తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికుడు. ఆయనది ప్రభావశీలమైన వ్యక్తిత్వం. ప్రతిభావంతమైన నాయకత్వం. తెలంగాణను జలకళతో నింపి, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు. తెలంగాణ తల్లికి హరితహారం సమర్పించి, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా రూపొందిస్తున్నారు. ఆయనకు బూటకపు రాజకీయాలు గిట్టవు. మంచిని ఆదరించడం, చెడును దూరంగా ఉంచడం ఆయన విధానం.
మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలంటే కేసీఆర్‌కు నచ్చవు. అందుకే, ఆయన దేశాన్ని ప్రక్షాళన చేసి, భరతమాత రుణం తీర్చుకోవటానికి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి నడుం బిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొందరు విమర్శించారు. కానీ, ప్రపంచంలోనే ఒక అద్భుత ఇంజినీరింగ్ మార్వెల్‌గా దానిని నిర్మించి, అంతర్జాతీయ నీటిపారుదల నిపుణుల ప్రశంసలందుకున్న దార్శనికత కేసీఆర్‌ది. రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు పథకాలు ప్రవేశపెడితే రాష్ట్రం దివాళా తీస్తుందని ఆర్థిక నిపుణులు వారిస్తున్నా లక్ష్యపెట్టక ఆ పథకాలను విజయవంతంగా అమలుచేయడమే కాకుండా తెలంగాణను దేశంలోని ధనిక రాష్ర్టాల్లో ఒకటిగా నిలబెట్టిన ఘనత ఆయనది. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తామని శాసనసభలో ప్రకటించి, రాష్ట్ర యువత భవితలో దీపాలు వెలిగించిన నిబద్ధత ఆయనది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘటన. అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపడమే కేసీఆర్ ప్రత్యేకత. ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం.
2022-23 సంవత్సరానికి కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దీనికొక మంచి ఉదాహరణ. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర దశదిశను మార్చి రాష్ర్టాన్ని అభ్యుదయ పథాన పయనింపజేస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం ఏటా వార్షి క బడ్జెట్లో మూలధన వ్యయాన్ని పెంచుకుంటూ పోవడమే నిదర్శనం. అదే సమయంలో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈ విధంగా ఏకకాలంలో సంపద సృష్టితో పాటు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా అభివృద్ధి ఫార్ములాను అనుసరిస్తూ, ఆదర్శప్రాయమైన సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
ఈ బడ్జెట్ ప్రగతికి పొద్దు. దళితుల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యమిస్తూనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి తోడ్పాటునందిస్తూనే అభివృద్ధి, మౌలికసదుపాయాల కల్పనకు అగ్రతాంబూలం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా దగ్గరయ్యేలా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. వైద్య, ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పథకాలు, సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని కొనసాగించింది. ఇందుకోసం రూ.4 వేల కోట్లను కేటాయించింది. సొంత రాబడులే ఆలంబనగా రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం.
సామాజిక పరివర్తన పట్ల కేసీఆర్‌కు ఉన్న దృఢ నిశ్చయాన్ని ‘దళితబంధు’ పథకం తెలియజేస్తున్నది. ఇదొక అపూర్వమైన, అసాధారణమైన సామాజిక, ఆర్థిక ప్రయోగం. బడ్జెట్లో రూ.17,700 కోట్లను దళితబంధు పథకానికి కేటాయించడం, గొర్రెల పంపిణీకి రూ.11 వేల కోట్లు కేటాయించడం కూడా దీనిలో భాగమే. అలాగే, వ్యవసాయానికి రూ.24,254 కోట్లు కేటాయించి, వ్యవసాయాభివృద్ధి పట్ల తమకు గల నిబద్ధతను కేసీఆర్ మరొకసారి నిరూపించుకున్నారు. అట వీ ప్రాంతం, నదీ సంగమం, పుణ్య క్షేత్రాలతో పాటు, ప్రపంచస్థాయి జలాశయమైన కాళేశ్వరాన్ని గొప్ప పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించటం ఆహ్వానించదగిన పరిణామం.
అన్నిరంగాలకు సమానమైన ప్రాధాన్యం ఇచ్చిన ప్రజలందరికీ అనుకూలమైన బడ్జెట్ ఇది. అన్నివర్గాలు, అన్ని మతాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. రాష్ట్ర ప్రజలందరి మొహాల్లో చిరునవ్వు చూడటమే ఆయన ఆకాంక్ష. ఈ బడ్జెట్ దానికే నిదర్శనం. అనతికాలంలోనే రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేయగల బడ్జెట్ ఇది. రాష్ట్ర ప్రజల బంగారు భవితకు ఈ బడ్జెట్ ఒక ఉషోదయం.
ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. 1990 నుంచి కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేని పరిస్థితిని యాక్ట్-2 ఆఫ్ 94 కల్పించింది. దీనిమూలంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. ముప్ఫై ఏండ్లు సేవలందించినా ఎటువం టి రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందకుండానే రిటైరయ్యారు. ఈ దుస్థితి నుంచి కేసీఆర్ వారిని కాపాడారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా స్వర్ణభారతంగా పునర్నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. వారి ప్రయ త్నం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: కోలేటి దామోదర్ , 98491 44406, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్)