ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఏ నియంత్రణ పాటించనక్కర లేదన్నట్టు ప్రతివారు తమ అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్దయగా వెలిబుచ్చుతున్నారు. ఒక వర్గం లేక ఒక మతానికి చెందినవారు వేరే వర్గాల గురించి తమ చిత్తం వచ్చినట్టు మాట్లాడటం సమాజాన్ని మరింత అతలాకుతలం చేయటానికి దోహదపడుతుందేకానీ ఏ మనిషికీ, ఏ వర్గానికీ లాభం చేకూర్చదని అందరూ గుర్తించాలి.
కులాలు, మతాలు-చాలా విధాలుగా రిజర్వేషన్ వెసులుబాటుతో ముడిపడి ఉండి, సమాజాన్ని ఇంకా ముక్కలు, ముక్కలుగా విడగొట్టటానికి దారి తీస్తున్నాయి. ఇదే పంథాలో ఎలక్షన్ ప్రసంగాల్లో ఉచితాల ప్రలోభాలు కూడా విమర్శకు గురవుతున్నాయి. అయితే వెనుకబడిన, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన వర్గాలు ఈ ఉచితాల ప్రమాణాలను నమ్మి, ఎన్నికల్లో అవినీతిపరులను, నేరస్థులను ఎన్నుకొంటున్నారు. అసలు ఉచితాలు ఇస్తామని రాజకీయ నాయకులు అనటం, అది ప్రజలు నమ్మటం దేనికి సంకేతం? ఇది తెలుసుకోకుంటే ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు బహుశా అర్థం కాకపోవచ్చు.
1947 ఆగస్టు 15- భారతదేశానికి శతాబ్దాల శృంఖలాలు తెగి స్వాతంత్య్రం సిద్ధించినరోజు. అంటే 78 ఏండ్ల 7 నెలలు అవుతున్నది ఇప్పటికి. మరి మన పక్కదేశం చైనా గురించి తెలుసుకొంటే భారతీయుల ఆలోచనలు ఎంత వెనుకబడి ఉన్నాయో తెలుస్తుంది. 1912 వరకు రాజవంశాల పాలన, ఆ తర్వాత ఉద్యమ ఫలితంగా స్వతంత్రత పొందినప్పటికీ చైనాకు నిజమైన స్వాతంత్య్రం 1949 అక్టోబర్ 1న వచ్చినట్టే చరిత్ర చెప్తున్నది. మరి ఒక్క అర్ధశతాబ్దం దాటేటప్పటికి విద్యారంగంలో, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా అభివృద్ధి ఎలా ఉండింది, భారతదేశం ఎక్కుడున్నది? ముఖ్యంగా విద్యారంగం ఎందుకు ఇంకా ఎదగలేదు? దీనికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్నెహ్రూ ముఖ్య కారణం అని చెప్పకతప్పటంలేదు. చైనాకు ఒకే మాతృభాష ఉండటం (కొన్ని మాండలికాలు ఉన్నా) చాలా అనుకూలం అయింది.
చిన్నచిన్న రాజ్యాలుగా ఉండి, అలాగే విదేశీ దండయాత్రల వరకు సాగిన భారతదేశ ప్రాంతాలు వివిధ భాషలు ఆచార వ్యవహారాలకు, ముఖ్యంగా వివిధ మతాలకు కేంద్రాలయ్యాయి. ఈ వైవిధ్యాన్ని గమనించకుండా, అర్థం చేసుకోకుండా పాశ్చాత్య విధానంతో స్థానిక సంస్కృతిని విస్మరించి విద్యా విధానం సాగటంతో, భారతీయులకు తమ సొంత సంస్కృతి పట్ల అవగాహన లోపించింది.
దేశ పౌరుల కన్నా, ప్రాంత, రాష్ట్ర పౌరులమనే భావనే కానీ ఐక్యత, భారతీయత పెరగలేదు. స్వార్థం కోసం రాజకీయ నాయకులు శతృత్వానికి దారితీసే కులాలు, మతాల మధ్య ఇంకా చిచ్చు పెడుతూనే ఉన్నారు. నిజానికి అంబేద్కర్-మహామేధావి. విద్యారంగానికి ఒక ప్రతిపాదన చేశారు. అది రాజ్యాంగంలో పెడుదామని అనుకున్నారు. వెనుకబడిన వారికి తగినంత ధనాన్ని వెచ్చించి, మంచి ఉపాధ్యాయులను నియమించి విడిగా పాఠశాలలు, కళాశాలలు 1వ తరగతి నుంచి రాజకీయ నాయకులయ్యే శిక్షణ వరకు ఏర్పరచి ఒక తరాన్ని అభివృద్ధి చేస్తే అది వారి తర్వాతి తరాలకు ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ గాంధీజీ ఆ ప్రతిపాదనకు అడ్డుపడి అటువంటి వేర్పాటు పద్ధతి వద్దే వద్దు అని నిరసన ప్రారంభించారు. ఇంకా ప్రజలకు, రాజకీయ నాయకులకు కూడా కనీస విద్యార్హత ఉండాలన్న అంబేద్కర్ ప్రతిపాదనను గాంధీ, నెహ్రూ ఇద్దరూ తోసిపుచ్చారు. ఓటరుకు కనీస విద్య ఉంటే సొంత ఆలోచన ఉంటుందన్న అంబేద్కర్ వాదనను తోసిపుచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగ తప్పనిసరి చదువులు లేకపోవటం, ప్రభుత్వ పాఠశాలలు సరిపోయినంతగా తెరవకుండా, జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఐఐఎంలు వంటివి ఇంగ్లిష్ మాధ్యమంలో స్థాపించటంతో అప్పటి వరకు విద్యను పొందిన అగ్రకులాల వారి పిల్లలకే లాభం చేకూరింది. గ్రామీణ బాలబాలికలు, యువత వెనుకబడిపోయారు. ఈ సంస్థల్లో చదువుకున్నవారు చాలామంది తమ సొంత అభివృద్ధి కోసం చదువు కాగానే విదేశాలకు వెళ్లిపోయారు. వారి తెలివి వల్ల ఆయా దేశాలు బాగుపడ్డాయి, మేధో వలస వల్ల భారతదేశం వెనుకబడిపోయింది. దురదృష్టవశాత్తు ధనవంతులు, అగ్రకులాల వారు బ్రిటిష్ వారి పాలనలో ఉద్యోగాలు పొంది నగరాలకు, చిన్న, పెద్ద పట్టణాలకు వలస వెళ్లి స్థిరపడటంతో విద్యావకాశాలు, ఉద్యోగాలు, వారి తర్వాతి తరాలకే దక్కాయి. ప్రభుత్వాలు గ్రామీణరంగ వ్యవసాయాన్ని గాని, ఇతర వృత్తులను గాని బలపర్చకపోవటంతో ఆ ప్రజల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.
78 ఏండ్ల తర్వాత కూడా ఉచితాల భ్రమలు పెట్టే రాజకీయ నాయకులు, ఆ ఉచితాలకు ఆశపడి వారిని ఎన్నుకొనే ప్రజలు ఈ దేశంలో ఉండటం నాయకులకు సిగ్గుపడే అంశం, ప్రజలను చూసి జాలిపడవలసిన అంశం. స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు దేశాన్ని పాలించిన పార్టీలను రాజకీయ వెలివేయాలి. రాష్ర్టాల్లో స్థానిక పార్టీలు బాగున్న వాటిని ఎన్నుకోవాలి. అసలు భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశానికి కేంద్రీకృత పాలన హానికరం, నష్టకరం. ఇప్పటికిప్పుడు అన్నీ మార్చలేము కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో కొద్దిమార్పు కోసం ఏమి చేయాలో విశ్లేషిద్దాం.
రిజర్వేషన్లు కానీ, ఉచితాలు కానీ ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటుకు ఉపయోగపడుతాయి కాబట్టి వాటిని కులాలు, మతాలకు ముడిపెట్టకుండా విడదీయాలి. సరైన జనాభా గణన, పరిస్థితులు విచారించి, వేరే నిబంధనలు లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ వసతులు కల్పించాలి. వారికి మాత్రమే ఆ వెసులుబాటు అందాలి. వెనుకబడిన కులాలు, వర్గాలయినా, రెండు తరాలకు మించి వారికి వసతులు ఇవ్వకూడదు. తండ్రి, తాత చదువుకున్న వారైతే ఇక వారి మనుమలు వెనుకబడ్డవారెలా అవుతారు? ఈ విషయంలో ఇప్పటి వరకు రిజర్వేషన్లు పొందిన వారు కూడా వారి వర్గం గురించి విశాలంగా ఆలోచించి ఆర్థికంగా అభివృద్ధి పొందాక ఇక రిజర్వేషన్లు తమకు వద్దని చెప్పగలగాలి. అగ్రకులాల వారిలోని పేదవారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే ఈ వివక్ష పోతుంది. కులం బట్టి కాకుండా ఆర్థిక స్థితి బట్టి వసతులు కల్పిస్తే ఇక ఎవ్వరూ ఎవరినీ తప్పుబట్టే పరిస్థితి ఉండదు. ఒక్కరూ బయటకు మాట్లాడరని సామాజిక మాధ్యమాలు గీపెడుతున్నాయి. కానీ చాలామంది బయటకు మాట్లాడకపోయినా వారిలో అక్కసు చాలా ఉంటుంది. ఇక కులాలు, మతాలు అడగకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి కావాల్సినవి ఉచిత విద్య, ఉచిత వైద్యం.
నాయకులు అక్రమ సంపాదనను ఎన్నికల్లో కానుకల రూపంలో పంచి, సంస్కృతిని నాశనం చేయడానికి బదులుగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. తద్వారా ప్రజలు ఎదుగుతారు. దేశం బాగుపడుతుంది. ఆర్థిక అసమానతలు, కులాలు, మతాల కంటే ఎక్కువ బలమైనవి. వాటిని బట్టి ప్రజలకు అవకాశాలు కల్పించాలి.
– కనకదుర్గ దంటు
89772 43484