇది సవరణ కాదు, ఓటర్లను జాబితా నుంచి తొలగించే ఎత్తుగడే అన్న విమర్శలు వచ్చాయి. బీహార్లోని ప్రతి ఓటరు తన తల్లీ, తండ్రీ జనన తేదీలు, పుట్టిన ప్రదేశాలను తెలిపే రుజువులు సమర్పించాలనడం ప్రత్యేకించి వివాదాస్పదమైంది. ఇది ఓటర్ జాబితా సవరణ కాదు, పౌరసత్వ పరీక్ష అవుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కమిషన్ చొరవపై పలు కేసులు దాఖలయ్యాయి. దీంతో ఇరుకున పడిన కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. పత్రాలు లేకపోయినా ఫరవా లేదని, బీఎల్వోలకు ఆ సంగతి చెప్తే సరిపోతుందని మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు కేసుల విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కమిషన్ ఈ యూటర్న్ తీసుకున్నది. ఈ విధంగా కమిషన్ యూటర్న్ తీసుకున్నప్పటికీ వివాదాస్పదమైన పౌరసత్వ రిజిస్ట్రీ తరహాలో చొరవ ఎందుకు చేపట్టాల్సిన వచ్చిందనే ప్రశ్న ఇంకా మిగిలే ఉన్నది.