ఎన్నికలు ఏవైనా..విజయం సాధించేందుకు అర్థబలం, అంగబలం, మతం, కులం ప్రధాన ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజాస్వామ్య విజయానికి నాలుగు స్తంభాల విషయం ఎలా ఉన్నా, ఎన్నికల్లో విజయానికి ఈ నాలుగు బలాలు తప్పనిసరి. అది ఇప్పటివరకు ఉన్న లెక్క. కానీ ఢిల్లీలో జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత ఈ లెక్క మారడం కనిపిస్తున్నది. ఈ మార్పు చాలా వేగంగా ఉండకపోవచ్చు. కానీ మార్పు ప్రారంభం కావడం ప్రజాస్వామ్యానికి మంచిది. బిహార్‌లో ఒకే ఒక్కడు (ప్రశాంత్ కిశోర్) చూపిస్తున్న ప్రభావం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో అధికార పక్షం ఓటమి, బీఆర్ఎస్ విజయం అని చెప్తున్న పలు సర్వేలు, ఇండి యా టుడే దేశవ్యాప్తంగా జరిపిన సర్వే, బడిపిల్లలు విద్యావ్యవస్థ మెరుగు కోసం జరుపుతున్న ఆందోళనలు ఇవన్నీ చూస్తుంటే రాజకీయ స్వరం మెల్లగా మారుతున్నదనే అభిప్రాయం కలుగుతున్నది.
మౌలిక సమస్యలు రాజకీయాల్లో ప్రధాన అంశాలు కావు అని నిరాశ ఆవహించిన సమయంలో యువతరం దేశ రాజకీయాల్లో పెద్ద కుదుపు తీసుకువచ్చారు. ఈ దేశం రాజకీయ నాయకుల వ్యాపార కేంద్రం కాదు.. మనందరిది అని తెలియజేశారు. సమకాలీన దేశ రాజకీయాలను జంతర్ మంతర్‌కు ముందు, తర్వాత అని విడదీసి చూసే పరిస్థితి. స్తబ్దుగా ఉన్న దేశ రాజకీయాల్లో యువత తీసుకువచ్చిన కదలిక సాధారణమైనది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క బీజేపీపైనే కాదు.. దేశంలోని అన్ని రాజకీయ పక్షాల మీద ఈ ప్రభావం కనిపిస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ సాగితే అది కేంద్రంలో 12 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందికరం. అందుకే పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిర్వీర్యం అవుతున్న విద్యారంగం వంటి వాటిపై చర్చలు జరిగితే బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ పార్టీ ఇలాంటి అంశాలపై చర్చను కోరుకోదు.
అయితే ఈసారి మాత్రం బీజేపీ ఎజెండాను నిర్ణయించలేక పోతున్నది. ఎజెండాను ప్రజలు నిర్ణయిస్తున్నారు. యువత నిర్ణయిస్తున్నది. చివరకు బడిపిల్లలు కూడా నిర్ణయిస్తున్నారు. దేశంలో ఎంతోకాలం నుంచి నిరుద్యోగం, ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లేదనే బాధ అయితే, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న యువత తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోననే భయంతో బతుకుతున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల తారక రామారావు, బిహార్‌లో ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు, దేశంలో రాహుల్ గాంధీ యువతకు చేరువవుతూ వారి ఆకాంక్షల మీద, వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం వందేమాతరం వంటి అంశాల ద్వారా యువతలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. వందేమాతరం ప్రయోగం బీజేపీ ఆశించిన ఫలితాన్ని చూపలేదు. అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన తీరు, హుండీలో వందల కోట్ల రూపాయల చోరీతో ఓట్ల కోసమే తప్ప నిజంగా మతం మీద గౌరవం లేదనిపిస్తున్నది.
ప్రజల్లోనే కాదు, అధికారుల్లో సైతం మార్పు కనిపిస్తున్నది. బీహార్‌లోని బాంకీపుర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు. ఎన్నికల్లో విజయానికి అంగబలం, అర్థబలం, కులం, మతం అనివార్యం కాదని నిరూపించిన విజయం ఇది. ఒక్కరు గెలిచి సాధించేదేంది? అనిపించవచ్చు. కానీ బిహార్‌లో ఒకే ఒక్కడు సాధించి చూపించాడు. విజయం సాధించిన తర్వాత ఊరేగింపులు, విజయోత్సవాలేమీ లేవు. నేరుగా కార్యరంగంలోకి దిగడమే.
విజయం సాధించాక ఇటీవల పీకే తన నియోజకవర్గంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మూడు విభాగాల కార్యదర్శులు హాజరయ్యారు. విషయ పరిజ్ఞానం ఉంటే ఇలా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి దొంగ సర్టిఫికెట్ల చదువు మీద పీకే రోజూ ఆరోపణలు చేస్తున్నారు. సీఎం ఎక్కడికి వెళ్లినా అన్ పడ్ సీఎం (చదువు రాని సీఎం) అని యువకులు నినాదాలు చేస్తున్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం ఇద్దరి మీదా పీకే ఒత్తిడి తీసుకురాగలుగుతున్నారు. పీకే విజయం చదువుకున్నవారు కూడా రాజకీయాల్లోకి రావచ్చుననే సందేశం ఇస్తున్నది. తన నియోజకవర్గంలో పది వేల మందికి ఉద్యోగాలు ఇప్పించి చూపిస్తానని సవాల్ చేసి ఆ దిశగా ఇపుడు అడుగులు వేస్తున్నారు. పనిచేయకపోతే ప్రజలు ఓడిస్తారనే భయం లేనంతవరకు బిహార్ బాగుపడదని ఆయన అంటున్నారు. ఇప్పుడు పీకే పనితీరు రాష్ట్రంలోని మిగిలిన ఎమ్మెల్యేలను సైతం భయపెడుతున్నది. ఇది ఒక్క బిహార్‌లోనే కాదు.. దేశమంతటా అవసరం. బూతులతో, కులం, మతం బలంతో గెలుస్తామని విర్రవీగే నేతలందరికీ పనిచేయకపోతే ప్రజలు ఓడిస్తారనే భయం ఉండాలి.
-బుద్దా మురళి