నికార్సయిన తెలంగాణ బిడ్డలు రాజకీయ పార్టీలకు అతీతంగా తమ ఉద్యమ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పుకొనే అంశాలు ఎన్నెన్నో! నెహ్రూ చేసిన అన్యాయపు విలీనం, తుంగలో తొక్కిన ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, పాల్వంచ కేటీపీఎస్‌లో రాజుకున్న తొలిదశ ఉద్యమం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకం, ఉద్యమకారులపై కాల్పులు, అమరుల త్యాగాలు, డిక్లరేషన్లు, ఐక్య కార్యాచరణలు!
1969 ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ అంతటికీ వ్యాపింపజేసిన ఘనత కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని తెలంగాణ నాయకులు, వారికి మార్గదర్శకత్వం వహించిన టీఎన్జీవో పాల్వంచ అధ్యక్షుడు వీఎల్ నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొంశెట్టి రామదాసు, ఉపాధ్యాయ సంఘం నేత రామసుధాకర్ రాజులకు దక్కుతుంది.
కాంగ్రెస్ పార్టీ చేసిన బాసలు, తప్పిన హామీలు, చేసిన మోసాలకు తెలంగాణ మూడున్నర దశాబ్దాలు తల్లడిల్లింది, కేసీఆర్ ఎంట్రీ దాకా! తెలంగాణ చరిత్రను, గోసను పూర్తిగా అర్థం చేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రం సాధించేదాకా నిదురలేదు అంటూ మలిదశ భేరీ మోగించిన్రు, కాంగ్రెస్- బీజేపీల మెడ మీద కత్తిపెట్టి తెలంగాణ సాధించిన్రు. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణను మలిదశ స్ఫూర్తి నుంచి మలినదశకు చేరుస్తున్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, ఆజన్మ తెలంగాణ వ్యతిరేకి ఎనుముల రేవంత్ రెడ్డి!
అమరుల త్యాగాల ఫలంగా, సకలజనుల స్వప్నాల వరంగా, కేసీఆర్ నాయకత్వ పటిమ కారణంగా సాకారమైన తెలంగాణ పదేండ్ల స్వపరిపాలనతో అభివృద్ధి సంక్షేమ సూచీలలో దేశంలోనే సమున్నతంగా నిలబడింది. అట్లాంటి తెలంగాణ గత ఏడాదిన్నర కాంగ్రెస్ నిర్వాకంలో భర్తృహరి చెప్పిన గంగానదిలా సర్వభ్రష్టత పొందింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సహా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా దురన్యాయాలపై గళం ఎత్తకుండా ఉండలేకపోతున్నరు. ఊర్లల్లో కరెంట్ పోతే ‘జై కాంగ్రెస్’ అంటూ వ్యంగ్య నినాదాలు ప్రజలనుంచే వస్తున్నయి. ‘మూడు రంగుల జెండా పట్టి’ అంటూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై తమదైన రీతిలో తిరగబడుతున్నరు ప్రజానీకం. ‘యాడ ఉన్నవు కేసీఆర్ సారు… తొందరగా రా!, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల రూపంలో మీ ఆశీర్వచనాల కోసం; ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయిన బాలింతలు మేనమామ వలె మీరు ఇచ్చే కిట్స్ కోసం ఎంతోమంది వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నరు’ అంటూ వలపోస్తున్నరు నెటిజన్ రాఘవ శ్రీని.
అకాల వర్షాలు, ముందస్తు వర్షాల వల్ల కురిసిన నీటి కంటే, పంట నీళ్ళపాలై రైతు కంట ఒలికిన నీరే ఎక్కువ! ‘కేసీఆర్‌ను మిస్ అయితున్నం. కొద్దిలో మోసపోయినం, ఆయనను పోగొట్టుకున్నం. కుటుంబాన్ని సాదే పెద్ద కొడుకును ఇప్పుడు సరిగా తెలుసుకుంటున్నం. నాటి పాలన మరలా రావాలి’ అంటూ రైతులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు.
రేవంత్‌ను శాపనార్థాలు పెడుతున్నరు. కేసీఆర్ జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవ ప్రదాతగా. ఆయనే ఎన్నోసార్లు చెప్పినట్టు రాజకీయం ఆయనకు క్రీడ కాదు, మహత్తరమైన టాస్క్! కాబట్టే ఆయన పబ్లిక్‌లో నూ, ప్రైవేట్‌లోనూ ఒకలాగనే ఉంటరు, ఆలోచిస్తరు, అమలుపరుస్తరు!
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకుల మీటింగ్‌లో కేసీఆర్ మాకు చెప్పిన విషయాలివి. ‘తెలంగాణ సాధించుకొని మనం అధికారంలోకి వచ్చినప్పుడు… ఈ రాష్ర్టాన్ని మేటి శక్తిగా ఎట్ల నిలపాలనే అంశంపై ఎంతో మేధోమథనం జరిగింది. ఎందరెందరో నిష్ణాతులను పిలిపించినం. డాక్టర్ జి.ఆర్.రెడ్డితో కూడా మాట్లాడిన. ఆయన ఆర్థికరంగంలో, ముఖ్యంగా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఆర్థిక ప్రణాళికలలో దేశంలోనే అత్యుత్తమ అనుభవం కలిగినవారు. ‘రెడ్డి సాబ్, కొత్త రాష్ర్టానికి మీ సేవలు కావాలి. మిమ్మల్ని సమున్నత రీతిలో గౌరవించుకుంటం, దయచేసి రండి’ అని అడిగిన. ఆయన నా మాట మన్నించి వచ్చిన్రు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా నియమించినం, కేబినెట్ హోదా ఇచ్చినం. ఆయన సలహాలు, సూచనలతో అనతి కాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నం. ఇట్ల అన్నిరంగాల నిపుణులను రప్పించినం. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపి, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెంచినం. దుబారా ఖర్చులు చేయలేదు. కడుపు కట్టుకొని పనిచేసినం. ఒక ఉదాహరణ చెప్తా.. అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర సీఎం కాన్వాయ్‌లో మొత్తం నల్లరంగు కార్లు ఉండేవి. నాకు ఆ రంగు నచ్చదు. కొత్త కార్లు కొందాం అన్నరు అధికారులు. నేను వద్దన్న. కార్ల కలర్ మొత్తం గీకించి తెల్ల పేయింట్ వేయించి వాడుకున్న. సీఎం సాబ్ మీరు ఇంత పిసినారా? అని అప్పటి గవర్నర్ నరసింహన్ అన్నరు. అట్లా తిప్పలు పడ్డం రాష్ట్రం కోసం.’
‘ఇంటా బయటా మనను ఎవరూ నమ్మడం లేదు, గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయే దొం గల్లా చూస్తున్నరు’ అంటూ ఏడాదిన్నర తన పాలనాలేమి ఫలితాలను పూసగుచ్చినట్టు చెప్తున్నారు రేవంత్‌రెడ్డి. కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నరన్న సంబురం తెలంగాణ ద్రోహ బీజేపీది. ఈ రెండు పార్టీల ఏకైక శత్రువు బీఆర్ఎస్! జాతీయ పార్టీల హ్రస్వదృష్టికీ, బీఆర్ఎస్ సువిశాలత్వానికీ జరుగుతున్న సమర సందర్భం ఇది.
గతపు అవలోకనం చేస్తూ – లోతుగా, స్థిరంగా భవిష్యత్తు దృష్టితో మాట్లాడుతరు. చెన్నారెడ్డి సాబ్, అంజయ్య సాబ్ అంటూ గౌరవంగా మాట్లాడుతరు. ఎవరు చూస్తున్నా, చూడకపోయినా ఆయనది ఒకే తీరు. సందర్భశుద్ధి, వాక్శుద్ధి, చిత్తశుద్ధి మూర్తీభవించిన అరుదైన నాయకులాయన! ఇప్పుడు కంపేర్ చేయండి మీరే. ‘అప్పులు పుడుతలేవు, మౌలిక సదుపాయాల కోసం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్న. ఉద్యోగులారా… మీరు నడిపి చూపండి ప్రభుత్వాన్ని, నన్ను కోసినా పైసా రాదు’ అంటూ కాడి కిందపారేసే ప్రస్తుత ముఖ్యమంత్రి! ఆయన అసమర్థత వల్ల, భవిష్యత్తు దృష్టి లేకపోవడం వల్ల, వీధి రౌడీ లాంటి దుందుడుకు ఆగడాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట అడుగంటిపోయింది. రాష్ట్ర పాలకుడికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణమూ లేదాయనకు. ఇంకా తాను మిడ్జిల్ జెడ్పీటీసీనే అనుకుంటున్నరు. నోరు పెగులుతున్నదీ కానీ స్థాయి పెరగడం లేదు.
నేడు తెలంగాణ ఒక విఫల రాష్ట్రం. పదేండ్ల కేసీఆర్ పాలన నాటి పురోగతిని మట్టిపాలు చేసిండు రేవంత్ రెడ్డి. కోర్టుల జోక్యం లేకుండా ప్రజా ప్రయోజనాలు నెరవేరడం లేదు. మంత్రులు, అధికారులు ఎవరూ ఎవరినీ లెక్కచేయడం లేదు. హోటళ్లలో మెనూ లాగ మంత్రుల చాంబర్లలో అలిఖిత కమిషన్ టారిఫ్ నడుస్తున్నది. రేవంత్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుతున్నరు నరేంద్ర మోదీ – రాహుల్ గాంధీ ద్వయం!
రాహుల్‌గాంధీకి మూట, నరేంద్ర మోదీకి మాట ఇచ్చిన్రు రేవంత్ రెడ్డి. కాబట్టే, కాలజ్ఞాని వీరబ్రహ్మం చెప్పిన ఆకు, రాయిలా ఒకరికొకరు తోడు ఉన్నరు! గాలికి కొట్టుకుపోకుండా ఆకును రాయి, వానకు తడవకుండా రాయిని ఆకు కాపాడుతున్నయి. రెండు జాతీయ పార్టీలు కలిసి ముంచుతున్నయి తెలంగాణను.
‘ఇంటా బయటా మనను ఎవరూ నమ్మడం లేదు, గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయే దొం గల్లా చూస్తున్నరు’ అంటూ ఏడాదిన్నర తన పాలనాలేమి ఫలితాలను పూసగుచ్చినట్టు చెప్తున్నారు రేవంత్‌రెడ్డి. కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నరన్న సంబురం తెలంగాణ ద్రోహ బీజేపీది. ఈ రెండు పార్టీల ఏకైక శత్రువు బీఆర్ఎస్! జాతీయ పార్టీల హ్రస్వదృష్టికీ, బీఆర్ఎస్ సువిశాలత్వానికీ జరుగుతున్న సమర సందర్భం ఇది. తెలంగాణ క్షేమం కోరేవారు ఒక్క గొంతుతో, మొక్కవోని చిత్తశుద్ధితో ఉండాల్సిన తరుణం ఇది.
ఇదేదో వ్యాసాలు రాసుకునేవారి, వేసుకునేవారి గోల కాదు, ఒక క్షేత్రస్థాయి ఉదాహరణ చెప్తా, వినండి! “ఈ మధ్య స్నేహితులతో కలిసి పాలమూరు జిల్లాలో ప్రయాణం చేస్తున్న. ఒకచోట విరామం కోసం చెట్టునీడన ఆగిన. పక్కనే ఉన్న రైతు వచ్చి మాటలు కలిపిండు. ‘పెద్దయ్యా బాగున్నరా?’ అనడిగిన. కోపంగా నిప్పులు కక్కుతూ ‘ఏం బాగుండేది? దరిద్రం పట్టించిండ్లు కాంగ్రెసోల్లు’ అన్నడు. ‘మీరే గదయ్య ఎన్నుకున్నరు’ అన్న. ‘తప్పయింది, కేసీఆర్ సారు కంచం నిండా అన్నము, చేతిలో లడ్డు పెట్టి చూసుకున్నడు. వీడు ఇంకో లడ్డుపెడతా, అన్నం పక్కల అప్పడాలు ఇస్తా అంటే ఆశ పడ్డం. కానీ కంచంలో అన్నం, చేతిలో ఉన్న లడ్డు లాక్కుంటడని అనుకోలే. భ్రష్టుపట్టించిండు. తప్పయింది సారు. మల్ల కేసీఆర్ సారే రావాలి. వీళ్లు ఆశబెట్టి మోసం జేసిన్రు’ అన్నడు. ఆ రైతు మాటలకి బాధపడుతూ అక్కడి నుంచి కదిలినం” అంటూ తన అనుభవం పంచుకున్నరు టాటా సంస్థ విశ్రాంత సీనియర్ అధికారి, ప్రయోగాత్మక రైతు పాశం వెంకటేశ్వరరెడ్డి!
ప్రజలు ఒక్కటైతున్నరు మిత్రులారా. కష్టాలు వారిని ఏకం చేస్తున్నవి. వారితో మమేకం కావాల్సింది ఇపుడు బుద్ధిజీవులే. జనం బతుకుల బాగు కోసం, పూర్వవైభవం కోసం కేసీఆర్‌కు దన్నుగా నిలబడాలి మనమంతా. అతనొక్కడే రక్ష. ఇదే, రాష్ర్టావతరణ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డా పూనాల్సిన దీక్ష! జై తెలంగాణ!!