హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని కంచె గచ్చిబౌలి జీవ వైవిధ్యానికి ప్రతీక. అత్యంత అరుదైన శిలాజ సంపదకు ఆలవాలం. రేవంత్ సర్కారు కన్ను పడిన 400 ఎకరాల భూమి 700 రకాల అరుదైన మొక్కలు, 10కి పైగా క్షీరద జాతులు, 15 జాతుల సరీసృపాలు, 200కు పైగా రకాల పక్షిజాతులకు నెలవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ఇటు హెచ్‌సీయూ పరిధిలో గాని, తెలంగాణ వ్యాప్తంగా గాని ఒక్క మొక్క కూడా నాటింది లేదు. ఒక విత్తు కూడా విత్త లేదు. కానీ, విద్యార్థులు పెంచి పోషించిన ‘గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’పై తమకేదో హక్కు ఉన్నట్టు నేడు కూకటివేళ్లతో సహా పెకిలించడం అత్యంత అమానవీయం.
గుంట నక్కల్లా, తోడేళ్లలా తయారైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని కాపాడుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నది. మొన్నటి వరకు మూసీ, హైడ్రా బాధితులపై విరుచుకుపడిన రేవంత్ ప్రభుత్వం నేడు మూగజీవాలపైకి బుల్డోజర్లను ఉసిగొల్పుతున్నది. వాటిపై తమ ప్రతాపాన్ని చూపుతున్నది. సీఎం రేవంత్ పాల్పడుతున్న వినాశనంతో మూగజీవాలు చేస్తున్న అరణ్య రోదనలు, విద్యార్థుల నినాదాలు హైదరాబాద్ అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ వివాదం కాస్త చినికి చినికి గాలివానగా మారడంతో రేవంత్ కలవరపాటుకు గురై మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. జీవ వైవిధ్యం, చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు, పశుపక్ష్యాదుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు గాను భూ యాజమాన్యం హక్కులను తెరపైకి తీసుకువచ్చారు.
జీవ వైవిధ్యంపై జరుగుతున్న హత్యాకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆగమేఘాల మీద మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మన వేలితో మన కన్నునే పొడిచినట్టు… హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులతో మీడియా సమావేశం ఏర్పాటుచేసి అబద్ధాలు వల్లె వేయించారు. ఉమ్మడి ఏపీలోనే చంద్రబాబు హయాంలో హెచ్‌సీయూ భూముల బదలాయింపు జరిగిందని, ఆ 400 ఎకరాలకు బదులు గోపన్‌పల్లిలో 390 ఎకరాలు వర్సిటీకి అప్పగించినట్టు అర్ధసత్యాలను మంత్రులతో చెప్పించారు.
కానీ, చంద్రబాబు చేసుకున్న ఒప్పందాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్న విషయాన్ని మరుగునపడేశారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం భూ బదలాయింపును రద్దుచేస్తూనే, మరోవైపు గోపన్‌పల్లిలో హెచ్‌సీయూకి కేటాయించిన 390 ఎకరాల్లో 206 ఎకరాలను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు, మరో వంద ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కట్టబెట్టింది. అంటే ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి, మరో చేత్తో లాక్కున్నది. వాస్తవానికి 1969లో యూనివర్సిటీకి 2,250 ఎకరాలను అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం కేటాయించింది.
కానీ, యూనివర్సిటీకి యాజమాన్య హక్కులు ఇవ్వలేదు. ఇప్పటికీ మొత్తం భూమి రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే ఉన్నది. అప్పటినుంచి ఉమ్మడి ప్రభుత్వాలు హెచ్‌సీయూ భూములను ప్రసాదం పంచినట్టు పంచాయి. అయితే, అవన్నీ విద్యాభివృద్ధికి కావడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ, మొదటిసారి రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసం విలువైన జీవవైవిధ్యం కలిగిన భూములను పణంగా పెడుతున్నది.
ఇప్పుడు భూమి ప్రభుత్వానికే సొంతం అనే కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చి, జీవ వైవిధ్యం సమస్యను పక్కదోవ పట్టించడానికి రేవంత్ రెడ్డి పన్నాగం వేశారు. ఈ భూములు తమవేనని, తాము ఏమైనా చేసుకుంటామని బీరాలు పలుకుతున్నారు. భూములు ప్రభుత్వానివా, కావా అన్నది అసలు సమస్య కాదు. జీవ వైవిధ్యాన్ని పణంగా పెట్టి కాంక్రీట్ జంగిల్‌ను నిర్మించాలనుకోవడమే అసలు సమస్య. అయినా భూములు ప్రభుత్వానివంటే ప్రజలవనే కదా అర్థం. తమ ఇష్టానికి వాడుకోవడానికి అవి రేవంత్ రెడ్డి సొంత భూములు కాదు. ఇప్పటికీ హెచ్‌సీయూ పరిధిలోని మిగతా భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే ఉన్నది. అలాగని వాటిని కూడా రేపో మాపో అమ్మేసి సొమ్ము చేసుకుంటారా?
రేవంత్‌రెడ్డి చేస్తున్న ఈ దుష్ట ప్రయత్నానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పరోక్షంగా మద్దతుగా నిలుస్తుండడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. గతంలో ముంబై మెట్రో, కేరళ, గుజరాత్ తదితర ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు పర్యావరణ నీతులు చెప్పిన రాహుల్‌గాంధీకి.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం కనపడటం లేదా?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న అటవీకరణకు వ్యతిరేకంగా అక్కడి సీపీఐ నాయకులు గొంతెత్తితే ఇక్కడి సీపీఐ నాయకులు ఇప్పుడు ఎందుకు పెదవులు మూసుకుంటున్నారు? పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ పేరిట పేదలపై విరుచుకుపడిన హైడ్రాకు కంచె గచ్చిబౌలిలో జరుగుతున్న పర్యావరణ హననం కనిపించడం లేదా? గతంలో అయినదానికి, కానిదానికి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడిన మేధావులకు హెచ్‌సీయూలోని మూగజీవుల రోదన వినిపించడం లేదా? విద్యార్థులతో గాని, ప్రకృతితో గాని పెట్టుకోవడం అంటే కోరి వినాశనాన్ని తెచ్చుకున్నట్టే. ఇటు విద్యార్థులతో, అటు ప్రకృతితో ఒకేసారి తగువు పెట్టుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన వినాశనానికి తానే బాటలు వేసుకుంటున్నది.
ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, హైదరాబాద్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజల సమస్య. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుంటారు. వారు కొన్నాళ్లు చదువుకొని తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కానీ, ఇక్కడ శాశ్వతంగా ఉండాల్సింది మనం. ఇప్పటికే ఏటికేడు ఎండలు దంచికొడుతున్నాయి. వానలు పడటం లేదు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి భూతాపం పెరుగుతున్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇప్పుడు నీళ్లు కొంటున్నట్టే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి, ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కోవాలి. రేవంత్ ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త: జనగాం శాసనసభ్యులు)
– పల్లా రాజేశ్వర్ రెడ్డి