Vishwambara | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత అయోమయం కూడా నెలకొంది. ఒకవైపు చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మరోవైపు దర్శకుడు వశిష్ఠ కూడా తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి-వశిష్ఠ కాంబినేషన్లో వచ్చిన ‘విశ్వంభర’ను మొదటి నుంచే భారీ స్థాయిలో తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే విడుదలైన సినిమా ప్రచార కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా చిరంజీవిని ఫాంటసీ ప్రపంచంలో సరికొత్తగా చూపించబోతున్నారనే ప్రచారం సినిమాపై హైప్‌ను పెంచింది.అయితే ఈ సినిమా తొలుత 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో విడుదల వాయిదా పడింది. అనంతరం 2026 సమ్మర్లో విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ షెడ్యూల్ కూడా కార్యరూపం దాల్చలేదు.ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి చిత్రం ‘కాకా’ కీలక షెడ్యూల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. దీంతో ‘విశ్వంభర’ కంటే ఆయన ఫోకస్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌పై ఉన్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు దర్శకుడు వశిష్ఠ కూడా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో తన తదుపరి సినిమాను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.దీంతో ఒకే కాంబినేషన్లో మొదలైన ‘విశ్వంభర’ ప్రయాణంలో హీరో, దర్శకుడు ఇద్దరూ తమ తదుపరి ప్రాజెక్టుల వైపు వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇప్పుడు మెగా అభిమానులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. గతంలో ‘విశ్వంభర’ను అక్టోబర్ మధ్యలో విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.దీంతో సినిమా నిజంగా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడటంతో అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.