విష్ణుపురాణం 6,400 పై చిలుకు శ్లోకాలు కలిగిన మహా పురాణం. పరాశర మహర్షి మైత్రేయుడికి వివరించినట్టుగా వ్యాసమహర్షి ప్రవచించాడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు ప్రాతఃకాలంలో పూర్తిచేయాల్సిన అనుష్ఠానాదులు పూర్తిచేసుకొని తీరిగ్గా కూర్చున్నాడు. ‘పరాశర మునివరం కృత పౌర్వాహ్నిక క్రియం మైత్రేయః పరిపప్రచ్ఛ-ప్రణిపత్యచ-అభివాద్యచ’. పప్రచ్ఛ అంటేనే ప్రశ్నించాడని అర్థం. పరిపప్రచ్ఛ-అంటే చక్కగా అడిగాడని.
పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలియజేసేది విష్ణు పురాణం. అంటే అదొక బ్రహ్మవిద్య. దాన్ని తెలుసుకోవాలనే తపన ఉంటే సరిపోదు. ఎలా అంటే అలా, ఎవరినంటే వారిని అడిగితే ప్రయోజనం ఉండదు. బ్రహ్మవేత్తలైన మహానుభావులను కాలక్షేపం కోసం ప్రశ్నించరాదు. అలా ప్రశ్నించడం వల్ల జ్ఞానం రాదు. అందరూ అడుగుతున్నారు కదా! అని మనమూ అడుగుదాం అని తోచింది ప్రశ్నించకూడదు. గురువుకు తెలుసా, లేదా అని పరీక్షించడానికి అసలు అడగొద్దు. కృష్ణావతార పరిసమాప్తి సన్నివేశాన్ని పరిశీలిస్తే.. గోపాలకులు ఒకనికి గర్భవతి వేషం ధరింపజేశారు. తపస్సంపన్నులైన మహర్షులకు ఎదురుపడి ‘ఈవిడ గర్భంలో ఉన్నది ఆడ శిశువా? మగ శిశువా?’ అని అడిగారు. కోపగించిన మహర్షులు ‘ఈ కడుపులో ముసలం పుడుతుంది. అది వంశనాశనం చేస్తుంది’ అని శపించారు.
ఆ గర్భంలో జన్మించిన ముసలమే యదువంశాన్ని నాశనం చేసింది, ద్వారకను సముద్రంలో కూలదోసింది. పరిహాసానికి చేసే విన్యాసాలు వినాశనానికి దారితీయొచ్చు. పెద్దవారిని ఏదైనా అడిగేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. వినయ విధేయతలు ఉట్టిపడుతుండగా, తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ప్రశ్నించాలి. ‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ అనే గీతాశ్లోకం ఈ విషయాన్ని చక్కగా విశదీకరిస్తుంది. మైత్రేయుడు ఇదే పద్ధతిని అవలంబించాడు. పరాశరుడికి ప్రణిపాతం- సాష్టాంగ నమస్కారం చేశాడు. అభివాద్యచ- నమస్కరించాడు! పరిపప్రచ్ఛ అంటే ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి సంపూర్ణ శరణాగతితో ప్రశ్నించాడు. మైత్రేయుడు అదే భావనతో పరాశరుడిని బ్రహ్మజ్ఞానం గురించి అడిగాడు. దానికి సమాధానంగా పరాశరుడు విష్ణుపురాణం ప్రధానంగా తత్వజ్ఞానాన్ని తెలియజేశాడు. బ్రహ్మజ్ఞానం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. అది వరించడం అనుకున్నంత తేలిక కాదు. సద్గురువును ఆశ్రయించి, ఆయన అనుగ్రహం పొందాలనే ఆకాంక్షతో చేతులు జోడించి ప్రశ్నించడం నేర్చుకోవాలి.
– డా॥ వెలుదండ సత్యనారాయణ, 94411 62863