Telangana | నవంబర్ 29.. యావత్ తెలంగాణ మర్చిపోలేని రోజు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన ఉద్విగ్న సందర్భం! దశాబ్దాలుగా గోసపడుతున్న తెలంగాణ ప్రాంతం సాగిస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక అపూర్వ ఘట్టం! ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు! మహాత్ముడి అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. తన దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి డిసెంబర్ 9న ప్రకటన చేయించిన సుదినం. తన ప్రాణాన్ని పణంగా పెట్టి, పోరుకు కొత్త ఊపిరులూదిన రోజు. అందుకే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యమశక్తులు ఈ రోజు ఏటా తెలంగాణ దీక్షా దివస్‌గా పాటిస్తున్నాయి.
సమైక్యవాదుల చెరలో చిక్కుకున్న తెలంగాణ సంకెళ్లు అంత సులువుగా తెగలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతోనే తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచుకున్నాయి.
2009 నవంబర్ 29న దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. కరీంనగర్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి బయలుదేరారు. కేసీఆర్ వాహనాన్ని ముట్టడించిన పోలీసులు, ఆయన ఆమరణ నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కేసీఆర్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆయనను ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైలులోనే కేసీఆర్ దీక్ష మొదలుపెట్టారు. తన ఆరోగ్యం క్షీణించినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేకుంటే నా శవయాత్ర’ అని నినదించడంతో కేంద్ర తలొగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు.
తెలంగాణ ఉద్యమం.. అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి, పదవులను తృణప్రాయంగా త్యజించి తెలంగాణను కేసీఆర్ సాధించారు. జలదృశ్యంలో పురుడుపోసుకున్న ఉద్యమం అనేక ఆటుపోట్లను చవిచూసింది. ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ కెరటంలా మళ్లీ లేచింది. అస్తిత్వ ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమాలు సాగించి.. పోరుపంటలు పండించి.. రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అందరూ కోరుకున్నట్టుగానే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.
‘ప్రజాహితం.. ప్రగతి రథం’.. ఇదే బీఆర్ఎస్ సర్కార్ నినాదం, విధానం. పదేండ్ల పాలసీలే అందుకు నిదర్శనం. సంపద పెంచి, పేదలకు పంచడమే బీఆర్ఎస్ విధానం. తెలంగాణ ఏర్పడే నాటికి తాగు, సాగునీరు లేక కరువుతో అల్లాడుతూ, వలసలపాలై, బతుకుదెరువు కోసం అన్న మో రామచంద్రా అని దేశం నలమూలలకు లక్షల మంది తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొనిపోయారు. మెరుగైన కరెంటు లేదు.. ఇరిగేషన్ సౌక ర్యం లేదు. కొత్త రాష్ట్రం.. కొత్తకుండలో ఈగ జొచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి, కేసీఆర్ మేధోమధనం చేసి రాష్ర్టాన్ని చక్కదిద్దారు.
పట్టుదలకు మరో పేరు, నిబద్ధతకు నిలువుటద్దం కేసీఆర్. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి. ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకొని, ప్రజాబంధువుగా నిలిచి పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందుతుందో ఆచరణలో చూపించిన ఘనుడు కేసీఆర్. అభివృద్ధికి నడక నేర్పించడమే కాదు, అద్భుత పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఏం చేసినా సాహసోపేతమే. కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేశారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాలకుడు కేసీఆర్.
స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసినా, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశ పు ధాన్యాగారంగా మార్చినా, 70 ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్యను తీర్చినా, పాలమూరు వలసలు వాపసయ్యేలా చేసినా.. అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. సంక్షేమ శ్రేయోరాజ్య లక్ష్యాలను కేసీఆర్ అనతి కాలంలోనే సాధించిన తీరుకు దేశమే నివ్వెరపోయింది.
పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణకు స్వర్ణయుగం. ఆరు దశాబ్దాల పాటు పరాయి పాలనలో అల్లకల్లోలంగా ఉన్న తెలంగాణను ప్రగతికి చిహ్నంగా తీర్చిదిద్దారు కేసీఆర్. ప్రపంచం అచ్చెరువొందే రీతిలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగించారు. రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చేశారు. అత్యుత్తమ వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ విధానాలతో తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దారు. సకలజనుల వికాసం, సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత వాతావరణం, రాజకీయ సుస్థిరత, వేగవంతమైన అభివృద్ధి అనేవి కేసీఆర్ వినూత్న ఆలోచనలు, శ్రమ ఫలితమే.
రాష్ర్టాన్ని పాలించిన నేతగా, తెలంగాణ బతుకుచిత్రాన్ని అధ్యయనం చేసి, సంపూర్ణంగా అవగాహన చేసుకొని, ఒక్కో రంగానికి ఒక్కో పథకాన్ని అమలు చేసి ఫలితాలను రాబట్టారు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు అందని పథకం లేదు. రాష్ట్రం ఏర్పడగానే పాలనాపరమైన ఇబ్బందులు ఎన్నున్నా తొలిరోజు నుంచే పేద ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే, ఇవాళ దీక్షా దివస్ సందర్భంగా ప్రజలందరూ తమ బతుకులు మార్చిన కేసీఆర్‌ను తల్చుకుంటున్నారు. జయహో కేసీఆర్ అంటూ జేజేలు పలుకుతున్నారు.
– బాల్క సుమన్
పార్లమెంట్ మాజీ సభ్యులు, పెద్దపల్లి; మాజీ శాసనసభ్యులు, చెన్నూర్)