1940 దశకంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటంలో బుర్రకథలు ప్రధాన భూమిక పోషించాయి. కథ పౌరాణికమైనా, చారిత్రకమైనా సమకాలీన సమాజాన్ని జోడించే వెసులుబాటు ఉండటం, నాటకం లాగా హంగు ఆర్భాటం అవసరం లేకపోవడం వల్ల బుర్రకథ పాటలాగే ప్రజలకు దగ్గరైంది. జంగం కథ, శారద కథ వంటి ప్రాచీన వారసత్వ ప్రజా కళారూపాల కలయికతో గత శతాబ్దంలో కన్ను తెరిచిన బుర్రకథ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది.
నిజాం వ్యతిరేక ఉద్యమ సమయంలో ఎన్నెన్నో సాంస్కృతిక, సాహిత్య రూపాలు అగ్నికి గాలి తోడైనట్టు నిలిచాయి. ప్రత్యేకించి కష్టజీవి, తెలంగాణ, సీతారామరాజు బుర్రకథలు నిజాం పాలకులకు నిద్ర లేకుండా చేశాయి. చరిత్ర సృష్టించిన ‘మా భూమి’ నాటక రచయితల్లో ఒకరైన సుంకర సత్యనారాయణ కష్టజీవి బుర్రకథ సృష్టికర్త. భూమి కోసం, భుక్తి కోసం జమీందారును రైతులు ఎదిరించడం కథ. ఈ కథలోని ‘జాగేలనోయి రైతు బాబయ్య’ లెండు లెండు నిద్రలేలా ‘గొంతెత్తి కేకేయరా’ పాటలు విడిగా కూడా విపరీత ప్రచారం పొందాయి.
నాటి ఉద్యమకారులకు గొప్ప ఆయుధం లభించినట్టయింది. గాలి కంటే వేగంగా వ్యాపించిన కష్టజీవి బుర్రకథ ప్రదర్శించని గ్రామం నాడు తెలంగాణలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ బుర్రకథ రూపకల్పనలో సుంకరకు కాకునూరు సుబ్బారావు సహకరించారు. ఇదే కథను తిరునగరి రామాంజనేయులు హరికథగా మార్చగా, శ్రీకాకుళ ఉద్యమ సమయంలో సుబ్బారావు పాణిగ్రాహి జముకుల కథగా మార్చి రాశారు. సుంకర కష్టజీవి బుర్రకథపై నాటి నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఇక సుంకర రాసిన మరో బుర్రకథ ‘తెలంగాణ’ పెను సంచలనమే సృష్టించింది. ఏకంగా నిజాం ప్రభువు మీదికే బాణం ఎక్కుపెట్టింది. రంగారెడ్డి అనే దేశ్ముఖ్తో పేద రైతైన గోపిరెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులు జరిపిన భూ పోరాటం దాని వృత్తాంతం. ఈ బుర్రకథను గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రదర్శిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఆ లేఖనందుకున్న అధికారులు ‘తెలంగాణ’ బుర్రకథతో పాటు మరో బుర్రకథ ‘సీతారామరాజు’ బుర్రకథను, దేవులపల్లి వెంకటేశ్వరరావు రచించిన ‘నిజాం ఆంధ్రుల పోరాటం’ పుస్తకాలను నిషేధించాలని సిఫారసు చేశారు.
ఈ మేరకు నిజాం ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వులు జారీచేసింది. 1946, డిసెంబర్ 8న వెలువడిన ఐదు వేల ‘తెలంగాణ’ బుర్రకథ ప్రతులు ఉద్యమకారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోలీసులకు ఎక్కడా లభించలేదు. చివరికి అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన కార్వ నారాయణరెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కోదండరామిరెడ్డి ఇండ్లలో బుర్రకథ ప్రతులు పోలీసులకు లభించాయి.
48 పేజీల పాకెట్ సైజ్ చిన్ని పుస్తకంలో విస్నూర్ దేశ్ముఖ్ గుండాల చేతుల్లో బలైన తెలంగాణ పోరాట యోధుడు ‘బందగీ’ పరిచయం, నాగలితో దున్నుతున్న రైతు, ఎద్దుల కాళ్ల కింద పడి నలిగిపోతున్న నిజాం తలపాగా ముఖచిత్రం నాటి ప్రభుత్వానికి కోపం తెప్పించింది. నిజాం ప్రభువుకు చిర్రెత్తించిన సుంకర మరో బుర్రకథ ‘సీతారామరాజు’. 1946, అక్టోబర్ 19న వెలువడింది. దీని ప్రతులు కూడా పోలీసులకు నారాయణరెడ్డి, కోదండరామిరెడ్డి ఇళ్లల్లో దొరికాయి. అల్లూరి సీతారామరాజు ఉద్యమానికి, ఉద్యమ ప్రాంతానికి నిజాం రాజ్యానికి ఏ మాత్రం సంబంధం లేదు.
కానీ, అల్లూరి ఉద్యమస్ఫూర్తి ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులను ప్రభావితం చేస్తుందోనని నిజాం ప్రభుత్వం
నిషేధించింది. విజయవాడకు చెందిన పొన్నలూరి రాధాకృష్ణమూర్తి సీతారామరాజు నవల రాయడం కోసం మన్యం ప్రాంతం పర్యటించి విస్తృతమైన సమాచారం సేకరించారు. ఆ రాత ప్రతులను బ్రిటిష్ పోలీసులకు దక్కకుండా సుంకర దాచి ఉంచాడు. బహుశా ఈ బుర్రకథకు అదే ప్రేరణ కావచ్చు.
ఈ బుర్రకథలను నియంత్రించడం నిజాం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. పుస్తక ప్రతుల అవసరం లేకుండా మౌఖికంగానే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందాయి. ఎక్కడ ఏ మూలకు ఎవరు ఈ బుర్రకథలు చెబుతున్నారో? ఏ సంచార బృందాలు ఏ గ్రామాల్లో తిరుగుతున్నాయో? పసిగట్టలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు పోలీసులు. తుదకు నిజాం ప్రభువు ఏకంగా ‘బుర్రకథ’ కళారూపాన్ని నిషేధించాడు. అది పౌరాణికమైన, చారిత్రకమైన కథ ఏదైనా బుర్రకథ ప్రదర్శించడానికి వీల్లేదని ఫర్మానా జారీచేశాడు.