ఆంధ్ర రాజకీయ నాయకులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వారి ఒక చర్య వల్ల కలిగిన ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే మనల్ని ఇంకా ఆశ్చర్యపరిచే పని ఇంకోటి చేస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూడండి. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రపంచంలో లేని ఇంద్రుడి నగరం లాగా నిర్మిస్తానని 54 వేల ఎకరాలు పోగేశాడు. ఆ ప్రాంతం పెరిగిపోయినట్టు త్రీడి వీడియోలు తీసి, అయిదేండ్లు అవి చూపిస్తూ కాలం గడిపాడు.
400 ఏండ్ల నుంచి ప్రపంచంలోని అత్యంత సుందర నగరాలలో ఒకటైన హైదరాబాద్‌ను తానే నిర్మించానని పదే పదే చెప్పటంతో నిజాము రాష్ట్రం గురించి తెలియని ఆంధ్ర జనాలు తమకు అత్యద్భుత రాజధాని రాబోతోందన్న భ్రమలో మునిగిపోయారు. అయితే అక్కడ నాలుగేండ్లలో కనీసం 3 పక్కా భవనాలు-శాసనసభకు, శాసనమండలికి, హైకోర్టుకు కూడా కట్టలేకపోయాడు. పొత్తు ముచ్చటలో నరేంద్ర మోదీ 16 వేల కోట్లిచ్చినా ఆ భవనాల జాడ లేదు.
తమకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ 29 పల్లెల రైతులు విచారంలో మునిగి ఉంటే అందరినీ ఆశ్చర్యపరిచే ఇంకొక ప్రకటన చేశాడు విజనరీ ముఖ్యమంత్రి. అదేమిటంటే – 2014లో అమరావతి, 2024లో క్వాంటమ్ వ్యాలీ! ఇప్పుడు ఒక కొత్త విజన్ ప్రసాదించారు చంద్రబాబు. కొత్తగా ఉద్యోగాలు మింగేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి తోడుగా క్వాంటమ్ వ్యాలీ సృష్టించటానికి ఇంకో 44 వేల ఎకరాలు రైతులు త్యాగబుద్ధితో ప్రసాదిస్తే, తాను లక్ష ఉద్యోగాలు ఇస్తానని ప్రకటనలు చేస్తున్నాడు హైర్ ఎండ్ ఫైర్ విజన్ ప్రవేశపెట్టిన నారా నాయుడు! ఈ ఆశ్చర్యం నుంచి ప్రజలు తేరుకునే లోపలే వేల ఎకరాలు ఆయన ఖాతాలో పడుతాయి. ఇక నాలుగేండ్లు పూర్తవుతాయి.
ఆశించిన సంపాదన పూర్తయ్యాక ఎన్నికల సంగతి తర్వాత! అప్పుడు ఇంకో కొత్త విజన్ పుట్టుకువస్తుంది. విజన్‌లకు లోటు లేదు, వర్క్ లేదు కానీ! సరిగ్గా ఆయన పూర్వీకులు కూడా ఇలాంటి కథలు చెప్పి ఆంధ్ర ప్రజలను 1953 నుంచి 1956 దాకా వంచించారు. 1912న ఏర్పడిన ప్రత్యేక రాష్ట్ర కోరిక 1914లో ఒక ఉద్యమంగా మొదలుపెట్టి 1913 నుంచీ సభలు, సమావేశాలు, నెహ్రూగారికి వినతుల లేఖలు సమర్పించిన నాయకులు, 1950లో రాష్ట్ర ప్రకటన జరిగినా ముఖ్యమంత్రి పదవి తనకు రాదని టంగుటూరి ప్రకాశం, ఆ అవకాశాన్ని భగ్నం చేశాడు, మద్రాసు ఇవ్వకపోతే రాష్ట్రం వద్దు అని! అసలు ప్రజల మీద ఏ మాత్రం అభిమానం ఉన్న నాయకుడైనా అట్లా ప్రవర్తిస్తాడా?
ఆనాడు ఒప్పుకొని ఉంటే త్యాగధనుడు పొట్టి శ్రీరాములుని కాపాడగలిగేవారు కదా! ఆంధ్ర రాజకీయ నాయకుల స్వార్థం ముందు ప్రజా సంక్షేమం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది! శ్రీరాములు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసమే దీక్ష ముఖ్యంగా చేశారు కానీ, మద్రాసు కోసం మాత్రం కాదని 13 డిసెంబర్ ఆంధ్ర పత్రికలో సంపాదకీయం రాసింది. అంటే శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో ఆయన మరణాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవచ్చని అనుకొని ఉండచ్చు అప్పటి రాజకీయ నాయకులు! కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కాకపోయినా టంగుటూరి ప్రకాశం, శ్రీరాములు చితి మీంచి నడిచి ముఖ్యమంత్రి సింహాసనమెక్కాడు.
డిసెంబర్ 9 నుంచి శ్రీరాములు ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా, రాష్ట్రం కోసం పోరాడే యోధులెవరూ అది పట్టించుకోలేదు. తర్వాత కూడా మద్రాసు హైకోర్టు ఉమ్మడిగా సాగినా, రాజధాని కర్నూలును సవతి పిల్లాడిగా చూశారే కానీ, ఆ పట్టణంలో కనీస అవసరాలు కల్పించటానికి పూనుకోలేదు ముఖ్యమంత్రి, తదితరులు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నీలం సంజీవరెడ్డి ‘హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర సాధించాలనీ, కర్నూలు కేవలం తాత్కాలిక గుడారమే’నని ప్రకటించడం వారికి తమ ప్రాంతం మీద ఉన్న నిర్లక్ష్యం, పక్కవాడి సంపద మీద ఉన్న దురాశ తేటతెల్లం చేస్తోంది.
విశాలాంధ్ర వాదం సామాజిక స్పృహ ఉన్న నెహ్రూకి నచ్చలేదు. అందులో ప్రాంతాన్ని ఆక్రమించాలనే సామ్రాజ్యవాదం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయం నిజమేనని తర్వాతి కాలం నిరూపించింది. సుందర భాగ్యనగరం, పారుతున్న గోదావరి (560 కిలోమీటర్లు), కృష్ణా (305 కిలోమీటర్లు), భారతదేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతంలో ఇవ్వనంత జీతాలు, ఉద్యోగులకు ఇచ్చే సంపద, నల్లరేగడి భూములు. ఖర్చు తర్వాత మిగులుతున్న కోట్ల నిధులు, విలువైన ప్రభుత్వ, కాందిశీకుల భూములతో అలరారుతున్న వస్త్ర, కాగితం హైడ్రో ఎలక్ట్రిసిటీ, సిరులొలికే చక్కెర వంటి పంటలు, చెక్కర ఫ్యాక్టరీ, ఇంకా చిన్న పరిశ్రమలు ఇవన్నీ చూసి కండ్లు కుట్టిన ఆంధ్ర నాయకులకు, తమ సొంత ప్రాంతంలో కష్టపడి రాజధానిని కట్టుకోవటం దండుగనిపించింది.
కష్టించి సంపాదించటం కంటే పక్కవాడిది కొట్టేయడం తేలిక. ‘ఆ కష్టమేదో నెహ్రూని ఒప్పించి విశాలాంధ్ర సాధిస్తే మిగతా కష్టాలుండవు కదా’ అని మద్రాసు కొట్టేసే పథకం విఫలమైన నిరాశలో ఉన్న ఆంధ్ర రాజకీయ నాయకుల వక్రబుద్ధి మళ్ళీ తీక్షణంగా వికసించింది.
దీనికి తోడు రాజ్యాంగం రాసుకున్నాక, వివిధ రాష్ర్టాలలో ఉన్న చిన్న చిన్న సంస్థానాలను భారతదేశంలో కలుపుకొన్నాక, భాషా ప్రయుక్త (ప్రజల భాషలననుసరించి రాష్ట్ర సరిహద్దులనేర్పరచడం) రాష్ర్టాలు సాధ్యమవుతాయా అని ఆలోచించింది కేంద్రం. నిజానికి విదేశీ దండయాత్రలు జరుగకముందు భారతదేశం ఎప్పుడూ ఒక దేశంగా లేదు. త్రేతాయుగంలో రామరాజ్యం రష్యా అవతలిదాకా విస్తరించినట్టు చెప్తారు. కానీ, ద్వాపరయుగం వచ్చేటప్పటికి ప్రపంచమంతా 54 దేశాలుగా ఉన్నట్టు మహాభారత చరిత్రలో తెలుస్తుంది. ఆ దేశాల పేర్లు, పాలించిన వంశాలు, వాటిలోని రాజుల పేర్లు అవీ వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో దొరుకుతాయి. కొన్ని పేర్లు వేదాలలో ఉన్న విజ్ఞాన భాగంలో ఆయా ఋషులు చెప్పారు. ఉదాహరణకు, సూర్యోదయ, సూర్యాస్తమయాలు అనేవి ఉండవనీ, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడనీ, భూమి కదలికలను బట్టి ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో కనిపిస్తాడని ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు చెప్పాడు.
ఉదయోయో లంకాయాం సోస్థమయః సవితురేవ సిద్ధపురే! మధ్యాహ్నో యమకోట్యాం రోమక విషయేర్థ రాత్రాహ శ్యాత్!!
(పొద్దున్న సూర్యుడు లంకలో కనిపించి, తర్వాత సిద్ధపురానికి, మధ్యాహ్నం యమకోటికి కనిపించి రాత్రయేసరికి రోమ్ నగరంలోకి వస్తాడు, అంటే సూర్యుడు రాడు, భూమి కదలికల వల్ల ఒక్క సమయంలో ఆయా నగరాల్లో ఆయా రకంగా ఉంటది’ అని అర్థం)
విదేశీయుల కాలంలో ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనలో దక్షిణానికి కూడా విస్తరించిన రాజ్యం ఇంగ్లీషు వాళ్ల పరిపాలనలో పూర్తిగా ఒక్క దేశంగా ఏర్పడింది. సంస్కృతిపరంగా, దేశమంతా ఒక్కలా ఉన్నా, భాషలు వాటి సాహిత్యాలన్నీ పూర్తిగా ఏర్పడిపోయి ఉన్నాయి. అవి మారలేదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన దేశం కూడా అమెరికా లాగ రాష్ర్టాల సమాఖ్య లాగ ఉండాలి. ఇన్ని శతాబ్దాలలో ఏర్పడిన వైవిధ్యాలు అలాగే కాపాడుకోవాలి. ఇప్పటి ప్రధానమంత్రి ప్రవచిస్తున్నట్టు ఒకే దేశం, ఒకే భాష లాంటి తెలివి తక్కువ నినాదాలు వ్యతిరేకించాలి.
ఆయన రోజూ ఒకే కూర తిని, ఒకే సూటు వేసుకుంటాడా? ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, 58 సంవత్సరాలు కలిసి ఉన్నా ఆంధ్ర, తెలంగాణ మధ్య భావసమైక్యత ఏర్పడలేదు. పైన చెప్పినటువంటి తేడాలు రెండు ప్రాంతాల సంస్కృతి, చరిత్ర, భాషలు, భావాలలో ఉండటమే కారణం. ఇది తర్వాతి వ్యాసంలో వస్తుంది. కేవలం భాషలు ఒకటే అని వాటిగురించి ఏమీ తెలియని నెహ్రూని మోసం చేసి, బలవంతపెట్టి, 1953 అక్టోబర్‌లో ఏర్పడి 1956 వచ్చేసరికి తమ ప్రాంతం అభివృద్ధి చేసుకోకుండా హైదరాబాద్ మీద కన్నువేసి ఫజల్ అలీ కమిషన్ సిఫారసుకి వ్యతిరేకంగా ఈ రెండు ప్రాంతాలనీ కలిపి ఉమ్మడి ఏపీగా చేయగలిగారు ఆంధ్ర రాజకీయ నాయకులు.
ఫజల్ అలీ కమిషన్ ఏమి చేసింది, అంతిమంగా ఏ సిఫారసులు చేసిందన్న వివరాలు వచ్చే వ్యాసంలో చర్చిద్దాం. ఈ ప్రాంతాల కలయిక రెండు విషయాల వల్ల జరిగింది. ఒకటి, స్వాతంత్య్రోద్యమం నుంచీ నెహ్రూ, గాంధీలతో ఆంధ్ర నాయకులకు పరిచయాలుండేవి. అందుకే వారి మాట ఎక్కువగా చెల్లేది.
కానీ, బ్రిటిష్ వారితో సంబంధం లేకుండా, నిజాం రాష్ట్రంలో ఉన్న నాయకులకు కేంద్రం నాయకులతో అంత చనువు లేదు. రెండో కారణం, ప్రపంచమంతా తెలిసి జైలు నిర్బంధం వచ్చినప్పుడల్లా తన కూతురికి ఇండియా గురించి ఉత్తరాలు రాసిన నెహ్రూకి ఈ రెండు ప్రాంతాల గురించి అవగాహన లేదనే చెప్పాలి. ఈ ప్రాంతాల భాషలైన తెలుగు, ఆంధ్రం ఒక్కటేనని నమ్మించగలిగారు ఆంధ్ర నాయకులు. అందుకే భౌగోళికంగా, సాంస్కృతికపరంగా, చరిత్రపరంగా, సామాజికంగా, భాషాపరంగా వేరైన ఈ రెండు ప్రాంతాలనీ, కమిషన్ సిఫారసుకి వ్యతిరేకంగా కలిపాడు జవహర్లాల్ నెహ్రూ.
-దంటు కనకదుర్గ