తలాపున పారుతున్న గోదారిగంగను కొండలెక్కించుకున్నం. సాగునీటికి, తాగునీటికి ఢోకా లేకుండా వరుస ఎత్తిపోతలతో నీటికి నడకలు నేర్పినం. నీరు పారింది. తెలంగాణ సాగు బాగుపడింది. నెర్రెలుబారిన నేల దేశానికే అన్నపూర్ణగా ఎదిగింది. ఇదంతా కేసీఆర్ సాధించిన విజయ గాథ. కానీ, ఇప్పుడు మన నీటికోట తాళాలను తెలంగాణ విరోధుల చేతికిస్తున్నారు. గోదారిని చెరబట్టేందుకు పొరుగు సీఎం చంద్రబాబు, దూరాలకు తరలించుకుపోయేందుకు ప్రధాని మోదీ ఎత్తులు వేస్తున్నారు. గోదారిని కొల్లగొట్టి, తెలంగాణను ఎండబెట్టే దారుణానికి ఒడిగడుతున్నారు. చంద్రబాబు పోలవరం రిజర్వాయర్‌ను విస్తరించి బొల్లపల్లి రిజర్వాయర్‌కు అటునుంచి బనకచర్లకు నీటిని మళ్లించేందుకు పావులు కదుపుతున్నారు. 200 టీఎంసీలకుపైగా నీటిని ఎగరేసుకుపోయే పన్నాగమిది. జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకొనే పోలవరంలో కేం ద్రం అనుమతి లేకుండానే మార్పులుచేర్పులు చేయాలంటే సాధ్యమా? అంటే ఢిల్లీ మిలాఖతు కూడా ఇందులో ఉందని స్పష్టంగా అర్థమవుతున్నది.
దరఖాస్తులు లేవు, అనుమతులూ లేవు. కానీ, పోలవరం-బనకచర్ల లింకుకు కేంద్రం రూ.3 వేల కోట్లు ఇస్తానని చెప్పడమే అందుకు తార్కాణం. చంద్రబాబు అధికారంలోకి రాగానే బనకచర్లను ఎత్తుకోవడం, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్తలోనే ఇదే అదనుగా గోదావరి-కావేరి అనుసంధానం ప్రతిపాదనను కేంద్రం బయటకు తేవడం కాకతాళీయం ఏమీ కాదు. పోలవరాన్ని పరుగులు పెట్టించడానికి ఏకంగా ప్రధాని రంగంలోకి దిగడం గమనార్హం. గోదారి జలాలు తెలంగాణకు దక్కకుండా ఎగరేసుకుపోయి ఎక్కడెక్కడో జలసంతర్పణ చేస్తామనటం విడ్డూరం. ఏపీ, కేంద్రం ఈ విషయంలో తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయనేది నూటికి నూరుపాళ్ల వాస్తవం.
ఇలా రెండువైపుల నుంచి జరుగుతున్న దాడి వల్ల తెలంగాణ ప్రయోజనాలు గోదారిలో మునిగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ జలదోపిడీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండింతలుగా వంతపాడుతున్నది. ఒకటి, తెలంగాణ గోదారి జలాల హక్కులను కాపాడటంలో నిర్లిప్తంగా ఉండిపోవడం. రెండు, తెలంగాణ గోదారి జలాలు గరిష్ఠంగా వినియోగించుకునేందుకు మహత్తరమైన వ్యవస్థను కలిగిన కాళేశ్వరాన్ని కేవలం మేడిగడ్డలోని ఒక్క పిల్లర్ కుంగిపోయిందనే సాకుతో కాటగలపడం. మన ప్రాజెక్టులను మనమే నిర్వీర్యం చేసుకొని పొరుగువారి, ఇంకా అవతల ఉన్నవారి ప్రాజెక్టులు నింపేందుకు నీటిని వదిలేయడం మన కన్నును మనమే పొడుచుకోవడం తప్ప మరొకటి కాదు. పొరుగు రాష్ట్రం, కేంద్రం అడుగడుగునా కాళ్లల్లో కట్టెలు పెట్టినా తెలంగాణ నీటిహక్కును కాపాడేందుకు కేసీఆర్ తెగించి కొట్లాడారు. కాళేశ్వరం వంటి అద్భుతమైన, అద్వితీయమైన ప్రాజెక్టును కట్టారు. కానీ, ఇప్పడు అదంతా గోదారిలో కలిపి పొరుగు జలదోపిడీకి గేట్లు ఎత్తేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పాలకులు. పైనుంచి మహారాష్ట్ర ప్రాజెక్టుల వల్ల గోదారి నీళ్లు మనకు ఎటూరావు. దిగువన వస్తాయన్న చోట కట్టిన ప్రాజెక్టును చేజేతులా చంపి పొరుగువారికి తోడుపడాలని తహతహలాడుతున్నారు. మరి తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా రైతాంగం ఏం కావాలి? అనేది ప్రశ్న.