కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడవ బడ్జెట్ ఆరు గ్యారెంటీలకు మంగళం పాడింది.. ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్లో కొత పెట్టింది, కీలక రంగాలకు కేటాయింపులు తగ్గించింది. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్, పీఆర్సీ ప్రస్తావనే చేయలేదు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల పట్ల తీవ్ర నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పట్ల సమాజంలోని అన్ని రంగాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టు గ్యారెంటీల గారడీతో మోసపోయామని ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదు. ఒక్క నిర్మాణం లేదు కానీ రూ.3.46 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసింది. కాంగ్రెస్ పాలకులు సృష్టించిన సమస్యలతో ప్రజలు కష్టాల పాలయ్యారు. తలసరి ఆదాయం రూ. 4,18,931 లేని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, ద్రవ్యోల్బణం ఎందుకు తక్కువగా ఉన్నదో చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కరోనా, నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదు. ఖర్చు కంటే సంపద పది రెట్లు వృద్ధి చెందింది. ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగాయి. తలసరి ఆదాయంతోపాటు కొనుగోలు శక్తి పెరిగి అనేక రంగాల్లో సంపద పంపిణీ జరిగింది. రైతుబంధు, భరోసా పథకాలు, నిరంతర విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటివి దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరిలో తెలంగాణ నీటి వాటా వాడుకుంటూ అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4.17 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇందుకు తగ్గట్టుగా సంపద సృష్టించి దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపింది. కానీ మాయమాటతో ఓసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచింది. కనీసం మూడో బడ్జెట్లోనైనా ఏమైనా కేటాయింపులు చేస్తుందేమో చూద్దామని అనుకున్న సబ్బండ వర్ణాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కాంగ్రెస్ మూడో బడ్జెట్లో వ్యవసాయ, సహకారశాఖలకు కేవలం రూ.23,179 కోట్ల అరకొర నిధులు కేటాయించింది. ఇందులో ఎంత ఖర్చు పెట్టేది ఎంతో అనే సందేహం ఉన్నది. రైతుబంధు పథకం కోసం రూ.13,593 కోట్లు కేటాయించారు. యాసంగి రైతులకు 70 లక్షల మంది రైతులకు కేవలం ఒక ఎకరాకు మాత్రమే చెల్లించారు. మిగతా రూ. 6000 కోట్లు వచ్చే నెలలో చెల్లిస్తామని చెప్పారు. మిగిలిన రూ.7593 కోట్లు వానాకాలానికి సరిపోదు. అంటే ఏడాదికి ఒకే సారి రైతుబంధు ఇస్తామని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్టయింది.
కేంద్రం సహకరిసున్నది అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్న ఇచ్చిందని ఎద్దేవా చేయడం ద్వంద్వనీతికి నిదర్శనం. హామీ మేరకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులు ఆందోళన చేస్తే నిర్బంధాల ద్వారా అణచివేసే యత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 31,798 ఉద్యోగాల భర్తీ కోసం కేవలం 16 నోటిఫికేషన్స్ ఇచ్చింది. అందులో 16,978 మాత్రమే భర్తీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా ఇచ్చిన 50,785 ఉద్యోగాలు తమ ఖాతాలో వేసి, 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇక ఐదు డీఏలు బాకీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విషాదం. డిజిటల్ హెల్త్ కార్డ్స్ పేరిట ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి. 1.5 శాతం కోత ద్వారా ఏడాదికి రూ.600 కోట్లు వసూలుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. మరి ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన రూ.600 కోట్లు ఇస్తుందో లేదో తెలియదు.
రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన 24,678 మందికి రావలసిన రూ.10,000 కోట్ల పెన్షన్ బకాయిలు చెల్లించక పోవడం అమానవీయం. ప్రభుత్వ వైఖరితో 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు అనారోగ్యం, మానసిక ఆందోళనతో మరణించారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చల్లో భాగంగా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు, కేటీఆర్ వాయిదా తీర్మానం ద్వారా ప్రశ్నిస్తే ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెప్పింది. ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో తేలిపోయింది.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో రెండు పీఆర్సీలు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి అమలు చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఆరు నెలలలోపు పెన్షన్ బకాయిలు చెల్లించారు, పీఆర్సీ సకాలంలో వేసి 5 శాతం మధ్యంతర భృతి ఇచ్చారు. రాష్ట్రమంతా వెల్నెస్ సెంటర్లు ఏర్పా టు చేసి మెరుగైన వైద్య సేవలు అందించారు.
బీఆర్ఎస్ పాలనలో గణనీయంగా పెరిగిన త లసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి రేటు రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గతి తప్పిన పా లననే ఇందుకు కారణం. సంపద పెంచి పేద ప్రజలకు పంచాలనే లక్ష్యంతో సాగిన కేసీఆర్ పాలనపై పదేపదే విమర్శలు, దుష్ప్రచారాలు చేయడం మినహా ప్రస్తుత పాలకులు చేస్తున్న అభివృద్ధి ఏమీలేదు. అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కోతలు విధించడం కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో ఉన్న ప్రత్యేకత. మూడు బడ్జెట్లు ముగిశాయి, మిగిలిన రెండు బడ్జెట్లపైనా ఆశలేదు. ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్నా పట్టించుకోకుండా తప్పించుకుంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు.
(వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
– దేవీప్రసాద్