ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టిన జాడ్యం ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల అభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి మారడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడమే. ఈ దురంతాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరికన్న ఎక్కువగా శాసన సభాపతులపై ఉన్నది. అటువంటి శాసన సభాపతి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే? అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి కూడా అత్యంత కీలకమైనదే. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసి పదవీబాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి అందులోని నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలోనే నోరు పారేసుకుంటే? రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఈ రెండు ఉల్లంఘనలు బాహాటంగానే జరిగాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఓ మైలురాయి వంటిదని చెప్పాలి. పై రెండు పదవులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు అందులో చోటుచేసుకున్నాయి. అందులో అతిముఖ్యమైనది ‘మూడు నెలల్లోగా’ నిర్ణయం తీసుకోవాలనే గడువును సభాపతికి విధించడం. నిజానికి సంవత్సరానికి పైగా గడువు ఎప్పుడో ముగిసిపోయిందని సుప్రీంకోర్టు ఎత్తిచూపడం గమనార్హం.
గత శాసనసభ ఎన్నికల తర్వాత పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందువెనుకగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతలపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయ ప్రక్రియను మొదలుపెట్టాలని ఏకసభ్య ధర్మాసనం సూచించింది. దీనిపై ప్రభుత్వం అప్పీలు చేస్తే డివిజన్ బెంచ్ ఆ నిర్ణయాన్ని పక్కన పెడుతూ ‘సహేతుకమైన వ్యవధి’లో స్పీకర్ నిర్ణయించవచ్చని పేర్కొన్నది.
ఈ సహేతుకమైన అనేదానిని ఎంతదాకానైనా సాగదీయవచ్చనే అర్థంలో తీసుకున్నారు. అంతేకాకుండా న్యాయపరిశీలన పరిధిలోకి స్పీకర్ రారని, కనుక గడువు విధించలేరని భాష్యాలు కూడా వెలువడ్డాయి. ఈ ఆదేశాలను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. స్పీకర్‌కు న్యాయస్థానం గడువు విధించవచ్చా? అనే ధర్మ సందేహానికి తిరుగులేని భాష్యంతో సమాధానమిచ్చింది.
ఈ సందర్భంగా పదో షెడ్యూల్‌ను ఉదహరించడం జరుగుతున్నది. సాధారణరీత్యా సభాపతి నిర్ణయాలు న్యాయ పరిశీలన పరిధిలోకి రావన్నది నిజమే. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయమై సభాపతి ట్రిబ్యునల్‌గా వ్యవహరించే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం న్యాయ పరిశీలన కిందకు వస్తారని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎందుకంటే దేశంలోని ట్రిబ్యునళ్లు అన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలోకే వస్తాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో తేలిపోయింది. ఇన్నాళ్లూ తాత్సారం చేస్తూ న్యాయాన్ని దక్కకుండా చేసిన శాసనవ్యవస్థ, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కార్యనిర్వాహక పరిపాలనా వ్యవస్థ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో పడ్డాయి. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఉపఎన్నికలు రావని శాసనసభా వేదికపైనే ఆయన రాజ్యాంగ నియమాల పట్ల పూర్తి అగౌరవంతో మాట్లాడటంపై సుప్రీం అక్షింతలు వేసింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఈ మధ్య తరచుగా ఆయన రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని విలువల గురించి ప్రబోధిస్తున్నారు. కానీ, అదే రాజ్యాంగంలో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తెచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ఉందనే సంగతి మరిచిపోతున్నారు. ఫిరాయింపులను నిరోధించేందుకు తండ్రి తెచ్చిన ఆ సవరణకే ఇప్పుడు తనయుని ఆధ్వర్యంలో అదే కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. ఏదేమైనప్పటికీ న్యాయ నిర్ణయం జరిగిపోయింది. ఏవి పాలో, ఏవి నీళ్లో తేలిపోయింది. ‘మూడు నెలలలోగా.. వీలైనంత త్వరలో’ అని సుప్రీంకోర్టు కర్తవ్యబోధ చేసింది. మరింత జాగు చేయకుండా నిర్ణయం తీసుకుని ప్రజాతీర్పును గౌరవించేందుకు, గీతదాటిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ చర్య తీసుకుని న్యాయవ్యవస్థ పట్ల తమ గౌరవమర్యాదలు చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.