సీ- పదునారిన నదులు కుదురుగా నృత్యంబు
పదపడి మొదలిడి ముదము గూర్చె
చెరువులు రూపారి కరువున్న తరుణాన
త్రవ్వకముల త్రాణ ప్రగతి పెంచె
ఉదకము నూతిలో నుబ్బతిల్లుచు లేచి
చేద లేకుండనే చేతి కందె
సాలుకు సరిపోవు కాలువలు జాలెత్త
సాగు సవ్యంబుగా సాగుచుండె
తే- పల్లెలెల్ల కుశలమున నుల్లసిల్లె
పైరు పచ్చగా ప్రతిచోట పల్లవించె
పూలు వికసించి తావితో పులకరించె
మా తెలంగాణ వృద్ధిలో మకుట మయ్యె
తే- ఆనకట్టల నిర్మాణ మధికమయ్యె
నాళములు ప్రాకి నేలను నాన్పుచుండె
క్షేత్రముల పుష్టి ప్రాప్తించె శ్రేష్ఠముగను
మా తెలంగాణ మాగాణి మణుల శ్రేణి
తే- క్రమ్మె కౌతుకం గ్రామీణ కాంత లందు
పొంగె స్వాంతనం పొలుపుగా పురజనులకు
ప్రతిభ చేకూరె మెండుగా పాలకులకు
మా తెలంగాణ శ్రీవత్స మానికంబు