జూన్ 12 క్యాలెండర్లో ఒక మామూలు రోజు మాత్రమే కావచ్చు. కానీ, ఆ రోజుతో జరిగే ఓ ప్రారంభం మాత్రం ప్రతి ఇంటినీ కుదిపేస్తుంది. ఓ రెండు నెలల పాటు సాగిన దినచర్యను సమూలంగా మార్చేస్తుంది. నిద్రలేచే సమయాలు, వంటలు, ఇంటి పనులు, దుస్తులు.. ఒకటేమిటి! మన జీవితాలు అకస్మాత్తుగా ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ అయిన రైలులా దిశ మార్చేసుకుంటాయి. బడులు ప్రారంభం అయ్యే రోజు కదా! జీవితాన్ని ఓ పది అధ్యాయాలుగా విభజిస్తే ఎలా ఉంటుందో.. కొత్త తరగతిలోకి అడుగుపెట్టిన పిల్లల జీవితం, తనతో పాటు ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యతలూ ఓ కొత్త ఒరవడిలోకి వచ్చేస్తాయి. ఏటా ఉండే హడావుడే ఇది. కాకపోతే… దాన్ని ఓ సరికొత్త ప్రారంభంగా భావించి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే బడి కాస్తా చదువు సంస్కారాల రా‘బడి’గా మారిపోతుంది. ఫీజుల దగ్గర నుంచీ పోటీల వరకూ ఏదీ భారం కాకుండా చూసుకోవచ్చు.
ఒకప్పటి చదువులు వేరు. బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం వస్తుంది. ఇదే ఫార్ములా. విద్యార్థులైనా, టీచర్లయినా ఈ సూత్రాన్ని ఇష్టపడేవారు, దాని కోసం కష్టపడేవారు. ఇప్పుడు ఆ ఎంపిక లేదు. ప్రతి ఒక్క విద్యార్థీ తన సామర్థ్యానికి తగినన్ని మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి ఉంది. దీనిచుట్టూ మరిన్ని సవాళ్లు అల్లుకున్నాయి. కార్పొరేట్ ఫీజులు పెరిగిపోయాయి, పుస్తకాలు బట్టీ వేయాల్సిన పరిస్థితి. మైదానాలు తగ్గిపోయాయి, నీతి శాస్ర్తాన్ని సిలబస్ నుంచి తీసేశారు, ఆటపాటలకే కాదు పోటీలకి కూడా స్కూళ్లో సందర్భం లేదు. స్క్రీన్ టైం పెరిగిపోయింది, స్నేహాలకు కూడా సమయం చిక్కడం లేదు.. ఇలాంటి సవాలక్ష మార్పుల మధ్య పిల్లలు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మలుచుకోవాలని అనుకుంటే, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తపడాల్సిందే. కానీ, వాళ్లేమో కెరీర్ పరుగులో తలమునకలై ఉన్నారు. అందుకే, పిల్లల బడి గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఏ చిన్నారికైనా ఇంట్లోనే ఉండాలనీ, ఆడుకోవాలనీ, టీవీ చూడాలనీ ఉంటుంది. స్కూలంటే కాస్త భయమూ, బెరుకూ ఉంటాయి. అది హద్దులు దాటి బడి అంటేనే వణికిపోతుంటే ఏదో ఇబ్బంది ఉందనుకోవాలి. స్కూల్ తగలబడిపోతే బాగుండు, టీచర్లు పోతే బాగుండు అన్న స్థాయిలో ద్వేషం ఉందంటే.. అదే స్కొలినోఫోబియా. సెలవుల స్వేచ్ఛ తర్వాత ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వణుకు, పీడకలలు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి… ఇవి బడి నుంచి తప్పించుకోవడానికి పిల్లలు చెప్పే అబద్ధాలు మాత్రమే కాకపోవచ్చు. దీనికి విరుగుడు వాళ్లను మరింత భయపెట్టి, బలవంతంగా బడికి పంపడం కాదు. దాని వెనకాల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ భయానికి మూలం కేవలం చదువంటే బెరుకా లేకపోతే స్కూళ్లో పిల్లలు ఏడిపించడం, కఠినమైన శిక్షలు, ఆత్మన్యూనత, ఒంటరితనం లాంటి సమస్యలా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మూలాన్ని సరిచేస్తే మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. బడి మొదలైన కొన్ని నెలల తర్వాతో, పరీక్షల సమయంలోనో ఇలాంటి మార్పు సంక్లిష్టం అవుతుంది. ఆరంభంలో అయితే సులభంగా ఉంటుంది.
ఇంటి దగ్గరే బడి అయితే ఫర్వాలేదు. లేకపోతే మాత్రం రోజుకు ఒకటి రెండు గంటలు రానూపోను పిల్లాడు బస్సులో గడపాల్సిందే. వాళ్ల విలువైన జీవితాల్లో అదేం తక్కువ సమయం కాదు. సాధారణంగా బస్సు సౌకర్యంగా ఉందా, కిటికీలు సురక్షితంగా ఉన్నాయా అన్నంత వరకే మనం చూస్తాం. కానీ, లోపల చాలా సమస్యలే ఉంటాయి. చాలా సందర్భాలలో బస్సులో పిల్లల్ని ఏడిపించడం (బుల్లీయింగ్) జరుగుతుంది. ఏ సీట్లో ఎవరు కూర్చోవాలనే విషయం మీద గొడవలూ జరుగుతాయి. బస్సు డ్రైవర్లు, సహాయకులు దూకుడుగా ఉండటమో, ఒక్కోసారి లైంగికంగా వేధించడమూ జరగవచ్చు. ఇంట్లో చెబితే ఇంకా గొడవవుతుందనే బెరుకుతో పిల్లలు నిశబ్దంగా బాధపడే సందర్భాలివి. రోజూ రాత్రి వాళ్లతో గడిపే కాస్త సమయంలో ఎప్పుడన్నా ఓసారి వాళ్లకు సమస్యలు చెప్పుకోమనే భరోసా కల్పించి తీరాలి. బస్సులో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ప్రశ్న కూడా రావాలి.

కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే కొత్త లంచ్ బాక్స్ తప్పనిసరి అయిపోతుంది. సాధారణంగా పిల్లలు బొమ్మలు ఉన్న లేదా రంగురంగుల లంచ్ బాక్సులను ఇష్టపడతారు. మనమూ కొనిపెడతాం. కానీ, చౌకబారు ప్లాస్టిక్ బాక్సుల వల్ల ఆరోగ్యానికి చాలా నష్టమే ఉంటుంది. స్టీల్ బాక్సులు ఉత్తమం అంటున్నారు నిపుణులు, కాదంటే ఇన్సులేటెడ్ బాక్సులు అదీ కాదంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడమంటారు. ఇక ఆ బాక్సులో ఏం పెడతాం అన్నది మరో సమస్య. దాంతో ఆకలి తీరాలి కానీ, బద్ధకం రాకూడదు. చపాతీలు, మొలకలు, పండ్లు, పన్నీర్ లాంటి ఆహారంతో బలం, ఆకలి రెండూ తీరతాయి. కోడిగుడ్డును తరచూ ఏదో ఓ రూపంలో ఇవ్వగలిగితే ఎదిగే పిల్లలలో ఏర్పడే తక్కువ బరువు (stunting), తక్కువ ఎత్తు (wasting) లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఇష్టమైన ఆహారంతో పాటు ఉడికించిన కూరలు, పండ్లు, పప్పులు కలిపి ఇస్తే మేలు! ఇవన్నీ విన్న మాటలే. కాకపోతే రోజువారీ హడావుడిలో అంతగా పట్టించుకోం. బడితోపాటు ఈ అలవాట్లను కూడా దారిలో పెడితే బాగుంటుంది కదా!
చాలా సందర్భాల్లో మరీ ముఖ్యంగా పట్టణాల్లో స్కూల్ పేరు చూసి పిల్లలను జాయిన్ చేస్తారు. లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించుకోరు. గాలీ వెలుతురు చొరబడని ఇరుకు గదులు, అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్లు, పాతబడిన బల్లలు, పిల్లల ఎత్తు-బరువుకు తగని కుర్చీలు.. చాలా స్కూళ్లలో సర్వసాధారణం. వీటితో పిల్లలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్కరి గొంతుకతో వీటికి పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి సందర్భాలలో వీటిని తప్పకుండా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలి. పిల్లలు కూడా ఈ సమస్యలు ఇంట్లో చెప్పేలా ప్రోత్సహించాలి. టాయిలెట్స్, మంచినీరు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటి సమస్యలైనా ఒత్తిడితో సరిదిద్దేలా చేయవచ్చు.
పాత భవనాలు, ఫర్నిచర్ విషయంలో గట్టిగా పోరాడలేకపోవచ్చు. కానీ సీసీటీవీలు, ఎమర్జెన్సీ తలుపులు, అగ్ని ప్రమాదాన్ని నివారించే ఏర్పాట్లు.. ఇలాంటి భద్రతాపరమైన సౌకర్యాలు ఉన్నాయో లేదో మాత్రం కచ్చితంగా సరిచూసుకోవాలి. అవతలి వ్యక్తులకి ఇవి చాదస్తంగా తోచవచ్చు. కానీ తప్పు జరగకుండా ఉండేందుకు, ఒకవేళ జరిగితే వీలైనంత త్వరగా సరిదిద్దేందుకు ఇవి చాలా అవసరం.
మన దేశంలో ఏటా కొన్ని వేల మంది పిల్లలు తప్పిపోతున్నారు. వారిలో కొందరిని మాత్రమే కనుక్కోగలుగుతున్నారు. పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కితే వారిని రక్షించడం చాలా కష్టం అవుతుంది. అందుకని స్కూల్‌కి బయటివాళ్లని అనుమతిస్తున్నారా, పిల్లల్ని తీసుకువెళ్లేటప్పుడు వారిని ఓ కంట గమనిస్తున్నారా, ఇంటి నుంచి స్కూల్ వరకు పిల్లలు నడుస్తున్న దారి ఎలాంటిది, స్కూల్ వేళల్లో బయటి వ్యక్తులు వస్తే వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారా, స్కూల్ బయట ట్రాఫిక్ ఎలా ఉంటున్నది, పిల్లలు స్కూల్‌కి రాకపోతే మెసేజ్ వస్తున్నదా.. లాంటి విషయాల్ని గమనించడంలో తప్పులేదు.

డైరీ కేవలం పిల్లలకి మాత్రమే కాదు… తల్లిదండ్రులకి కూడా ముఖ్యమే. రోజూ ఏం హోంవర్క్ ఇచ్చారు, టీచర్లు ఏం చెబుతున్నారు అన్న విషయాలతో పాటు… ఏయే పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఒలింపియాడ్స్, సైన్స్ ఫెయిర్స్, పేరెంట్ టీచర్ మీటింగ్స్, నో బ్యాగ్ డే లాంటి వివరాలన్నీ అందులోని క్యాలెండర్లో ఉంటాయి.
స్కూళ్లతో పాటు వర్షాకాలం కూడా మొదలవుతుంది. తరగతిలో ఏ ఒక్కరికి జలుబు, దగ్గులాంటి అంటువ్యాధులు వచ్చినా మిగతా పిల్లలకు సోకుతాయి. కర్చీఫ్ లేదా మాస్క్ అలవాటు చేయడం, తినే ముందు తర్వాత చేతులు కడుక్కోవాలనే సూచన, వైద్యులు సూచించిన టీకాలు వేయించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి. వైరల్ ఫీవర్, కండ్లకలక లాంటి సమస్యలు మన పిల్లలకి ఉంటే అవి తగ్గేదాకా బడికి పంపకపోవడమే మేలు.
కొవిడ్ సమయంలో అలవాటైన డిజిటల్ స్క్రీన్ల వల్ల చాలామంది పిల్లలకి చత్వారం వచ్చేసింది. కానీ, పెద్దలకు భయపడి పిల్లలు అది చెప్పలేకపోవచ్చు. అది వాళ్ల చదువు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. బోర్డు కనిపించక, పుస్తకాల్లో సరిగా రాయలేక ఇబ్బందిపడతారు. పెద్దలే దీన్ని పట్టించుకోవాలి. పిల్లవాడికి కళ్లజోడు ఉంటే నామోషీ అనే భావన పక్కన పెట్టి ‘పిల్లాడు బోర్డు సరిగ్గా చూడగలుగుతున్నాడా!’ అని టీచర్లని అడిగి తెలుసుకోవాలి.
రోజంతా చచ్చీచెడి పనిచేసి వచ్చే తల్లిదండ్రులకు పిల్లల చదువులో సాయం చేసే ఓపిక ఉండకపోవచ్చు. కానీ, కనీసం రోజులో ఒక్క పది నిమిషాలు అయినా బడి గురించి చిన్నారితో మాట్లాడితే ఆ ప్రభావమే వేరేగా ఉంటుంది. బడిలో ఏం నడుస్తున్నది, ఏం చెబుతున్నారు, ఏదన్నా ఇబ్బంది ఉందా, పాఠాలు అర్థం అవుతున్నాయా, స్నేహితులు ఎలా ఉన్నారు… లాంటి విషయాలు మాట్లాడిస్తే పిల్లల్లో బెరుకు తగ్గుతుంది. బడిలో ఏం జరుగుతున్నదనే అవగాహన పెద్దలకూ కలుగుతుంది.
బడిలో చదువు ఎంత ముఖ్యమో నేస్తాలూ అంతే ముఖ్యం. ఎవరితో స్నేహం చెయ్యాలో మనం చెప్పలేం. కానీ, సరైన స్నేహం వల్ల చదువు, వ్యక్తిత్వం ఎలా మారిపోతాయో చెప్పగలం. అప్పుడప్పుడూ వారి స్నేహితుల గురించి వాకబు చేసి తృప్తిపడగలం.
ఇప్పటి స్కూళ్లలో మైదానాలు కరువన్నది బహిరంగ రహస్యం. మరి వాళ్లకి స్పోర్ట్స్ క్లాస్‌లో ఏం చేయిస్తున్నారు. స్కూల్లో ఎలాంటి వ్యాయామం నడవకపోతే… దానికి పరిష్కారం ఏంటి? ఇంటి దగ్గర ఏదన్నా ఆట అలవాటు చేయాలా… అన్నది మొదట్లోనే ఆలోచించి అమలుచేయాలి.
స్కూల్ ప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం.. ఇలా సవా‘లక్ష’ ఖర్చులు ఉంటాయి. ఆ అంచనాలని ఓ చోట రాసుకుని, ఎంత ఎప్పుడు ఎలా కట్టాలో ఓ ప్రణాళిక వేసుకుంటే కష్టంగా తోచదు. ఖర్చులు భారం కాకుండా ఉండటానికి మన దగ్గర క్రెడిట్ కార్డ్ EMI, ఇన్స్టాల్మెంట్ లాంటి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవచ్చు.
స్కూళ్లు మొదలవగానే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు, ఆ తర్వాత జరిగే ఈ సమావేశాల్లో కేవలం పిల్లల మార్కుల గురించే కాకుండా వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది, టీచర్-విద్యార్థి మధ్య సఖ్యత ఉందా, ఇంట్లో తమ వంతుగా ఏం చేస్తే బాగుంటుంది, స్కూల్ వాతావరణం ఎలా ఉంది, మిగతా తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు లాంటి విషయాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం జరగాలి.
అందరు పిల్లలూ నూటికి నూరు మార్కులు తెచ్చేసుకోరు. కొంతమందికి చదువు పట్ల అంత ఆసక్తి ఉండకపోవచ్చు, కొందరి ఏకాగ్రత వేరే విషయాల మీద ఉండవచ్చు. కానీ అరుదుగా కొందరు పిల్లలు మాత్రం తెలివితేటలు, చురుకుదనం, ఆసక్తి ఉండి కూడా చదవలేకపోతుంటారు. అందుకు కారణం Learning Disabilities. అది తెలుసుకోకుండా వారిని మొద్దులుగా ముద్ర వేసేస్తుంటారు. స్కూల్ ప్రారంభంలోనే దీన్ని గమనిస్తే ఆ ఏడాది మాత్రమే కాదు, పిల్లాడి భవిష్యత్తు అంతా బాగుంటుంది.
Learning Disorders చాలా రకాలుగా ఉండవచ్చు. చదవడంలో, రాయడంలో, లెక్కలు చేయడంలో, ప్రశ్నలు వినడంలో, ఆకారాలు గుర్తించడంలో… ఇలా ఎన్నో సవాళ్లు ఉంటాయి. Dyslexia, Dysgraphia, Dyscalculia, Auditory Processing Disorder, Visual Processing Disorder… అంటూ రకరకాల విభజన ఉంది.
ఒకప్పుడు ఈ Learning Disorders గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు వాటి గురించి ఎంత శిక్షణ ఉందంటే.. చాలాసార్లు టీచర్లే వాటిని గుర్తించేయగలరు. జన్యువుల నుంచి మానసిక ఒత్తిడి వరకూ ఎన్నో కారణాల వల్ల ఈ సమస్యలు ఏర్పడవచ్చు.
డిస్లెక్సియా లాంటి పేర్లు భయపెట్టవచ్చు కానీ, అవేవీ అసాధ్యమైన రుగ్మతలు కావు. చికిత్స కోసం అతిగా ఖర్చు చేయాల్సిన పనీ లేదు. లోపం ఉందని కనుక్కుంటే జాగ్రత్తగా వాటిని మచ్చిక చేసుకోవచ్చు.
చదువుకి సంబంధించిన సమస్యలు కొన్నయితే అసలు ఏకాగ్రత లేదా వ్యక్తిత్వపరమైన సవాళ్లు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు Attention-Deficit/Hyperactivity Disorder (ADHD). ఇవి బడికే పరిమితం కాదు. అతి చురుగ్గా ఉండటం లేదా ఏదో లోకంలో ఉండిపోవడం, విపరీతమైన భయం, పదినిమిషాల మించి దృష్టి పెట్టలేకపోవడం లాంటివన్నీ ADHDలో కనిపిస్తాయి. దురదృష్టవశాత్తు వీటిని పెద్దలు గమనించరు లేదా కొట్టిపారేస్తారు. కానీ అవి కెరీర్‌ని విచ్ఛిన్నం చేస్తాయని గ్రహించరు. వీలైనంత త్వరగా వీటిని గుర్తిస్తే, ఈ సంవత్సరమే కాదు… తన భవిష్యత్తే మారిపోతుంది.

అసలు స్కూల్ బ్యాగ్స్ గురించే ఓ సుదీర్ఘమైన వ్యాసం రాసుకోవచ్చు. అంత క్లిష్టమైన అంశం ఇది. పిల్లవాడి బరువులో బ్యాగ్ బరువు పదిశాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదని చెబుతారు. కానీ చాలా నివేదికల్లో తేలిందేమిటంటే.. అది 10 శాతానికి దాటిపోయి కొన్నిసార్లు ఏకంగా 25 శాతం వరకూ ఉంటోందని!
1. బ్యాగ్ కొనేటప్పుడు దాని మీద ఉన్న కార్టూన్ బొమ్మలను చూసి కాకుండా మెత్తగా ఉందా? బరువు తక్కువగా ఉందా లేదా? పట్టీలు నొక్కుకోకుండా వంపుగా ఉన్నాయా? లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లవాడు దాన్ని వేసి చూసుకున్నాకే కొనాలి.
2. అధికబరువు ఉన్న బ్యాగ్ వల్ల వెన్ను వంకరపోవడం, కండరాలు దెబ్బతినడం, మెడనొప్పి, ఊపిరి సరిగ్గా అందకపోవడం, జీర్ణ సమస్యలు.. లాంటి సవాలక్ష ఇబ్బందులు తలెత్తుతున్నాయని సాక్షాత్తు వైద్యులే హెచ్చరిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే.. ఇవి శాశ్వతంగా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు.
3. కేవలం బరువు మాత్రమే కాదు.. బ్యాగ్ ఆకారం, దాని పట్టీలు, వెడల్పు అన్నీ కూడా పిల్లల మీద అదనపు భారాన్ని వేసేవే. ఉదాహరణకు నడుమును దాటి కిందకి జారే బ్యాగ్‌ల వల్ల వెన్ను మీద అదనపు భారం పడుతుంది. ఒకటే పట్టీ వేసుకున్నా, పట్టీలు బిగుతుగా కానీ దగ్గరగా కానీ ఉన్నా అధిక ఒత్తిడే!
4. నీళ్లకు, చిరుతిళ్లకు వేరే చేతి బ్యాగ్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు బ్యాగ్ చెక్ చేసి అక్కర్లేని నోట్స్, పెన్సిల్ బాక్స్, పాత పుస్తకాలు తీసేయించడం, బ్యాగ్ ఆధారం నడుముకి పైనే ఉంటున్నదా అని గమనించుకోవడం చేయాలి. పుస్తకాలను టైం టేబుల్‌తో పోల్చడానికి కూడా వెనకాడకూడదు. అవసరం అయితే బ్యాగ్ బరువు చూడటానికి కూడా మొహమాటపడకూడదు.
5. స్కూల్ బ్యాగులకు సంబంధించి ప్రభుత్వం చాలా విధివిధానాలే చేసింది. అందుకు అనుగుణంగా ఈమధ్యనే పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం స్కూల్ బ్యాగుల బరువు విద్యార్థి బరువులో పది శాతానికి మించడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీచేసింది. చాలా సందర్భాల్లో నవ్వుతూనో, జాలిపడుతూనో కొట్టిపారేసే ఈ సమస్య పిల్లల జీవితాన్ని నరకం చేస్తుందని గ్రహించాలి. తను ఏమాత్రం వెన్ను, భుజాలు, మెడ నొప్పి అని చెబుతున్నా దానికి బ్యాగ్‌ను కారణంగా గమనించి స్కూల్ యాజమాన్యాలతో గట్టిగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.
6. స్కూల్ వైపు నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గమనించాలి. Term wiseగా పుస్తకాల విభజన, అక్కర్లేని పుస్తకాలు స్కూల్లో ఉంచేసేందుకు ఏర్పాట్లు, పిల్లల తరగతి పై అంతస్తులలో ఉంటే వారి బ్యాగ్‌లు తీసుకువెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో తెలుసుకోవడం, ప్రభుత్వం ఆదేశించిన ‘నో బ్యాగ్ డే’ అమలు అవుతున్నదా లేదా గమనించడం చాలా ముఖ్యం.
చివరిగా, బడి అనగానే మన పిల్లల గురించి ఎంతలా ఆలోచిస్తామో! అంటే తనని మిగతా పిల్లలు ఏడిపిస్తున్నారో, టీచర్లు సరిగానే ఉన్నారా, బస్సులో అంతా బాగానే ఉందా, ఆటపాటల పరిస్థితి ఏంటి, ఇతరత్రా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, స్నేహితులు ఎలాంటివాళ్లు అంటూ మనవైపు నుంచి ఎంతటి అంచనాలతో ఉంటామో! అంతే బాధ్యతగా ఉండే ప్రయత్నం చేయాలి. టీచర్లతో ఎలా మెలగాలి, క్లాస్‌రూంలో ఎలా ఉండాలి, తనకంటే బలహీనంగా ఉన్న పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, బడిని కూడా సొంతంగా భావించి ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీరు, కాగితం లాంటి వనరుల్ని ఎలా పొదుపుగా వాడుకోవాలి… ఇలాంటి విషయాల్లో కనుక మన బిడ్డలో పరిణతి ఉంటే తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారిపోతుంది. తను చదవడమే కాదు… ఓ ఆదర్శ విద్యార్థిగా ఉండగలరు.