ఔరంగాబాద్‌కు వచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు జీవన్‌రెడ్డి, వేణుగోపాలాచారి ఈ పట్టణంలో ఎనిమిది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయని చెప్పారు. మహారాష్ట్రలోని అకోలా బీఆర్ఎస్ నాయకుడు ప్రకాశ్ కోహ్రీ అకోలాలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నదన్నారు. మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా, మంజీర, భీమా, ఘటప్రభ, పంచగంగా, మూల, ప్రవర వంటి ఎన్నో నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. మరోవైపు, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి మహారాష్ట్ర రాజధానిగా ఉన్నది. అయినా కూడా ఇక్కడి ప్రజలకు నీళ్ళు కూడా లభించని దారుణ పరిస్థితి. ఇక్కడి ప్రజలు బంగారు ఇటుకలను, చందమామను, నక్షత్రాలను అడుగుతున్నారా? తాగునీళ్లే కదా అడుగుతున్నారు. ఈ దేశం ఇలాగే కొనసాగాలా? మార్పు అవసరం లేదా?
ఈనెల 24న ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఒక్క మహారాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా ప్రతి భారతీయుడు పాలకులకు వేయవలసిన ప్రశ్న ఇది. దేశం ఎదుర్కొంటున్న ఈ దుస్థితే కేసీఆర్‌ను బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలలోకి వెళ్లేలా చేసింది. 75 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు చేసింది ఏమీ లేదు. పేదలు మరీ పేదలవుతున్నారు. సంపన్నుల సంపద పెరిగిపోతున్నది. అంబానీలు, అదానీల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సామాన్యులకు కూడా అర్థమైంది.
రైతులపై కారు నడిపించి, తొక్కించిన మోదీ సర్కారు చివరికి తోకముడిచింది. రైతుల ఆగ్రహానికి తలొగ్గి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. కానీ రైతుల పరిస్థితి మారలేదు. రైతులు ఆ పార్టీని ఈ పార్టీని అడగడం ఏమిటని కేసీఆర్ అంటున్నారు. మనమే ఒక పార్టీ పెట్టుకుందాం. మనమే గెలుద్దాం అని పిలుపు ఇస్తున్నారు. ఏదో ఒక పార్టీ గెలువడం కాదు, ప్రజలు గెలువాలె. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని పిలుపు ఇచ్చారు.ఈ నినాదం ఇప్పుడు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఔరంగాబాద్ సభకు ప్రజలు విశేష సంఖ్యలో తరలి రావటం దీనికి నిదర్శనం.
‘ఒకప్పుడు చైనా, భారత్ కొత్తగా కండ్లు తెరిచిన శిశువులు. రెండూ ఒకే స్థాయిలో ఉండేవి. కానీ ఇవాళ చైనా ఎందుకు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది? అమెరికానే సవాలు చేసే స్థితికి చేరుకున్నది. వారికి సాధ్యమైంది మనకెందుకు కాదు? వారు బం గారం తింటున్నరు, మనం మన్ను తింటున్నమా?’ అనేది కేసీఆర్ వేస్తున్న మరో ప్రశ్న.
కేసీఆర్ ఏదో గాలిలో మేడలు కట్టడం లేదు. తాను తెలంగాణలో సాధించిన అభివృద్ధిని చూపిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు తాగడానికి నీళ్ళు మిషన్ భగీరథ ద్వారా అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. చెరువులు నింపారు. బీడు భూములను సస్యశ్యామలం చేశారు. వృద్ధులను ఆదుకోవడానికి ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. పేదల బిడ్డల పెండ్లిళ్ళకు కల్యాణలక్ష్మి ఇస్తున్నారు.
పేదల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలను చేపట్టారు. రైతన్నలకు కరెంటు ఉచితంగా రోజంతా ఇస్తున్నారు. వీ టన్నింటి ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చారు. రైతన్నను రాజుగా చేశారు. దేశం లో రైతు రాజ్యం ఎక్కడ ఉందంటే తెలంగాణలో అని చెప్పే పరిస్థితి కల్పించారు.
పేద రోగులకు డయాలిసిస్ సౌకర్యం ఉచితంగా అందుతున్నది. సర్కారు దవాఖానలలో ప్రసవాలు పెరిగాయి. ఇవాళ వందశాతం ప్రసూతులు దవాఖానలలో జరిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. మరోవైపు, రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. అందుకే తెలంగాణ మాడల్‌ను దేశమంతటా అమలు చేస్తామని కేసీఆర్ దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు గురించి కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచే స్పష్టమైన విజన్ ఉన్నది. దానితోనే తెలంగాణ మాడ ల్ను అమలు చేసి చూపారు. దేశ భవిష్యత్తు విషయంలోనూ ఇటువంటి స్పష్టమైన విజన్ కేసీఆర్‌కు ఉన్నదనేది ఆయన ప్రతిపాదనల వల్ల తెలుస్తున్నది. ప్రైవేటీకరణ మోదీ విధానమైతే జాతీయీకరణ తమ విధానమని కేసీఆర్ ప్రకటించారు. నెహ్రూ నిర్మించిన నవభారతాన్ని విధ్వంసం చేయడం మోదీ కార్యక్రమంగా సాగుతున్నది. ఇందు కు భిన్నంగా నెహ్రూ కోరిన నవభారత నిర్మాణమే తన లక్ష్యంగా కేసీఆర్ సాగుతున్నారు.
75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఇంకా ఆకలి, నిరుద్యోగం, పేదరికం ఎందుకు ఉన్నాయనే కేసీఆర్ ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేక పోతున్నది. అందువల్లనే గవర్నర్ వ్యవస్థ ద్వారా, దర్యాప్తు సంస్థల ద్వారా వేధింపులకు దిగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిరాయింపు కుట్రలు జరిపి నవ్వుల పాలయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ స్థాపించిన చిన్న మొక్క టీఆర్ఎస్ నేడు శాఖోపశాఖలున్న మహావృక్షంలా విస్తరిం చింది. దేశ రాజకీయాలలోకి ప్రవేశించి విజయ బాటలో పయనిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుపుకోవడం తెలంగాణకే కాదు, దేశ ప్రజలకూ పండుగ. ఇప్పటి వరకు అనేక విజయాలతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించారు. ఇప్పుడు దేశ రాజకీయ రంగాన్ని శాసించే తరుణంలో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలవాలి. బీఆర్ఎస్ శ్రేణులు మరింత బాధ్యతగా, వినమ్రంగా కేసీఆర్ ఆశయాలను అమలు చేయాలి.
గోసుల శ్రీనివాస్ యాదవ్
(వ్యాసకర్త: జన గణన వేదిక నేషనల్ చైర్మన్)