బనకచర్ల విషయమై జరుగుతున్న దానిని గమనించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది సమర్థమైన చాతుర్యం కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి అసమర్థపు తడబాట్లు అయినట్లు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో గల ఒక నాయకునికి చాతుర్యం గాని, మరొక నాయకునికి తడబాట్లు గాని ఎందుకు వస్తాయి? ఇందుకు సాధారణంగా మూడు కారణాలుంటాయి. ఒకటి, తమ ముందున్న అంశంపై పూర్తి అవగాహన. రెండు, దాని పట్ల అవగాహనతో కూడిన నిబద్ధత. మూడు, కార్యనిర్వహణకు అవసరమైన సమర్థత. బనకచర్ల విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఈ మూడు కనిపిస్తుండగా, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రిలో ఏ ఒక్కటీ కనిపించడం లేదు. అసమర్థత, తడబాట్లు తప్ప.
ఈ మూడింటి గురించి మరికొంత చెప్పుకోవచ్చు. చెప్పుకోవడం అవసరమే కూడా. అప్పుడు గాని వారి గురించి మనకు తగిన అవగాహన కలగదు. దీనిని నాయకత్వ విశ్లేషణ అని అనవచ్చు. ముందుగా చంద్రబాబు గురించి చెప్పుకొందాం. బనకచర్ల చర్చతో సంబంధం గల నదీ జలాల విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకొక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆంధ్రాప్రాంతపు అభివృద్ధికి 19వ శతాబ్దం మధ్యలో ఆరంభం జరిగింది గోదావరి, కృష్ణా ప్రాజెక్టులతో. అప్పటి నుంచి కొద్ది దశాబ్దాలు గడిచేసరికి వ్యవసాయ రంగంలో మిగులు ఏర్పడి ఆ సంపదలతో వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లోకి విస్తరించారు. పొరుగు రాష్ర్టాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు సాగించారు. అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండినందున అంతర్జాతీయ వాణిజ్యమూ జరిగింది.
మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన ప్పుడు చాణక్య రాజకీయంతో తెలంగాణను ఆక్రమించి, ఇక్కడి నీటితో ఇక్కడి పొలాలు తడపకుండా తమ భూములకు మళ్లించుకున్నారు. అదంతా జరుగుతుండగా, సరిగ్గా రేవంత్‌రెడ్డి అంశగల అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉష్ట్ర పక్షుల వలె ఇసుకలో తలలు దూర్చారు. వివిధ ప్రలోభాలకు లోనై కాంప్రడార్లుగా మారారు. విషయం ఏమంటే, చంద్రబాబుకు ఈ చరిత్ర బాగా తెలుసు.
ఈ విధమైన గత అవగాహనకు తోడుగా, తెలంగాణ ఉద్యమానికి గల బలమైన కారణాల్లో నీళ్లు ఒకటని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ రూపాల్లో జల సమృద్ధి కలిగి వ్యవసాయ రంగం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన పథకాలు పూర్తయితే తమకు అందనంత స్థాయికి చేరగలదనే అవగాహన కూడా చంద్రబాబుకు ఉంది. కనుక ఏదో ఒక చతురోపాయంతో, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం నుంచి తమకు గల మద్దతును ఆసరా చేసుకొని, తమ కోసం వీలైనంత నీటిని ఇంకా తరలించుకుపోవాలి.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పథకం సాగేది కాదు గనుక, ఒకప్పటి కాంప్రడార్ల అంశగలవాడైన రేవంత్‌రెడ్డి ఇప్పుడు పాలిస్తున్నందున, తన పథకానికి ఇదే సువర్ణావకాశమవుతున్నది. పైగా, ఆయన గతంలో ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా తన సహచరుడు. ప్రధాని మోదీ పార్టీ స్కూల్ వాడినని తానే చెప్పుకొంటూ, ఇప్పుడు కూడా ఆయన మాటను కాదనలేనివాడిగా కనిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేస్తున్న మంచిచెడులేమిటో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎప్పుడూ పట్టింపు లేదు. వారికి కావలసింది వేరే గనుక. పైన అనుకున్నట్లు, ఇది చంద్రబాబుకు గల అవగాహన. ఇందులో ఎంతటి తర్కం, ఎంత సమగ్రత ఉన్నదో కనిపిస్తున్నదే.
రెండవ కారణమైన నిబద్ధత విషయానికి వస్తే, ఎవరికి ఎందులోనైనా నిబద్ధత ఎందుకు కలుగుతుంది? తనకు, తన వర్గానికి, తమ ప్రాంతానికి, తమ ప్రజలకు గల ప్రయోజనాలు సదరు అంశంతో ముడిపడి ఉన్నట్లయితే. అది కూడా త్రికరణశుద్ధిగా అయితే. అప్పుడు వారు సవ్యంగానైనా, అపసవ్యంగానైనా తమ లక్ష్యాలను నెరవేర్చుకొనజూస్తారు. ఆయా అంశాలకు సంబంధించిన ప్రతి చిన్న పరిణామాన్ని వెయ్యి కళ్లతో గమనిస్తుంటారు. తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాల విచక్షణతో పని ఉండదు.
ఈ స్వభావం, వ్యవహరణాశైలి వారి వ్యక్తిత్వంలో భాగమవుతాయి. ఎన్ని ఎత్తులు వేసినా, తెలంగాణను కోల్పోయి కిందపడినా, ఓడిపోవడం మాత్రం నేటికీ జరగలేదని నమ్మే చంద్రబాబు, తమ ప్రయోజనాల పట్ల ఎంత నిబద్ధతను నేటికీ చూపుతున్నారో, తెలంగాణ ప్రయోజనాల పట్ల వ్యతిరేక నిబద్ధతను కూడా అంతే చూపుతున్నారు. ఆయన ఇన్నేళ్ల రికార్డును చూసిన తర్వాత, ఇప్పుడు బనకచర్ల చదరంగాన్నీ గమనిస్తున్నప్పుడు, ఇక ఆయన ఎన్నటికీ మారబోరని, ఒకటి మాట్లాడి మరొకటి చేసే కపటనీతిని వదలబోరని ప్రకటించేందుకు మనకు ఎటువంటి సందేహం అక్కరలేదు.
ఆఖరున నిర్వహణాపరమైన సమర్థతకు వస్తే, చంద్రబాబుకు అన్ని విషయాల్లోనూ ఎంతటి సమర్థత ఉన్నదో మొదటినుంచి చూస్తూనే ఉన్నాం. మంచిచెడులన్నింటిలోనూ. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వారు దుర్మార్గంగా పడగొట్టినప్పుడు జరిగిన ఉద్యమ నిర్వహణలో ఇతరుల తోడ్పాటుతో ఎంత సమర్థత చూపారో, తర్వాత అదే ఎన్టీఆర్‌ను అంతే దుర్మార్గంగా పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో అంతే సమర్థతను ప్రదర్శించారు.
ఆ తర్వాతి దుర్మార్గపు చర్యల జాబితా పెద్దదే గాని, ప్రస్తుత చర్చ బనకచర్ల సంబంధమైనది అయినందున అందులోకి పోనక్కరలేదు. ఇప్పుడు బనకచర్ల విషయమై అదే తరహాలో సమర్థత చూపజూస్తున్నారన్నదే గమనించవలసిన విషయం. గోదావరి, కృష్ణాల్లో నీటి లభ్యత, నీటివాటాలు, రెండు రాష్ర్టాల అవసరాలు, భవిష్యత్తు పరిస్థితి, దీని వల్ల తెలంగాణకు కలిగే లాభనష్టాలేమిటి, పరస్పర సంప్రదింపులు, అవేవీ లేకుండానే కేంద్రంలోని తమ మిత్ర ప్రభుత్వం ద్వారా పనులు సాగించుకునే మంత్రాంగాలు, నీటితోపాటు నిధులు రాబట్టజూడటం, నదుల అనుసంధానం ముసుగులో శకుని పాచికలు అన్నీ అనునిత్యం కనిపిస్తున్నవే. ఇవన్నీ అంతిమంగా నిర్వహణాపరమైన సామర్థ్యమే. కాకపోతే కూహకమైనది.
మొదట పేర్కొన్న మూడు లక్షణాలు అటువైపు చంద్రబాబులో ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత, ఇటువైపు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎట్లున్నాయో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఉపోద్ఘాతం వలె ఒక్క మాటలో చెప్పాలంటే, బనకచర్లపై ఆయనలో మనం చూస్తున్న తడబాట్లకు కారణం విషయ అవగాహన, నిబద్ధత, కార్యనిర్వహణా సమర్థత మూడూ లేకపోవడమే. ఆయనకు ఇవి మౌలికంగా లేవని కాదు. వ్యక్తిగతంగా తనకు అవసరమైన వాటిలో బాగానే ఉన్నాయి.
అధికార రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు, పదవుల సంపాదన, రియల్ ఎస్టేట్ (ఇది తను చెప్పినదే) వంటి వాటిలో. కానీ, ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా, ఆ రాష్ర్టానికి అవసరమైన విషయాల్లో లేవు. బనకచర్ల అనే కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరకాలంలో దేనినైనా చూడండి. ఏదో ఒక విధంగా అధికారం సంపాదించడం కోసం మొదట మంత్రాంగం నెరపి పీసీసీ అధ్యక్షుడయ్యారు. కానీ, పాజిటివ్ పద్ధతుల్లో పార్టీని నిర్మించిందేమీ లేదు. అసలు పార్టీని ఎట్లా నిర్మించాలనే అవగాహన, అందుకు అవసరమైన నిబద్ధత, కార్యనిర్వహణా సమర్థత ఆయనలో కనిపించలేదు. ఆ వెనుక, ముఖ్యమంత్రి కావాలనే వ్యక్తిగత ‘చిరకాల స్వప్నాన్ని’ నెరవేర్చుకునేందుకు నోటికి వచ్చిన అబద్ధపు హామీలన్నీ ఇచ్చి ఆ లక్ష్యాన్ని సాధించుకున్నారు. అంతేగానీ, ఆ హామీల అమలు గురించిన అవగాహన, అమలు చేయాలనే నిబద్ధత, చేయగల కార్యనిర్వహణా సమర్థతలను మొదటినుంచి ఇప్పటివరకు ఎన్నడూ చూపలేదు. జలవనరుల పథకాల నిర్మాణంలోనూ అదే కనిపిస్తున్నది.
ఇటువంటి పాజిటివ్ విషయాలకు బదులు రేవంత్‌రెడ్డి చూపుతున్న అవగాహన, నిబద్ధత, సమర్థత అంతా నెగెటివిజంలోనే. అబద్ధాలు, బుకాయింపులు, వాయిదాలు, మరిన్ని భ్రమల కల్పనలు, ఆరోపణలు, నిత్యం దుర్భాషలు, సొంత పార్టీలో, ప్రభుత్వంలో గ్రూపు రాజకీయాలు, ప్రత్యర్థులపై దొంగ కేసులు, పేదల అణచివేతలు, వారి ఇళ్లు కూలగొట్టడాలు, భూముల ఆక్రమణల వంటి వాటిలోనే. విశేషం ఏమంటే, ఇందుకు సంబంధించి కూడా చంద్రబాబుకు తనకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా చూడవచ్చు. ఆయన తమకు కావలసినవి, ఇటువంటివి రెండూ చేస్తున్నారు. మనిషికి కొన్ని లక్షణాలు మౌలికం అయినప్పుడు అవి అన్నింటా ప్రతిఫలిస్తాయి. ఆ మౌలికత లేనప్పుడు రేవంత్‌రెడ్డి వంటి స్థాయి, స్వభావం, కేవలం స్వప్రయోజనాలు గలవారు ఆ లక్షణాలను వాటితో నిమిత్తం గల విషయాల్లో మాత్రమే నెగెటివ్‌గా చూపుతారు. రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం గల వాటిలో పాజిటివ్‌గా ప్రదర్శించలేరు.
బనకచర్ల అటువంటిదే. ఈ విషయమై ఇంత చర్చ జరుగుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో గల వ్యక్తి అఖిలపక్ష సమావేశంలో అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది, ఏ బేసిన్లో ఉందని అధికారులను ప్రశ్నించడం దిగ్భ్రాంతి కలిగించే మాట. అదే లేనప్పుడు అవగాహన, నిబద్ధత, కార్యనిర్వహణా సమర్థతలు ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు చతురతను ఎట్లా ఎదుర్కొనగలరు? కేంద్రానికి ఆలస్యంగా మొక్కుబడి లేఖలు, ప్రతినిధివర్గాలు, ప్రతిపక్షాలపై యథా ప్రకారం నిందలు, చంద్రబాబుతో చర్చలు అనడం వంటి రోజుకొక తడబాటు వల్ల తన వైఫల్యాలు దాగుతాయా? కేసీఆర్ ఆందోళనా మార్గం ప్రకటించడంతో కలవరపడితే రేవంత్ తడబాట్లు ప్రజలకు తెలియకపోతాయా? ప్రజలకు కేసీఆర్ అందువల్లనే తిరిగి గుర్తుకు వస్తున్నారు. చంద్రబాబు మెడలు వంచగలిగేది ఆయన మాత్రమే.
– టంకశాల అశోక్