Bigg Boss | భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ప్రత్యేక స్థానం ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి పలు భాషల్లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్ల ఆట, గొడవలు, ఎమోషన్స్, టాస్క్‌లతో పాటు.. ప్రతి సీజన్లో హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆయన లేదా ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే అంశం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, సెలబ్రిటీలు హోస్ట్‌లుగా వ్యవహరిస్తుండటంతో వారి పారితోషికంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నేషనల్ మీడియా కథనాల్లో వెల్లడైనట్లు చెబుతున్న వివిధ భాషల బిగ్‌బాస్ హోస్ట్‌ల రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత సౌత్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సేతుపతి, నాగార్జున వంటి స్టార్ హీరోల పేర్లు కనిపిస్తున్నాయి. హిందీ బిగ్‌బాస్‌కు ఎన్నో సీజన్లుగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ ఎపిసోడ్లలో ఆయన కంటెస్టెంట్లతో మాట్లాడే తీరు, తప్పులను ఎత్తిచూపే విధానం, సరదా పంచ్‌లు.. షోకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.నేషనల్ మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్ ఒక సీజన్‌కు సుమారు రూ.125 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు, ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా తీసుకుంటారనే వార్తలు కూడా గతంలో ప్రచారంలోకి వచ్చాయి.ఈ లెక్కలను చూస్తే బిగ్‌బాస్ హోస్ట్‌లలో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమిళ బిగ్‌బాస్‌కు ప్రస్తుతం స్టార్ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో హోస్ట్‌గా ఉన్న కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.తన సహజమైన మాటతీరు, కంటెస్టెంట్లతో సూటిగా మాట్లాడే విధానం, ప్రత్యేకమైన హోస్టింగ్ స్టైల్‌తో విజయ్ సేతుపతి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం తమిళ బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం ఆయనకు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బిగ్‌బాస్ హోస్ట్‌లలో విజయ్ సేతుపతి ఒకరిగా నిలిచినట్లు చెబుతున్నారు. తెలుగు బిగ్‌బాస్ విషయానికి వస్తే కింగ్ నాగార్జున వరుసగా హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం నాగార్జున ఒక సీజన్‌కు సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
మలయాళ బిగ్‌బాస్‌కు సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మలయాళ ప్రేక్షకుల్లో ఆయనకున్న భారీ క్రేజ్ షోకు ప్రధాన ఆకర్షణగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం మోహన్‌లాల్‌కు సుమారు రూ.30 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు సమాచారం. స్టార్ హీరోగా ఉన్న తన ఇమేజ్ను బిగ్‌బాస్ షోకు తీసుకురావడంలో మోహన్‌లాల్ కీలకంగా మారారు. కన్నడ బిగ్‌బాస్‌కు చాలా కాలంగా కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం సుదీప్ బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం సుమారు రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నో సీజన్లుగా షోతో కొనసాగుతున్న ఆయనకు ప్రత్యేకమైన హోస్టింగ్ స్టైల్ ఉంది. ఇక భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు కూడా బెంగాలీ బిగ్‌బాస్‌తో ముడిపడి ఉంది. ఆయనకు సంబంధించిన డీల్ విలువ కూడా భారీగానే ఉందని నేషనల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.నాలుగేళ్ల ఒప్పందానికి రూ.125 కోట్ల వరకు డీల్ కుదిరినట్లు రిపోర్ట్స్‌లో వెల్లడైనట్లు సమాచారం.