మల్లెపూల వర్ణమాలల్ని అల్లుకొని
విజ్ఞాన సౌరభాల్ని విచ్చుకుంటున్న
పుస్తక పువ్వుల్ని తనివితీరా ఆస్వాదిద్దాం
ప్రాచీన ప్రాభవాన్ని నవీన నైజాన్నీ
పుటలు పుటలుగా తెరుద్దాం
చెలిమి చూపులతో కరచాలనం చేద్దాం
ఆత్మీయ ఆలింగనాలతో హత్తుకుందాం
పుస్తకం హస్త భూషణం కాదనీ
మస్తిష్కానికి నేస్తమనీ
కలాలు గర్జించే వరకూ
కవిత్వ బలాలు శాసించే వరకూ
నిరంతరంగా.. తరంతరంగా
పాటై పల్లవిద్దాం
మాటై ముచ్చట పెడదాం
ఆటై అల్లరి చేద్దాం…
మనసున మనసై ఘూర్ణిల్లటానికి
మనిషిని మనిషిగా పూర్ణించటానికి
మంచి పుస్తకాల్ని మనువాడుదాం
మనలో అర్ధాంగి పుస్తకమే అందాం
విజ్ఞాన వికాసాల్ని పొత్తంగా కందాం
అక్షరాల ఆత్మీయ బంధువులతో
బుక్ ఫెయిరుల్లో విజ్ఞాన విందులు చేద్దాం
పాశ్చాత్య పోకడల్లో
చెదలు చెదలుగా రాలుతున్న మెదళ్లనూ
బిజీబిజీగా శ్వాసిస్తున్న
గుండె గదుళ్లనూ
పుస్తక పఠనాలతో పూడ్చేద్దాం..
దాశరథి ప్రాంగణాన్ని దర్శిద్దాం
మానసిక ఒత్తిళ్లను
చీకటి పొత్తిళ్లలో వొదిలేసి
రేపటి కలల కుచ్చిళ్లలో దాగిన
ఆనంద గ్రంథాల్ని
పేజీలు పేజీలుగా తెరుద్దామ్
బ్లాగులు బ్లాగులుగా తెగుతున్న
మోడ్రన్ దృక్కులకు
రీడింగ్ రింగుల్ని తొడిగేద్దాం
కొంచెం కొంచెంగా నైనా
బుక్కులపై లుక్కేద్దాం…
కన్నుగీటి కవ్విద్దాం
మనసారా ప్రేమిద్దాం..!