Vrial News : పల్నాడు జిల్లాలో అత్యంత అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ కడుపులో నుంచి ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఈ వస్తువులను మింగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల మహిళకు కొన్ని రోజులుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ఆమె కడుపులో పెద్ద సంఖ్యలో వస్తువులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే లాప్రోస్కోపిక్ విధానంలో కడుపునకు చిన్న రంధ్రం చేసి, మొత్తం 20 వస్తువులను సురక్షితంగా తొలగించారు. ఆమె మింగిన ఓ పెన్నుకు క్యాప్ లేకపోవడంతో అది కడుపులో గుచ్చుకుని నొప్పికి కారణమై ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఆమె తండ్రి నోముల హనుమంతరావు మాట్లాడుతూ.. తన కుమార్తె గత పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, రెండు నెలల క్రితమే భర్త విడాకులు ఇచ్చాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మానసిక వేదనతోనే ఆమె ఇలాంటి చర్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.