Sericulture | పట్టువస్ర్తాలు ఎంతో విశిష్టమైనవి. శ్రీరాముడి పట్టాభిషేకం నుంచి పట్టువస్ర్తాల ప్రస్తావన ఉన్నది. దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో దేవతామూర్తుల క్రతువు కార్యక్రమాల్లో, పలు శుభకార్యాల్లో పట్టు బట్టలు విధిగా ఉపయోగిస్తారు. చైనాలో పుట్టిందని ఆధునిక కాలంలో చెప్పినప్పటికీ పట్టు మూలాలు సనాతన భారతదేశంలోనే ఉన్నాయి. మొహెంజొదారో హరప్పా నాగరికతలోనూ పట్టు వస్ర్తాల వినియోగం తాలూకు ఆధారాలు దొరికాయి. మల్బరీ ఆకులను ఆహారంగా తినే పట్టు పురుగులు వాటి నోటి ద్వారా పట్టుగూళ్లను అల్లుకుంటయి. ఈ ప్రక్రియనే ఇంగ్లీషులో ‘సెరికల్చర్’ అంటాం.
ఉమ్మడి రాష్ట్రంలో పట్టు పరిశ్రమ తీవ్ర వివక్ష ఎదుర్కొన్నది. పక్కనే కర్ణాటకలో ఆ పరిశ్రమ ఉన్నప్పటికీ మన రైతులు ఆ దిశగా అలోచించలేదు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించలేదు. ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 వేల ఎకరాల్లోనే మల్బరీ పంట సాగయింది. స్వరాష్ట్రంలో పట్టు సాగుపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా తోడ్పాటునూ అందించింది. నేడు రాష్ట్రంలో 12 వేలకు పైచిలుకు ఎకరాల్లో పట్టు సాగు విస్తరించడమే దానికి తాజా ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కరెంటును అందించడమే కాకుండా, నీటి వనరుల లభ్యత, అభివృద్ధి షెడ్ కోసం సబ్సిడీ కూడా అందిస్తున్నది. కిలో పట్టు గూళ్లకు ఇచ్చే ప్రోత్సాహం రూ.50 నుంచి రూ.75కి పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో పట్టు విస్తరణ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ప్రాంతంలో దక్కన్ పీఠభూమిలో ఉన్నది. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు పట్టు ఉత్పత్తికి అనుకూలం. ఇది నిరూపితమైంది కూడా. 2019-20కి గాను కేంద్రం దేశంలోనే ‘అత్యంత నాణ్యమైన బైవోల్టన్ పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా’ తెలంగాణకు అవార్డు కూడా ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అదేమంటే గతంలో 1980, 90 దశకాల్లో చాలామంది రైతులు మల్బరీ సాగుచేసి పట్టు పురుగులను పెంచి వదిలేసిన దాఖలాలున్నాయి. అప్పుడు అంత లాభదాయకం లేనిది, ఇప్పుడు ఎలా బాగున్నదని నిశితంగా పరిశీలించినప్పుడు మనకు కొన్ని విప్లవాత్మక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొదట పట్టు పురుగుల పెంపకంలో ఐదు దశలు ఉండేవి. వీటిని మొత్తం రైతులే నిర్వహించేవారు. ఇప్పుడు మొదటి రెండు దశలను చాకీ కేంద్రం పెంచుతున్నది. చివరి మూడు దశలే రైతులు పెంచుతున్నారు. దీనివల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా పంటకాలం కూడా తగ్గింది. అప్పట్లో క్రాస్ బ్రీడ్ రకం పెంచేవారు కానీ, ఇప్పుడు జన్యు మార్పిడి చెందిన బైవోల్టన్ రకం వచ్చింది. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇవేకాకుండా మల్బరీ సాగు రకాలు కూడా జన్యుమార్పిడి ఆధునికతతో అత్యధిక ఆకు దిగుబడి వస్తున్నది. కాబట్టి గతంతో పోలిస్తే పట్టు సాగులో చాలా మార్పులు వచ్చి లాభదాయకంగా మారింది.
2008 తర్వాత ‘సెరికల్చర్’ ఆధునికత సంతరించుకున్నది. గతంలోని సాగుతో పోల్చుకుంటే పంటకాలం 23 రోజులకు తగ్గింది. అంతేకాకుండా దిగుబడి మూడు రెట్లు పెరిగింది. పట్టు పురుగులను చంపి, నీటిలో ఉడకబెట్టి దారం తీస్తారని, అది జీవహింస అని కొందరు వాదిస్తుంటారు. ఇది నిజం కాదు. అవగాహనా రాహిత్యంతో అలా మాట్లాడటం వారికి తగదు. ఇప్పుడు మనం పెంచే పట్టు పురుగులు ప్రకృతి సిద్ధంగా, సహజంగా పెరిగిన జీవులు కాదు పూర్తిగా జన్యుమార్పిడి చెందినవి. మనం పెంచే పురుగులు ప్రయోగశాల నుంచి ఉత్పత్తి చేస్తారు, మనకు అడవుల్లో కానీ మరెక్కడా కానీ సహజసిద్ధంగా ఇవి దొరకవు. రెండో అంశం ఏమంటే వాటి జీవితకాలం 34 రోజులు కాగా, మనం పట్టును 32వ రోజు తర్వాత తీస్తాం. అంటే, వాటి జీవితకాలం పూర్తి కావటానికి కొన్ని గంటల ముందు మాత్రమే. పరిమాణక్రమంలోని లార్వా దశలో మనం పెంపకం చేస్తాం. ఆ పురుగులకు నొప్పి తెలిపే నాడీవ్యవస్థ, మెదడు లాంటివి ఉండవు కాబట్టి ఆ బాధ కూడా ఉండదు. ఈ దశలో వాటికి కండ్లు, చెవులు కూడా ఉండవు. హింస అనేదే ఉత్పన్నం కాదు.
పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా ముందున్నది. దాని ఉత్పత్తి 123 వేల మెట్రిక్ టన్నులు కాగా, 31 వేల మెట్రిక్ టన్నులతో భారత్ రెండో స్థానంలో ఉన్నది. వినియోగంలో మాత్రం మనదే మొదటి స్థానం. భారత్ దాదాపు 62 వేల మెట్రిక్ టన్నుల పట్టును వినియోగిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆయా సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడిన చీరలు వస్ర్తాలున్నయి. ఉత్తర భారతంలోని బనారస్, కశ్మీరీ వస్ర్తాలు, బలుచారి కంజీవరం, మైసూర్ గద్వాల, పోచంపల్లి వెంకటగిరి లాంటి చీరలకు వాడేది మన పట్టుదారమే. హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, జపనీయులు కూడా పట్టు దుస్తులను ఉపయోగిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న మల్బరీ విస్తీర్ణం రెండు రెట్లు పెరిగినా మన అవసరాలకే సరిపోతున్నది.
ప్రభుత్వం ఆలోచించే పంట మార్పిడికి ఈ మల్బరీ సాగు మంచి ప్రత్యామ్నాయ పంట. అలా గే మల్బరీ చెట్లు ప్రకృతిహితంగా ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తూ ఎప్పుడు పచ్చగా ఉంటయి. గ్రామీ ణ యువతకు మంచి ఉపాధి అవకాశం ఉన్న రం గం ఇది. రైతులకు చేతినిండా పని, వ్యవసాయ కూలీలకు ఏడాదిపాటు ఉపాధి కల్పించవచ్చు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పలురకాలైన చీరలే కాకుండా, పారాచూట్ దారాలు, వైద్యచికిత్స ఆపరేషన్ కుట్లకు మన పట్టు దారం వాడేలా రాష్ట్రం ఎదగాలి. అప్పుడే పట్టురం గం మనకు విదేశీ మారకంతో పా టు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే ఆదాయ వనరుగా మారుతుందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: ‘జెల్లా పుండరీకమ్: 94907 54201
రాష్ట్ర ప్రభుత్వ సెరికల్చర్ సమన్వయ కమిటీ సభ్యులు)