రేవంత్ పాలనలో తెలంగాణ రోజురోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. అరచేతిలో స్వర్గాన్ని చూపించే అబద్ధపు హామీలు, వట్టి మాటల మూటల వాగ్దానాలు నమ్మిన రాష్ట్ర ప్రజలు నేడు పశ్చాత్తాపం పడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చి మరోపక్క హంగు, ఆర్భాటాలు చేయడాన్ని ప్రభుత్వం ఏ రకంగా సమర్థించుకుంటుంది?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని చెప్తూనే గొప్పలకు పోతున్నారు. మరో విచిత్రం ఏమంటే కొద్ది దూరం పోవాలన్నా మంత్రులు హెలికాప్టర్‌నే వాడుతున్నారు. అప్పులు పుట్టడం లేదని, ఢిల్లీ నుంచి సహకారం లేదని, చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. సీఎం ప్రకటనలు రాష్ట్ర ఆర్థికస్థితిని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొలేక వారు హైదరాబాద్‌కు పరిమితమవుతున్నారు. మంత్రులను సైతం ప్రజలు నిలదీస్తున్న సందర్భాలనేకం.
ఏ మంత్రి ఏ విధంగా మాట్లాడుతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ ఇద్దరు మంత్రుల మధ్య సఖ్యత కనపడటం లేదు. అందరి లక్ష్యం ముఖ్యమంత్రి పీఠమే. ఎవరికి వారు ఢిల్లీలో తమ పరపతి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ చాలామంది ఆశావహులకు ఒక ఎండమావి లాగా ఊరిస్తున్నది. విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి కానీ, ఇంతవరకు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. పత్రికల నిండా ప్రకటనలు మాత్రం ఆర్భాటంగా గుప్పిస్తున్నారు.
హైకోర్టు మొట్టికాయలు ప్రభుత్వానికి అలవాటైపోయాయి. అయినా తన తీరు మార్చుకోకుండా అప్రజాస్వామిక పద్ధతుల్లో భూసేకరణ ప్రయత్నాలు జరుపుతూనే ఉంది. దిలావర్పూర్, లగచర్ల, కొడంగల్, పోలేపల్లి లాంటి చోట్ల ప్రభుత్వానికి బొప్పికట్టింది. గ్రూప్-1 పరీక్ష జరిగిన తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. నెలలు గడుస్తున్నా ఎస్‌ఎల్‌బీసీలోని మృతదేహాలను సర్కారు బయటకు తీయలేకపోతున్నది. తన కుర్చీని కాపాడుకునే ప్రయత్నాల్లో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి సీఎంకు సమయం సరిపోవడం లేదు. పదే పదే హస్తిన బాట పడుతున్నారు. పాలనను గాడిలో పెట్టే సమర్థత ఆయనకు లేదని రాజకీయ విశ్లేష కులు భావిస్తున్నా రు.
ఆయన అనుభవరాహిత్యం రాష్ర్టాన్ని తిరోగమనంపాలు చేస్తున్నది. ఎంతసేపూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడపడమే సర్కారు పనిగా పెట్టుకున్నది. ఒక పక్క రాష్ట్రం రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలు, విదేశీ పర్యటనలు, ప్రపంచ సుందరి పోటీలతో గడుపుతుండటం ఆక్షే పణీయం. ఒక కొత్త రాష్ర్టానికి, దాని భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి పదవిని అనుభవిస్తూ, హోదాను ఆస్వాదిస్తూ రోజులు గడపడం వల్ల తెలంగాణకు చేటు జరుగుతున్నదని ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. లేకుంటే తెలంగాణ భవిష్యత్తు అంధకార మవుతుందనడంలో అనుమానం లేదు.
– శ్రీ శ్రీ కుమార్