‘పెండ్లి చెయ్యడమంటే చాతకాదు గానీ, చెడగొట్టమంటే అదెంత పని’ అంటుంది మాయాబజార్ చిత్రంలో ఓ పాత్ర. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. స్వరాష్ట్ర సాధన తర్వాత సుమారు దశాబ్ద కాలం పాటు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అద్వితీయమైన అభివృద్ధిని సాధించింది. సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ప్రగతి పరుగులు ఇలా సాగుతుండగానే తగుదునమ్మా అంటూ కాంగ్రెస్ ముందుకువచ్చింది. అడ్డగోలు మాటలతో అరచేతిలో స్వర్గం చూపి, అర్రాసు తరహాలో ఒకటికి రెండంటూ కుప్పలుతెప్పలుగా హమీలు గుప్పించి అధికారం చేజిక్కించుకుంది.
ఎలాంటి పరిపాలనానుభవం లేని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరెలా పరిపాలిస్తారంటే గుంపుమేస్త్రి పోలిక చెప్పి సరిపెట్టుకున్నారు. ఈ గుంపుమేస్త్రికి ఇండ్లు కూల్చడం తప్ప, కట్టడం రాదని కాలక్రమంలో ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసివస్తున్నది. ‘అడ్డిమార్ గుడ్డిదెబ్బ’ అన్నట్టుగా సాగుతున్న అస్తవ్యస్త పాలనలో ప్రగతి పడకేసింది. సంక్షేమం సడుగులిరిగి మూలకు పడింది.
సీఎం రేవంత్ అనుభవరాహిత్యం, అవగాహనలోపాలు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నాయి. ఫలితంగా రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతులు, మహిళలు, యువత, రైతాంగం ఇలా అన్ని వర్గాలు పట్టింపు లేని పాలనతో కడగండ్ల పాలయ్యా యి. ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అనుకోని రోజంటూ ఉండటం లేదు. ప్రజల కొనుగోలు శక్తి అడుగంటిపోయింది. ద్రవ్య చలామణి స్తంభించిపోయింది.
ఇదేదో విపక్షాల మాట కాదు. సాక్షాత్తు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించిన అంకెలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్న ఫలితంగా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మందకొడితనం రావడంతో డిఫ్లేషన్ లేదా ‘ప్రతిద్రవ్యోల్బణం’ ఏర్పడింది. సప్లయ్ ఉన్నా డిమాండ్ లేక మార్కెట్ వెలవెలపోతున్నది. ఇది పండుగ సీజన్లో ఉండాల్సిన పరిస్థితి కాదు. సెప్టెంబర్‌లో ఇది మైనస్ 0.15గా నమోదు కావడం గమనార్హం. గత జూన్, జూలై మాసాల్లోనూ ఇదే పరిస్థితి. 4 నెలల్లో మూడు నెలలూ నెగెటివ్ అంకెలే నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇలాంటి దుస్థితి రావడం ఇదే తొలిసారి. రాష్ట్ర పరిస్థితి ఎంతగా దిగజారిందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. కేసీఆర్ ఇగురంగా ఖర్చు పెట్టి, ఒడుపుగా ప్రగతి పరుగులు పెట్టించిన ఫలితంగా రాష్ట్రం ఆర్థిక శక్తిగా ఎదిగితే, కాంగ్రెస్ సర్కారు విధ్వంస పాలనతో సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. బీఆర్ఎస్ పాలనలో పెరగడమే తప్ప తరగడం తెలియని రాష్ట్ర రాబడులు.. కాంగ్రెస్ పాలనలో మొదటిసారిగా తరుగుదల నమోదు చేశాయి.
గత ఏప్రిల్ రాబడులు అంతకు ముందరి ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్లకు పైగా తగ్గినట్టు కాగ్‌కు సమర్పించిన నెలవారీ నివేదికలో సర్కార్ స్వయంగా తెలిపింది. జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ తరుగుదల రావడం గమనార్హం. కేసీఆర్ హయాంలో 2023-24లో 11.06 శాతం వృద్ధిరేటు సాధిస్తే, కాంగ్రెస్ పాలనలో 2024-25లో అది 10.12 శాతానికి పడిపోయింది. ఇక తలసరి ఆదాయం వృద్ధిరేటు మరీ ఘోరం. 14.1 శాతం నుంచి ఏకంగా 9.6 శాతానికి పడిపోయింది. బుల్డోజర్ మార్కు పాలనతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి 2024-25లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా (రూ.18,228 కోట్లు)లో సగాని కంటే తక్కువ (రూ.7,033 కోట్లు)కు పడిపోయింది.
ఆర్తులకు సంక్షేమాన్ని కూడా అమలుచేయలేని అసమర్థ పాలనలో ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎన్నికలకు ముందు అప్పు చేయడం తప్పన్నట్టుగా మాట్లాడిన కాంగ్రెస్ రికార్డు స్థాయిలో అప్పులు తెస్తున్నది. 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్లు అప్పు చేసి తనకెవ్వరూ సాటిరారని చాటుకుంటున్నది. రూపాయి పుట్టడం లేదని దివాళాకోరు మాటలు చెప్తూనే నెలకు సగటున రూ. 10 వేల కోట్ల చొప్పున రుణాలు సేకరిస్తున్నది.
అయితే సంపద పెంచడం, నలుగురికీ పంచడమనే కేసీఆర్ సూత్రాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నది రేవంత్ సర్కారు. అటు కొండంత అప్పులు పోగుపడుతున్నా ఇటు బకాయిలూ భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదు. ఒక కొత్త పథకం ప్రారంభించలేదు. ఆ అప్పులతో మూలధన వ్యయమూ జరగలేదు. ఆస్తుల కల్పనా జరగలేదు. అప్పుచేసి తెచ్చిన లక్షల కోట్లు ఏమయ్యాయో సర్కారు సమాధానం చెప్పలేకపోతున్నది. ఇలా ఏనుగుల్ని మింగినా ఎలుక పిల్లంత అభివృద్ధి కూడా సర్కారు చూపలేకపోతున్నది. ఈ ఆర్థిక పతనం ఇలాగే కొనసాగితే తెలంగాణ ఏ అధః పాతాళానికి జారిపోతుందో ఆ దేవునికే తెలియాలి.