తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు ఎక్కువ రోజులు జరిగాయి. 34 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు పరీక్షల మూల్యాంకనం మూడు విడతలుగా రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితశాస్త్రంతో మూల్యాంకనం ప్రారంభం కానున్నది. రెండో విడత ఏప్రిల్ 10 నుంచి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, చివరగా మూడో విడత ఏప్రిల్ 18 నుంచి సాంఘిక శాస్త్రంతో మూల్యాంకనం ప్రారంభం కానున్నది.
ఏప్రిల్ 1 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ప్రారంభం కానున్న ఈ మూల్యాంకన ప్రక్రియ 23 రోజుల పాటు అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నది. క్యాంప్ ఆఫీసర్ మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ వరకు సుమారు 25 వేలమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సాధారణ సెలవులు, ఆదివారాలతో సంబంధం లేకుండా మూల్యాంకన ప్రక్రియలో పాల్గొననున్నారు. మూల్యాంకన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. అత్యంత ప్రాధాన్యత గల పదో తరగతి మూల్యాంకనంపై ఉపాధ్యాయులు మాత్రం నిరాసక్తతతో ఉన్నారు. దీనికి కారణం మూల్యాంకన పారితోషికం కోసం ఏడాది కాలం వరకు వేచి ఉండాల్సి రావడమే. ప్రభుత్వం మూల్యాంకనంలో చెల్లిస్తున్న రెమ్యూనరేషన్, పేపర్ రేట్లు, డీఏ రేట్లు పెంచకపోవడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ మూల్యాంకన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వీల్లేదు. ప్రస్తుత రెమ్యూనరేషన్ రేట్లను నిర్ధారిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు గతంలో జీవో విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం క్యాంప్ ఆఫీసర్‌కు రూ.578, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌కు రూ.495, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్‌కు రూ.429, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.396, అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు పేపర్‌కు రూ.10, స్పెషల్ అసిస్టెంట్‌కు రోజుకు రూ.250 మాత్రమే చెల్లిస్తున్నారు. స్పెషల్ అసిస్టెంట్లకు కనీసం టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ, టీఏ ఇవ్వాలని ప్రతి సంవత్సరం స్పాట్ కేంద్రాల వద్ద నిరసన తెలిపినా ఫలితం లేదు.
పీఆర్సీ 2015 సిఫారసు ప్రకారం జీవోఎంఎస్ నం.60ని (తేదీ 02-05-2015) అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం గ్రేడ్ వన్ ఉద్యోగికి రూ.450, గ్రేడ్ టూ ఉద్యోగికి రూ.300, గ్రేడ్ త్రీ ఉద్యోగికి రూ.225 డీఏగా నిర్ధారించారు. ఆ పాత రేట్లతోనే మూల్యాంకనంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు డీఏ చెల్లిస్తున్నారు. 2020 పీఆర్సీ కమిషన్ కొత్త డీఏ రేట్లను సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వం పాత డీఏ రేట్లే చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గతంలో పదవ తరగతిలో 40 మార్కులకు ఒక పేపర్ చొప్పున తెలుగుకు రెండు, హిందీకి (80 మార్కులు) ఒకటి, ఇంగ్లీషుకు రెండు, గణితంనకు రెండు, భౌతికశాస్ర్తానికి ఒకటి, జీవశాస్ర్తానికి ఒకటి, సాంఘికశాస్ర్తానికి రెండు.. మొత్తం 11 పేపర్లు ఉండేవి. 40 మార్కుల పేపర్ మూల్యాంకనం చేస్తే రూ.10 చొప్పున చెల్లించేవారు. కొవిడ్ అనంతరం మొత్తం పేపర్లు 11 నుంచి 6కు తగ్గించారు. ఒక పేపర్ మార్కులు 40 నుంచి 80కి పెంచారు. 80 మార్కుల పేపర్ మూల్యాంకనానికి రెమ్యూనరేషన్ రూ.10 చొప్పున కాకుండా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అదే 40 మార్కుల పేపర్‌గా ఉన్న భౌతిక, జీవశాస్ర్తాలకు రూ.10 చెల్లిస్తున్నారు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో 80 మార్కుల పేపర్‌కు రూ.10లే చెల్లిస్తున్నారు.
ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ రేట్లకు, పదవ తరగతి పేపర్ వాల్యుయేషన్ రేట్లకు భారీ వ్యత్యాసం ఉన్నది. ఇంటర్లో ఒక పేపర్ వాల్యుయేషన్‌కు రూ.23.66 చెల్లిస్తుండగా, ఈ సంవత్సరం దానిని రూ. 29.57కు పెంచారు. కానీ పదవ తరగతిలో ఇప్పటికీ కేవలం రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇంటర్లో డీఏ విషయంలో స్థానికులకు రూ.235, 50 కిలోమీటర్ల లోపు నుంచి వస్తే రూ.400, 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వస్తున్న వారికి రూ.878 చెల్లిస్తున్నారు. పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌లో సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారు కూడా ఉన్నారు. అయినా వారికి కేవలం రూ.300 మాత్రమే డీఏగా చెల్లిస్తున్నారు. 40 మార్కుల పేపర్‌కు రెమ్యూనరేషన్ రూ.10 నుంచి 20కు, 80 మార్కుల పేపర్ రెమ్యూనరేషన్ రూ.10 నుంచి రూ.30కు పెంచాలని, డీఏ రేట్లను కూడా సవరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
లక్షల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రక్రియ పదవ తరగతి మూల్యాంకనం. ఈ ప్రక్రియ గుణాత్మకంగా సాగాలంటే అందులో పాల్గొనే ఉపాధ్యాయులు ఉత్సాహవంతంగా ఉండాలి. అందువల్ల వారికి చెల్లించే రెమ్యూనరేషన్ ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులను ప్రోత్సహించే విధంగా పదవ తరగతి మూల్యాంకన రెమ్యూనరేషన్ రేట్లు, డీఏ రేట్లు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు టీఏ, డీఏలు చెల్లించాలని ఉపాధ్యాయులు కోరుతున్నది.
– జుర్రు నారాయణ యాదవ్ 94940 19270