తెలంగాణ శాసనసభ చరిత్రలో నిన్నటి సోమవారం ఓ చీకటి రోజు. ప్రజాస్వామ్యం విపత్కర వికృత క్రీడగా మారిన దుర్దినం. గౌరవసభా ప్రాంగణం కౌరవసభగా మారిన వైపరీత్యం. మహిళా సభ్యులపై కనీవినీ ఎరుగని రీతిలో అరాచకం. ఆడబిడ్డల గౌరవాన్ని మంటగలిపిన మరో మహాభారత దుశ్సాసనపర్వం ఆవిష్కృతమైంది. మహిళా సభ్యుల చీరలు లాగారు. గొంతులు నులిమారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకువెళ్లారు. ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చిన ఈ ఘట్టం చూసి సభ్యసమాజమే తలవంచుకుంది. సంస్కారం సెలవు తీసుకుంది. ప్రజల హక్కులకు కంచుకోటగా నిలువాల్సిన సభ విపక్షాల గొంతునొక్కే బలివేదికగా మారింది. కాంగ్రెస్ అరాచక పాలన వికటాట్టహాసం చేసింది. గాంధేయవాదాలు కలపండి గంగలో, తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలో, నేతలము మీ నుదుటి రాతలమురా మేము, మంత్రులము అధికార తంత్రులమురా మేము’ అంటూ రక్కసి కాంగ్రెస్ పాలకులు రెచ్చిపోయారు. హక్కులను చెరబట్టారు. నిరసనలపై పగబట్టారు. నిలదీసే గొంతుకలపై నిప్పులు గుమ్మరించారు.
రాష్ట్రంలో ప్రజాకంటక కాంగ్రెస్ పాలనలో సబ్బండవర్ణాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నయవంచక హామీలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు అటకెక్కించింది. 420 హామీలకు పాతరేసింది. డిక్లరేషన్లకు దిక్కులేదు. మాటలు చెప్పేందుకు తెలంగాణ గల్లీలకు వచ్చిన కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల జాడలేదు. మాటలతో మభ్యపెట్టి దిక్కుమాలిన పాలకులను తెలంగాణ ప్రజల నెత్తినపెట్టిపోయిన అమ్మలు, అయ్యలు… క్రమం తప్పకుండా ముడుతున్న మూటలతో మురిసిపోతున్నారు. ఇప్పుడు గెలిపిస్తే.. ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తానంటూ బడాయిలు చెప్పిన పప్పూ నేతల పత్తాలేదు. దీంతో రాక్షసమూక తెలంగాణపై పడి దోపిడీ పాలన సాగిస్తున్నది. విద్యారంగం వినాశనమైంది… వైద్యానికి సుస్తీ చేసింది. సాగు ఆగమైంది. నీటిని ఒడిసిపట్టే తెలివిలేక, ఇడిసిపెట్టాలనే కుట్రలు కూడా తోడై నీటిపారుదల రంగం ముఖ్యనేతల గురువుల కనుసన్నల్లో నడుస్తున్నది. పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేయాలని పెత్తందారీ పాలకులు కంకణం కట్టుకున్నట్టు కనబడుతున్నది. ఇంజినీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని, నిరుద్యోగులు ఎండ్రిన్ తాగి చావాలని సీఎం హోదాలో ఉన్న మనిషి మాట్లాడటం అత్యంత దుర్మార్గం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ చేతగాని, చేవలేని పాలనను ప్రశ్నించడమే నేరమైంది. బుకాయింపులు, దబాయింపులు ఇంకానా ఇకపై సాగవు అని నిలదీయడమే పాపమైంది. మోసపోయి గోసపడుతున్న ప్రజల బాణి వినిపించడమే పాలకులకు కంటకప్రాయమైంది. నల్లజెండాలతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో నల్లచొక్కాలపై పాలకుల జులుం చెలరేగింది. అధికారమదం అవధులు మీరింది. ప్రజలెన్నుకున్న నేతలపై లాఠీలు విరిగినై. అంగీలు చినిగినై. పాలకపక్షం ప్రతిపక్ష సభ్యుల నెత్తురు కండ్లజూసింది. సభలో ప్రజా సమస్యలపై గొంతెత్తనీయకుండా అరెస్టులతో అడ్డుకోవడం ఎమర్జెన్సీ దురాగతాలను గుర్తుకు తెచ్చింది. అసెంబ్లీ ఆవరణలోని గాంధీజీ సన్నిధిలో సభ్యులకే రక్షణ లేకుండాపోయింది. రాష్ట్రంలో గాడ్సేల రాజ్యం నడుస్తున్నది. నిరంకుశ హిట్లర్ అభిమాని పాలనలో ప్రజాస్వామిక నిరసనలకు నీడ కరువైంది.
వెయ్యి రోజులు, వేల అబద్ధాలు. మాట తప్పడాలు, మడమ తిప్పడాలు. అందరికీ అన్నీ అని ఊరించి ఎవరికీ ఏమీ ఇవ్వని టక్కుటమారం పస తేలిపోయింది. యువత ఉద్యోగ హామీ ఏమైందని ఉరుముతున్నది. రైతులు పంటసాయం ఏమైందని గద్దిస్తున్నరు. ఆడబిడ్డలు తులం బంగారం తూచ్ అయ్యిందని తిడుతున్నరు. అవ్వలు పింఛన్ల పెంపు యాడికి పోయిందని శాపనార్థాలు పెడుతున్నరు. సర్కార్‌పై సమరానికి ప్రజలు సై అంటే సై అంటున్నరు. ఎగవేతల పాలనపై ఏలికలను ఏకిపారేస్తున్నారు. సకల జనులు జంగ్ సైరన్‌తో సర్కార్‌కు అల్టిమేటం జారీచేస్తున్నారు. కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రజలను శత్రువులుగా చూస్తున్నది. ఓటేసినవారిని కాటేసేందుకు బుసకొడుతున్నది. ప్రజల పోరాటంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అగ్రగాములై నిలిచారు. సభ లోపలా, వెలుపలా ప్రజల సమస్యలపై గొంతు విప్పుతున్నారు. కాంగ్రెస్ పాలకుల బండారాన్ని బద్దలు గొడుతున్నారు. అవినీతిని ఉతికి ఆరేస్తున్నారు. అక్రమాలపై అడగడుగునా నిలదీస్తున్నారు.
అందుకే కాంగ్రెస్ పాలకులు విపక్ష బీఆర్ఎస్ నీడ చూస్తేనే భయంతో వణికిపోతున్నారు. లెక్కలు అడిగితే దిక్కులు చూస్తున్నారు. తిట్లతో, హూంకరిం పులతో దృష్టి మళ్లించాలని తంటాలు పడుతున్నారు. కేసీఆర్ సభకు రావాలని, రాకపోతే రాజీనామా చేయాలని వితండవాదం చేస్తున్నరు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేతకాకపోతే సర్కార్ సిగ్గుపడి తప్పుకోవాలి, సీఎం బాధ్యత వహిస్తూ వైదొలగాలి. కానీ అన్నింటా విఫలమైన పాలకులు విపక్ష నేత రాజీనామా కోరడం విడ్డూరం కాకపోతే మరేమిటి? మరోవైపు సభకు వచ్చే నేతలపై దుర్మార్గపు దాడులకు తెగబడుతున్నారు. అమానుషత్వంలో కొత్తపుంతలు తొక్కుతున్నారు. సర్కార్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న అసహనానికి ఇది నిదర్శనం కాదా? నిస్పృహకు నిలువుటద్దం కాదా? ప్రజల మధ్య తిరుగలేని పిరికితనం కరుకుదనంగా మారడం ఓ వైపరీత్యం. అరెస్టులతో ప్రజాగళాన్ని అడ్డుకోవాలని చూడటం అవధుల్లేని అవివేకం. నియంతలెంత రెచ్చిపోయినా ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం.