తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాడు ‘నీది తెలుగే.. నాది తెలుగే.. తెలుగుజాతి మనది’ అని మాయచేసినట్టే నేడు ‘మీదికి కుండ ఉండగనే కింది కుండ మాయం చేసినట్టు’ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏండ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అని కనుబొమ్మలెగరేస్తున్నరు. తెలంగాణ అసలు ఈ భూమండలంలోనే లేనట్టు ‘డిక్షనరీ’లోనే తెలంగాణ పదం లేదని బహురూపుల తీర్మానాలు చేస్తున్నరు. తెలుగుదేశం, జనసేన పార్టీలు పుట్టింది హైదరాబాద్‌లోనే అంటూ వాదనలు వినిపిస్తూ ఆయా పార్టీల డీఎన్ఏ రిపోర్టులు ప్రదర్శిస్తున్నరు.
తెలంగాణే శ్వాసగా జీవితాంతం బతికి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్దేశించుకునేలా రోడ్ మ్యాప్‌ను అందించిన దార్శనికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. నేటికీ తెలంగాణకు నిత్యదార్శనికుడు. ఇప్పుడు ప్రధానంగా నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రమాదపు అంచులోప్రవహిస్తున్నది. గోదావరి, కృష్ణాజలాల్లో నష్టాన్ని భర్తీ చేసే శాశ్వత కార్యాచరణకు దారులు తీయవలసిన అనివార్యత నెలకొన్నది. తెలంగాణలోని ఏ ప్రాంతం, ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో ఉన్నాయో అందరి ముందూ అడిగి చెప్పించుకో వాల్సిన దుస్థితిలో ఉన్న ఏలికలు పాలిస్తున్న సందర్భంలో జయశంకర్ సార్‌ను మరిచిపోకుండా మళ్లీ గుర్తుచేసుకోవాలి.
తెలంగాణలో 2014 జూన్ 2వ తేదీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, 2019 జూన్ 21కి అంతే ప్రాముఖ్యత ఉన్నది. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైతే, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్న తేదీ. గోదావరి, కృష్ణా బేసిన్లను కాళేశ్వరం కలిపింది. ఇప్పుడా చరిత్ర మసకబారుతున్నకాలం. కానీ నేడు ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టి వేలాది టీఎంసీల నీటిని కిందికి పంపిస్తున్నా అడిగేవాళ్లు కరువయ్యారు. ఇప్పుడు బనకచర్ల బంకరాక్షసిలా, జలగలా గోదావరిని పీల్చేస్తున్నదని చెప్పినా చెవికి ఎకనితనం వెకిరిస్తున్నది. మేడిగడ్డ తెలంగాణ జీవగడ్డ మాత్రమే కాదు, నీటి పరిషార మార్గాన్ని చూపిన నిలువెత్తు జల సంతకమని నిరూపించింది.
తెలంగాణ ఉద్యమానికి ఆనాడు జయశంకర్ సార్ విద్యావంతుల వర్గంపై ఆధారపడ్డారు. అది ఏ వర్గమైనా జయశంకర్ సార్‌ను ఆమోదించింది. సార్ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? తెలంగాణ ప్రయోజనాలు నలిగిపోకుండా బుద్ధిజీవులు, రాజకీయార్థుల ప్రయోజనాలకు అతీతంగా లేదా సమాంతరంగా కేవలం తెలంగాణ కేంద్రంగా నేతృత్వాన్ని అందించాలి. మునుపెన్నడూ లేని అటువంటి లోటును గడిచిన కొంతకాలంగా తెలంగాణ అనుభవిస్తున్నది. వ్యక్తులు, సంస్థలు శిబిరాలుగా, సమూహాలుగా విడిపోయి ఎవరినీ అంగీకరించలేని స్థాయికి తెలంగాణ విద్యావంతుల సమాజం జారిపోయింది.
1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఒక గేయంలో ‘ఒకవేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుంది’ అని రాసినపుడు, తెలంగాణది తౌరక్యాంధ్రం అని ఎగతాళి చేసినప్పుడు.. నేరుగా వారి దగ్గరికే వెళ్లి ‘జంధ్యాల పాపయ్య శాస్త్రి గారూ మీది ఆధిపత్య అనుమానం’ అని చెప్పిన తెగువ జయశంకర్ సార్‌ది. అలాగే, సీకేఎం కాలేజీలో ‘వరవరరావును తీసివేయకపోతే మీ కాలేజీ ఫండ్స్ ఆపేస్తా’ అని బెదిరించిన ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దగ్గరికే వెళ్లి ‘నేను అపాయింట్ చేసింది ఒక టీచర్‌ను.
ప్రిన్సిపాల్‌గా నాకా అధికారం ఉన్నది. నా ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని ముఖ్యమంత్రిగా మీరు తీసేస్తే మీ హోదాకే అవమానం’ అని నేరుగా సర్దిచెప్పిన ధైర్యం ఈరోజు ఎంతమందికి ఉంటుం ది? ఉద్యమకారులమని, ఉద్యమాన్ని తామే నడిపామని చెప్పుకొనేవారు చిన్న పదవుల మాయలోపడి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాటగలిపేవారిని చూస్తున్న కాలంలో.. జయశంకర్ సార్ నిత్యప్రాసంగికులే.. ప్రాతఃస్మరణీయులే. జోహార్ జయశంకర్ సార్. జై తెలంగాణ!
-నూర శ్రీనివాస్