ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది. అవి కార్మికుల ఉపాధికి ఆధారమయ్యాయి. స్కూల్ విద్యార్థి, విద్యార్థినుల యూనిఫామ్‌లు, బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరల ఉత్పత్తి సిరిసిల్ల కార్మికుల ఉపాధికి భరోసానిచ్చాయి. బతుకమ్మ చీరల్లో అవినీతి జరిగిందని, నాణ్యత లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని రద్దు చేసింది. బతుకమ్మ చీరల్లో నాణ్యత లేకపోతే అంతకంటే మంచి చీరలను తయారు చేయించాలి.
అవినీతి జరిగితే అవినీతి చేసిన అధికారులపై, యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి తప్ప ఉన్న పథకాలను తీసివేసి ఉపాధి లేకుండా చేసి కార్మికులను రోడ్డున పడేయడం ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సబబేనా? సంవత్సరన్నర కాలంలో 38 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలాది మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు మరోసారి పోరుబాట పట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో బతుకమ్మ చీరల స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న 65 లక్షల మంది మహిళలకు రెండు చీరల చొప్పున 1 కోటి 30 లక్షల చీరలను ఉత్పత్తి చేయిస్తామని, తద్వారా కార్మికులకు ఉపాధి, మెరుగైన ఆదాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. చీరల ఉత్పత్తికి ఆర్డర్ తెచ్చుకున్న సంఘాలకు, యాజమాన్యాలకు ఒక మీటర్‌కు రూ.9 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ధర నిర్ణయించింది. కష్టపడి చీరలను నేసే కార్మికుడికి కూలి మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇదెక్కడి న్యాయం?
చీరల ఉత్పత్తికి కూలి ప్రభుత్వం నిర్ణయించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరితే మీరు యజమానులను అడగండి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సరైనదేనా? ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేత కార్మికులు ఏప్రిల్ 1 నుండి సమ్మెకు దిగారు. ఈ సమ్మెను విచ్చిన్నం చేయడం కోసం సమ్మె చేస్తున్న కార్మికులను, వారికి అండగా నిలబడిన కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. కేసులు పెడతామని భయపెడుతున్నారు.
కార్మికులను, నాయకులను పోలీసులు భయాందోళనలకు గురిచేయడం ప్రజాస్వామ్యబద్ధమేనా? తమకు ప్రభుత్వం కూలి నిర్ణయించాలని, పాలిస్టర్ వస్త్రానికి కార్మికుల ఒప్పందం ప్రకారం కూలి చెల్లించాలని, 2023లో కార్మికులకు చెల్లించాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, 10 శాతం యారన్ సబ్సిడీని వర్తింపజేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న కార్మికులను నిర్భంధించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకోవడం ప్రజాపాలన అనిపించుకుంటుందా? ప్రభుత్వానికి కార్మికుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే నిర్భంధం, అరెస్టులకు పాల్పడకుండా కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోర్కెలను తీర్చాలి. సమస్యలను పరిష్కరించకుండా నిర్బంధించి పరిపాలన చేస్తామంటే కార్మికులు చూస్తూ ఊరుకోరు. ఇది పోరు తెలంగాణ.
– కూరపాటి రమేష్, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి