తెలంగాణ సాహితీమూర్తులు
వేమన, శేషప్ప పద్యాలతో సమానంగా సాహిత్యాన్ని సృష్టించి, ఆశు కవిత్వంతో అశేష ప్రజానీకాన్ని ఆకర్షించి, తన పద్యాలతో నిజాం రాజు గుండెల్లో దడ పుట్టించారు. వివిధ సమస్యలతో తన దగ్గరకు వచ్చిన వారందరికీ ధైర్యాన్ని అందించి, సాహిత్యమే కాదు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఎంతోమంది పేదలను ఆదుకున్న ఆ మహనీయుడే తెలంగాణ తొలి సమాజ వేదాంత కవి, రాజయోగి, వరకవి సిద్ధప్ప.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో అనంతవరం పెద్ద రాజయ్య, లక్ష్మి దంపతులకు 1903 జూలై 9న సిద్ధప్ప జన్మించారు. ఆయన అసలు పేరు అనంతవరం సిద్ధి రామప్ప. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఏడవ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. కులవృత్తి కుం డలు చేయడంతోపాటు ఎలగందుల, చింతకుంట ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా ఆయ న పనిచేశారు. ఉర్దూతో పాటు అరబ్బీ, పార్శీ, హిందీ, ఇంగ్లిషు, తెలుగు, సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యం సంపాదించారు. రామాయణ, భారత, భాగవతాలు, అమరకోశం, కావ్య, వ్యాకరణ, అలంకార శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తన ఆశ్రమంలోని గుహలో 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి యోగ సిద్ధి పొందారు. కాకి హంసోపాఖ్యానం, జీవ నరేంద్ర డ్రామా, అశోక సామ్రాజ్యం, శివ స్తుతి, విష్ణుభజనావళి, నీతిశాస్త్రం, వర్ణమాల కందార్థాలు, గోవ్యాగ్ర సంభాషణ, యాదగిరి భజనావళి, యక్షగానం, స్తోత్రాలు, దండకాలు, సుభాషితాలు, హితబోధ, వేదాంతతత్వ కీర్తనలు, కాలజ్ఞానం, నక్షత్రమాల, సిద్ధప్ప వరకవి జ్ఞాన బోధిని మొదలైన 40కి పైగా పుస్తకాలను ఆయన రచించారు.
‘వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప’
అనే మకుటంతో సిద్ధప్ప రాసిన పద్యాలు విశేష ప్రజాదరణ పొందాయి. ఈ పద్యాలు జాషువా, శ్రీనాథుడు, బద్దెన, వేమన, శేషప్ప వంటి మహాకవుల పద్యాలతో సమానంగా విరాజిల్లుతున్నాయనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు సిద్ధప్ప. తెలంగాణ తొలి సమాజ కవిగా, తత్వ కవిగా, గోల్కొండ కవిగా ఆయన పేరు పొందారు. రజాకార్లు, దొరలు, దేశ్ముఖ్ల పెత్తందారీతనంతో ప్రాణాలు అరచేతిలో పెటుకొని బతుకు గడుపుతున్న ప్రజలకు తన సాహిత్యం ద్వారా జ్ఞానోదయం కలిగించి, వారిని మేల్కొలిపారు.
సిద్ధప్ప పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతం కనుక అచ్చ తెలంగాణ పదాలు, మాండలిక పదాలు సిద్ధప్ప సాహిత్యంలో అడుగడుగునా కనిపిస్తాయి. పండితులు, పామరులు అలవోకగా పాడుకునే విధంగా ఉండే సిద్ధప్ప పద్యాలు నేటికీ ఎన్నో భజన మండళ్లలో వినిపిస్తాయి.
‘రాతి బొమ్మల ఎదుట రాశిగా యన్నంబు
తినుమన్న యా రౌతు తినదురన్న
తినెడి వాడవు నీవె తీవ్రంబు చెందేవు
కన లేవు నీలోని కఠిన గుణము
పేదల కన్నంబు పెట్ట ధైర్యము లేదు
గట్టు రాళ్ళకు తిండి పెట్టగలవే’
అంటూ పేదల ఆకలిని కాదని, విగ్రహాలకు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే వారిని ప్రశ్నించారు సిద్ధప్ప. సిద్ధప్ప రాసిన పద్యాలు ప్రస్తుతం 9వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీ య సంవత్సరం, ఎం.ఏ తెలు గు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా కొనసాగుతున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ కవుల సంచిక’లో సిద్ధప్పను చేర్చారు. ప్రజాకవి అందెశ్రీ తాను కవిగా మారడానికి సిద్ధప్ప పద్యాలే కారణమని, తన మొదటి సాహిత్య గురువు ఆయనే అని స్వయంగా చెప్పారంటే సిద్ధప్ప పద్యాలకు ఉన్న శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
‘శ్రీమన్మహాదేవ దేవీ మహా
మండలిన్ వాసయై యున్నయో
దేవతా సార్వభౌమా మణీ! ధీమణీ!
లోక సంధాయినీ! భక్త చింతామణీ!
దుష్ట శిక్షామణీ! మంజు భాషామణీ!
పాప సంహారిణీ! ముక్తి కాంతామణీ!’
అంటూ అమ్మవారిని స్తుతిస్తూ సిద్ధప్ప రాసిన ఈ దండకం చూస్తే మహా కవులు రాసిన దండకాలతో సమానంగా ఉన్నదని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కుల, వర్ణ విభేదాల పట్ల తీవ్రమైన నిరసనను, అసహనాన్ని వ్యక్తం చేశారు. కులం కంటే గుణానికే ప్రాధాన్యతనిచ్చారు.
‘కులముతో పనిలేదు గుణవంతుడే దాత
మొలవదే పెంటలో మంచి తులసి…’
‘అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన
సుజ్ఞానియే యాత్మ సుజనుడతను… ’
‘ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు
నా కులంబును జెప్ప నాకు సిగ్గు…’
ఇలాంటి ఆణిముత్యాల వంటి పద్యాలు సిద్ధప్ప సాహిత్యంలో కోకొల్లలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ప్రత్యేకంగా సిద్ధప్ప కవి కళాతోరణం ఏర్పాటు చేయడంతో పాటు ‘తెలంగాణ తేజోమూర్తి’గా ఆయనను గుర్తించారు.
డాక్టర్ నీలా జంగయ్య, కేకే రంగనాథాచార్యులు, జయధీర్ తిరుమలరావు వంటి మహానుభావులు సిద్ధప్ప కవిత్వాన్ని విశ్లేషించి, వేమన, కబీరు వంటి కవులతో సమానంగా కవిత్వం రాశారని ‘తెలంగాణ వేమన’గా ఆయనను అభివర్ణించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మాదిరిగా కాలజ్ఞానం రాసి, భవిష్యత్తులో జరిగే విశేషాలన్నింటినో మనకందించిన వరకవి సిద్ధప్ప 1984 మార్చి 23న పరమపదించారు. తెలుగు సాహితీ లోకంలో చిరంజీవియై ఆయన వెలుగొందుతూనే ఉంటారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి ,9440369939