చాలామంది
ఆశారాజు ఎవరని
నన్నే అడుగుతారు!
తెలిసినవాళ్లు కొందరు-
తెలియనట్టే అడుగుతారు
తెలియనివాళ్లేమో..
తెలిసో తెలియకో అడుగుతారు
ఏమి జవాబు చెప్పాలి?
నా వద్ద రుజువులైతే లేవు
ఫొటో కార్డు కూడా ఏదీ లేదు
అందుకే అందాజాతో
ఆనవాళ్లు చెపుతూ
చార్మినార్ దగ్గర
బెలూన్లు అమ్ముకొనేవాణ్ని చూపిస్తాను
ఒక చేతిలో ఖాళీ పేపర్ గ్లాసులు
మరో చేతిలో ఫ్లాస్కు పట్టుకొని
చాయ్ అమ్ముకొంటూ
నయాపూల్ మీద తిరిగే
బాహర్వాలాను చూపిస్తాను
నమ్మినా నమ్మకపోయినా
మనిషి బొమ్మున్న
ఒక పుస్తకం చూపిస్తాను
వాళ్లు బొమ్మనూ గుర్తుపట్టరు
పుస్తకం కమ్మల్లోని ప్రేమనూ గుర్తుపట్టరు
ఇంకా ఆశారాజును
ఏమి గుర్తుపడతారు!?
–ఆశారాజు
93923 02245