‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో… నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో..’ అని ఐదు దశాబ్దాలపాటు వేదనతో పోరాట పాటలు పాడుకున్న రోజులను చూసిన మనమే…‘అమ్మ పిలుస్తుందయ్యా అన్నలారా.. మీ అయ్య పిలుస్తుండయ్యా గొంతు పోయేలా..’ అని ఇవాళ లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ పాటలు పాడిస్తున్న రోజులనూ చూస్తున్నం. కారణాలేవైనా లొంగుబాట్లు పెరిగాయి సరే, మరి లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు, పునరావాసాల విషయం ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నలు ప్రభుత్వం ముందు నిలిచాయి.
దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని, సిద్ధాంతాల కోసం పోరాడిన మావోయిస్టులు నేడు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అయితే, ఆయుధాలు వీడటంతోనే వారి సమస్యలు ముగిసిపోలేదు, సామాజిక, ఆర్థిక పునరావాసంతోనే వారికి నిజమైన సవాల్ మొదలవుతుంది. రాష్ట్రంలో 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 721 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 2025 సంవత్సరంలో 509 మంది లొంగిపోగా, అందులో ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యు లు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగుబాట్ల తర్వాత 60 శాతానికి పైగా కేసుల్లో ప్రాథమిక సహాయం అందినప్పటికీ, పూర్తిస్థాయి పునరావాసం మాత్రం 40 శాతం లోపు మాత్రమే సాధ్యమైందని అంచనా. లొంగుబాట్లు సరే కానీ, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అది అన్నివర్గాల అవసరంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. లొంగుబాట్ల సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు ప్రకటించిన రివార్డులు సకాలంలో అందకపోవడం వల్ల లొంగిపోయిన నక్సలైట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా, వారి గత జీవనం కారణంగా ప్రజలు వారిని అనుమానంతో చూసే పరిస్థితులు కూడా ఉంటాయి. పోలీసులు మళ్లీ ఎలాంటి ఇబ్బందులు పెడుతారో అనే భయం సాధారణ పౌరులను వెంటాడుతూ, వారితో కలవనివ్వడం లే దు. దీంతో జనజీవన స్రవంతి అనే పదం లేకుండా పోయి, అతికష్టంగా జీవన స్రవంతి మాత్రమే సాగుతున్నది.
నక్సలైట్లు దశాబ్దాల పాటు అడవుల్లో ఉండి ఉద్యమించిన స్థితికి, లొంగుబాటు తర్వాత సమాజంలో వివిధ కారణాలతో బతుకలేని పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు లోనై, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చివరికి, కుటుంబ పోషణ భారమైన దుస్థితిలో కూడా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలు జరగడానికి బాధ్యత కూడా ఈ సమాజంలో ఉన్న మనందరిదీ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశాలపై దృష్టి సారించి, లొంగిపోయిన సమయంలో వారికి ప్రకటించిన నగదు, ఇతర ప్రోత్సాహకాలను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అందజేయాలి. అదేవిధంగా వారికిచ్చే ప్యాకేజీలు తక్షణ జీవనోపాధికి భరోసానిస్తాయి. వీరిలో చాలామంది చదువుకు దూరమైనవారు ఉంటారు కాబట్టి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా అమలు చేయాలి. ఉద్యానవన, పాడి పరిశ్రమ, టైలరింగ్, డ్రైవింగ్ వంటి రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించి, చిన్నతరహా పరిశ్రమలు పెట్టుకొనేలా ప్రోత్సహించాలి.
వీరిలో చాలామంది దశాబ్దాల తరబడి అడవుల్లో ఉన్నారు కాబట్టి, సొంత ఇల్లు ఉండదు. అందుకే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. చట్టపరమైన రక్షణ కల్పిస్తూ, పాత కేసుల విషయంలో వేగవంతమైన పరిష్కారం చూపేలా ప్రత్యేక విభాగం పనిచేయాలి. కేసుల నుంచి వీరికి విముక్తి కలిగించి, భరోసా కల్పించాలి. దీంతోపాటుగా పోలీసు శాఖ ముందుకు వచ్చి, ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఆయా ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలి. లొంగిపోయిన నక్సలైట్లు కూడా ఇప్పుడు సాధారణ పౌరులేనని, వారితో కలిసిపోవడం వల్ల పోలీసుల నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అవగాహన కల్పించాలి.
తుపాకీ పట్టిన చేతులు నాగలి పట్టినా, పనిముట్లు పట్టినా, స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడినా అది ప్రజాస్వామ్య విజయమే అవుతుంది. లొంగిపోయిన నక్సలైట్లు గౌరవప్రదంగా బతికేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. అలాగే సమాజం కర్తవ్యం కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తిచాల్సి సమాజంలో శాంతి పరిరక్షణకు ఈ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలి. లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొని, అన్నలు మళ్లీ అడవిబాట పట్టకుండా, సమాజంలో మళ్లీ ఆనాటి అశాంతి ప్రబలకుండా చూడాల్సిన తప్పనిసరి అవసరం కూడా ప్రభుత్వంపైనే ఉన్నది. ఈ దిశగా పాలలు ఆలోచించాలి. తగిన సంక్షేమ చర్యలు తీసుకోవాలి.
– తక్కెళ్లపల్లి రవీందర్ రావు