Medical PG | ఈ రోజుల్లో ఎంబీబీఎస్ మాత్రమే చేస్తే వైద్య విద్య చదివినట్టు కాదు. పీజీ సర్టిఫికెట్ జోడింపు ఉంటేనే గుర్తింపు, గౌరవమే కాదు.. ఉద్యోగమూ లభిస్తుంది. కానీ మెడికల్ పీజీ విద్యావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు అంతకంతకూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. స్థానికత ఆధారంగా కల్పించే రిజర్వేషన్లను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జనవరి 29న వెలువరించిన ఆ తీర్పులో స్థానికత అనే ప్రాతిపదిక రాజ్యాంగం ప్రకారం ‘ఆమోదయోగ్యం కాదని’ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్టం ముందు అందరూ సమానులేననే రాజ్యాంగంలోని 14వ అధికరణానికి స్థానిక కోటా విరుద్ధమని తెలిపింది. సుదూర పర్యవసానాలతో కూడిన ఈ తీర్పుతో తెలంగాణ వైద్య ప్రవేశాల రూపురేఖలే మారిపోతాయి. వచ్చే ఏడాది నుంచి స్థానిక కోటా లేకుండానే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.
దార్శనిక నేత కేసీఆర్ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలంటే వైద్యవిద్యా వ్యవస్థ విస్తరణే మార్గమని ఆలోచించారు. వైద్యవిద్య కేవలం రాజధాని ప్రాంతానికే పరిమితం కారాదని, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని సంకల్పించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆగమేఘాల మీద వాటిని అభివృద్ధి చేశారు. ఫలితంగా రాష్ట్రంలో వైద్యవిద్యా వ్యవస్థ అంచెలంచెలుగా ఎదిగింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 5 మాత్రమే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఇప్పుడు 33కు పెరిగిందంటే అది కేసీఆర్ దూరదృష్టి వల్లనే సాధ్యపడిందనేది ప్రత్యక్ష సత్యం. ఉన్నత వైద్యవిద్య కూడా అన్నిచోట్లా అందుబాటులోకి తేవాలనే సదాశయంతో పీజీ అప్గ్రేడ్ కూడా ప్రవేశపెట్టారు. వైద్యవిద్యకు వైద్యశాలల అనుబంధం తప్పనిసరి. దాంతో దవాఖానల ఆధునీకరణ కూడా చేపట్టారు. ధనిక-పేద, పట్టణ-గ్రామ అనే తేడాలు సమసిపోయి అందరికీ డాక్టరు చదువు అందుబాటులోకి వచ్చింది. దీనినే తెల్లకోటు విప్లవమని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు స్థానికత అనేది తొలగిస్తే పరిస్థితి తారుమారవుతుంది. కేసీఆర్ కలలు కన్న ఆరోగ్య తెలంగాణ ఆగమాగం అవుతుంది. ప్రాంతీయ ప్రయోజనాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో స్థానికతే లేకుండా పోవడం పెద్ద సమస్యే.
సుప్రీం తీర్పు వల్ల తెలంగాణతో పాటు యావత్ దక్షిణాదిపై ప్రభావం పడుతుంది. స్థానికత లేకుండా చేస్తే ఉత్తరాది వారికి అవకాశాలు పెరిగి, దక్షిణాది వారికి అవకాశాలు తగ్గిపోతాయి. అత్యాధునిక వైద్య విద్యా వ్యవస్థలను అభివృద్ధి చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ర్టాల్లోని స్థానిక విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎక్కువ నష్టం జరుగుతుందనేది మరో వాదన. ఎంబీబీఎస్ పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ‘ఇన్ సర్వీస్’ అభ్యర్థుల కోటా కూడా రద్దయిపోతుంది. మొత్తంగా రాష్ట్రంలో వైద్యసేవల నాణ్యత, అందుబాటు అనేవి కూడా క్రమంగా తగ్గిపోతాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థాయిలో మదింపు జరిపి, రాజ్యాంగ ధర్మాసనానికి అపీలు చేయడంతో సహా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉన్నది.