తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక విప్లవం తీసుకొస్తున్నట్టు పాలకపక్షమైన కాంగ్రెస్ గత కొన్ని మాసాలుగా ప్రచారం చేసుకుంటున్నది. త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు కోటా పెంచడం చరిత్రాత్మక నిర్ణయంగా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అయితే, తెలుగునాటఉమ్మడి ఏపీలో, తెలంగాణలో పాలకపక్షంగా హస్తం పార్టీ ఉన్నప్పుడు ఓబీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం చేసింది ఎంత? అని పరిశీలిస్తే దాని పని ఆచరణలో కనపడదని, అది మాటలకే పరిమితమని తేలిపోతుంది.
ఉమ్మడి ఏపీలో 1956 నవంబర్ ఒకటి నుంచి 1983 జనవరి వరకూ అంటే 26 ఏండ్లకు పైగా సాగిన పాలనలో గాని, 1989 డిసెంబర్ తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకూ (2014 జూన్) కొనసాగిన దాదాపు పదిహేను సంవత్సరాల పాలనలో గాని కాంగ్రెస్ ఎన్నడూ ఏ ఒక్క బీసీ నాయకుడికీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల తన పాలనలో ఉమ్మడి ఏపీలో ఏ దశలోనూ వెనుకబడిన వర్గాల నేతకు కాంగ్రెస్ తరఫున సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదన రానే లేదు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ మంత్రివర్గాల్లో సైతం బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే ఉండేదని, వారికి కీలక మంత్రిత్వ శాఖలు ఇవ్వనే లేదని గత చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతేకాదు, ఒకవేళ తమ మాటలకు క్యాబినెట్లో తగినంత విలువ లేదని బీసీ వర్గానికి చెందిన మంత్రి ఎవరైనా బాహాటంగా ప్రకటిస్తే‘బీసీలా? వంకాయలా?’ అంటూ కాంగ్రెస్‌లో అగ్రకులానికి చెందిన నేతలు ఎగతాళి చేయడం 19891994 మధ్య సాగిన కాంగ్రెస్ ఏలుబడిలో తెలుగు ప్రజలు చూశారు. అలాగే, ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ మంత్రివర్గాల్లో హోం, రెవెన్యూ, ఆర్థికం వంటి కీలక శాఖలను ఓబీసీ మంత్రులకు కేటాయించిన సందర్భాలూ చాలా తక్కువ.
ఉమ్మడి ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలతో పోల్చితే బలమైన బీసీ నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉండేవారు. నాటి పాలకపక్షమైన కాంగ్రెస్‌లో చాలామంది చదువుకున్న, పలుకుబడి ఉన్న బీసీ నేతలు తెలంగాణలో మాత్రమే ఎక్కువ కనిపించేవారు. కానీ, ఏపీ ఆవిర్భావం జరిగిన 1956 నవంబర్ నుంచి 1971 సెప్టెంబర్ 30 వరకూ ముగ్గురు పూర్వ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి రాజ్యమేలారు. వారిలో బీసీలెవరూ లేరనేది తెలిసిన విషయమే. అగ్రకులానికి చెందిన నేతల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో అంగీకారం కుదరకపోవడం వల్లనే దళితుడైన సంజీవయ్యను సీఎం గద్దెపై కాంగ్రెస్ కూర్చోబెట్టిందనేది కూడా తిరుగులేని వాస్తవం. తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మక చర్యల ద్వారా అణచివేసిన కాసు బ్రహ్మానందరెడ్డిని 1971 సెప్టెంబర్ చివర్లో పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తొలగించింది. అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ, ఆంధ్ర ప్రాంత బీసీ నేతలకు ఇచ్చే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం కనీసం పరిశీలించలేదు.
నాటి ప్రధాని, తిరుగులేని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ ఉత్తరాదిన కొన్ని చోట్ల బీసీ నాయకులకు కొద్ది మాసాలపాటు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చారు గానీ, తెలుగు రాష్ట్రంలో ఎందుకో మరి అంతటి సాహసం చేయలేదు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవికి (కాంగ్రెస్ శాసనసభాపక్షంసీఎల్పీ నాయకత్వం) నాటి పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ బీసీ నేత ఒకరు (జి.రాజారామ్) పోటీ పడినప్పటికీ ఇందిరమ్మ అప్పుడు వెనుకబడిన కులానికి చెందిన నాయకుడికి సీఎం అయ్యే అవకాశం ఇవ్వనే లేదు.
ఓబీసీలకు అధికారంలో తగినంత వాటా, బీసీలకు రాజ్యాధికారం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నుంచి తెలంగాణలో చోటామోటా నాయకుల వరకూ నేడు పదే పదే మాట్లాడటాన్ని చూస్తున్నాం. అయితే, నలుగురు నేతలకు సీఎం అయ్యే అవకాశం ఇచ్చిన 19781983 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పదవిని బీసీ నాయకుడికి ఇచ్చే విషయం కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనకు సైతం రాకపోవడం భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ)గా ప్రసిద్ధికెక్కిన జాతీయ రాజకీయపక్షం స్వభావానికి, సామాజిక న్యాయసూత్రాల పట్ల దానికున్న ‘అంకితభావాని’కి అద్దం పడుతున్నది.
ఏ సామాజికవర్గానికైనా జనాభాలో దాని పరిమాణానికి అనుగుణంగా వనరులు, ఉపాధి వంటి విషయాల్లో వాటా ఇవ్వాలని గత కొన్ని మాసాలుగా లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ‘గొంతెత్తి ప్రచారం’ చేస్తున్నారు. మరి ఈ లెక్కన ఉమ్మడి ఏపీలో బీసీల జనాభా నలభై శాతానికి పైగా ఉంటుందనే అంచనా గత 75 ఏండ్లుగా ఉంది. అయినా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో బీసీ రిజర్వేషన్లను కనీసం 35 శాతానికి పెంచడానికి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రయత్నించలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఈ దిశగా ఏపీ సర్కారును నడిపించలేదు. 1985లో టీడీపీ స్థాపకుడు ఎన్.టి.రామారావు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్లను 29 నుంచి 44 శాతానికి పెంచినప్పుడు కాంగ్రెస్ ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించలేదు. అంతటితో ఆగకుండా బీసీ కోటా పెంపునకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి పరోక్షంగా సాయమందించింది. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ దృష్టిలో ఓబీసీలు కేవలం ఓటర్లే తప్ప సాధికారతకు అర్హులైన ప్రజలు కానేకాదు. రాజ్యాధికారంలో వెనుకబడిన తరగతులవారికి తగిన వాటా ఇవ్వాలంటూ ఈ మధ్య పదే పదే చెప్తున్న కాంగ్రెస్‌కు ఉమ్మడి ఏపీలో బీసీ కోటా పెంచడం సబబేనన్న ఆలోచన రాలేదు.
వెనుకబడిన కులాలపై రాహుల్ లేదా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రేమ పొంగిపొర్లి పోవడానికి కారణాలు లేకపోలేదు. ఉత్తరాది రాష్ర్టాల్లో ముఖ్యంగా జనాభా రీత్యా అతిపెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌ల్లో కాంగ్రెస్ అధికారాన్ని మూడున్నర దశాబ్దాల క్రితమే శాశ్వతంగా కోల్పోయింది.
అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో 1989 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాలేదు. లోక్‌సభతో పాటు శాసనసభకు జరిగిన ఈ ఎన్నికల నాటి సీఎం నారాయణ్ దత్ తివారీయే కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన 8 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 50 సీట్లు రాలేదు. బీసీల జనాభా గణనీయంగా ఉన్న ఈ హిందీ రాష్ట్రంలో బీసీలు 1990ల నుంచి కాంగ్రెస్‌కు శాశ్వతంగా దూరమయ్యారని తర్వాత జరిగిన వివిధ ఎన్నికల ఫలితాల గణాంకాలే చెప్తున్నాయి.
అలాగే మరో కీలక హిందీ రాష్ట్రం బీహార్‌లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా. 1990 ఫిబ్రవరిలో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో మిశ్రా నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో విజయం సాధించలేదు. 1995 నుంచీ జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దక్కిన సీట్లు 50 కంటే తక్కువే. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో జనతాదళ్ నుంచి ఆర్జేడీ అవతరించిన కొన్నేండ్లకు మాత్రమే కాంగ్రెస్‌కు ఆయన భార్య రాబ్డీ దేవి క్యాబినెట్లో రెండు, మూడు మంత్రి పదవులు దక్కాయి.
తర్వాత బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ కలిసి ఉం డగా ఏర్పడిన సంకీర్ణాల్లో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా ఉంది. ఇలా దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలంలో యూపీ, బీహార్లలో ముఖ్యమంత్రి పీఠానికి కాంగ్రెస్ దూరమయ్యాక రాహుల్‌గాంధీ ఇప్పుడు తెలివిగా ఓబీసీ నామజపం ప్రారంభించారు. అదేమార్గంలో ముందుకుసాగి ఓబీసీలను ఆకట్టుకోవడానికి తె లంగాణలో కాంగ్రెస్ సర్కారు పంచాయతీరాజ్ ఎ న్నికల్లో బీసీల కోటాను 42 శాతానికి పెంచడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఓబీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ఇంత కాలం విస్మరించడానికి గల కారణాలను జూలై చివరి వారం ఢిల్లీలో ‘భాగీదారీ న్యాయ్ సమ్మేళన్’ పేరుతో జరిగిన ఓబీసీ సదస్సులో వివరించే ప్రయత్నం చేశారు రాహుల్. కాంగ్రెస్ నాయకత్వంలో సాగిన యూపీఏ హయాంలోనే కులగణన చేసి ఉండాల్సిందని, కాంగ్రెస్ మార్గదర్శిగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలకు ఎంతో మేలు జరిగేలా చూశానని రాహుల్ ఈ సదస్సులోనే ప్రకటించారు. అంతటితో ఆగకుండా అప్పట్లో ఓబీసీల సమస్యలపై తనకు లోతైన అవగాహన లేనందువల్లనే ఈ వర్గాల అభ్యున్నతికి ఏమీ చేయలేకపోయానని రాహుల్ చెప్పిన మాటల్లో ఎంత సత్యం ఉందో వెనుకబడిన కులాల ప్రజలకు తెలుసు.
– నాంచారయ్య మెరుగుమాల