కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు కాళేశ్వరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారుతున్నది. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి మొత్తం ప్రాజెక్టే దండగ అన్నట్టు చెప్పే ధోరణి దీని వెనుక ఉన్నది. ఇందులో గల్లీలోని ఛోటేభాయ్, ఢిల్లీలోని బడేభాయ్ దొందూదొందే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం తెలిసిపోతూనే ఉన్నది. ఈ సూత్రధారులు ఆడిస్తున్న నాటకంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కేవలం ఓ పాత్రధారి మాత్రమే. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కనుసన్నల్లో పనిచేసే ఎన్డీఎస్ఏ వండివార్చిన అతుకుల బొంత నివేదికపై కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కాంగ్రెస్ సర్కారు పెద్దలు గంతులు వేయడం ఈ మిలాఖతు రాజకీయాలకు పరాకాష్ఠ.
ప్రాజెక్టును సకాలంలో బాగుపర్చి సాగుకు అండగా నిలపడం కన్నా బీఆర్ఎస్పై బురదజల్లడం మీదనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తేటతెల్లమైపోతున్నది. తుదినివేదిక వెలుగు చూసిన సమయం, సందర్భమే దీనిని పట్టిస్తున్నది. అసలు ఎన్డీఎస్ఏ శల్యపరీక్ష మొదటి నుంచీ రాజకీయ కోణంలోనే సాగుతున్నది. కాళేశ్వరంలోని మూడు బరాజ్‌లలో ఒకటైన మేడిగడ్డలో 89 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే కుంగిపోయాయి. భారీ ప్రాజెక్టుల్లో ఇలాంటివి జరగడం అత్యంత సహజమని నీటిపారుదల రంగం గురించిన కనీస అవగాహన ఉన్నవారెవరికైనా అర్థమవుతుంది. ప్రపంచ బ్యారేజీల, ఆనకట్టల చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏ ప్రాజెక్టుకైనా తొలినాళ్లల్లో చిన్నచిన్న ఇబ్బందులు రావడం, వాటికి మరమ్మతులు చేసుకుని ముందుకు సాగడం అనేవి తప్పవు. కానీ పియర్స్ కుంగింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావడంతోనే చిక్కొచ్చింది. కాంగ్రెస్, బీజేపీ గాయిగాయి చేశాయి. ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద కదలివచ్చింది. గంటల వ్యవధిలో, అదీ పియర్ దగ్గరకు వెళ్లి కనీసం పరిశీలన అయినా చేయకుండానే ప్రాథమిక నివేదిక ఇవ్వడం, దానిని పట్టుకుని కాంగ్రెస్ , బీజేపీలు ఊరేగడం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం చకచకా జరిగిపోయాయి.
అసలు నివేదికే ఇస్తుందో, లేదో తెలియని సందిగ్ధం ఏర్పడింది. మధ్యలో సరిగ్గా పార్లమెంటు ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక వచ్చింది. ఇప్పుడు ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా తుది నివేదిక ఇవ్వడం, అందులో ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాకు ఎక్కడం చూస్తుంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితం కాకపోతే మరేమిటి అనిపించక మానదు. కేంద్ర పర్యవేక్షణలో కడుతున్న పోలవరం కూలి ఐదేండ్లయినా ఇంతవరకు ఆవైపు తొంగి చూడని ఎన్డీఎస్ఏ ఇక్కడ పైపై పరిశీలనలతో నివేదిక ఇవ్వడమేమిటి? ఇంతకూ ఏమి తేల్చింది? ఏడో బ్లాకును పునరుద్ధరించిన ప్రాజెక్టును యథాతథంగా ఉపయోగించుకోవచ్చని ఒకచోట, ఇలాంటి సమస్యలే మిగతా బరాజ్‌లలో ఉండవచ్చును కనుక పరీక్షలు జరపాలని మరో చోటా ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా సెలవిచ్చింది. అది పట్టుకుని సర్కారు కోడిగుడ్డుపై ఈకలు పీకే పనికి పాల్పడుతున్నది. నివేదికలో ప్రస్తావించని అవినీతి అంశంపై మాట్లాడటం కుట్రబుద్ధే. ఈ మొత్తం వ్యవహారంలో కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్పై బురద జల్లడం అన్నదే ఏకైక లక్ష్యంగా కనపడుతున్నది. ఈ రాజకీయ కక్షసాధింపు పేరిట రైతాంగాన్ని సమస్యల పాలు చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు.