పది నెలలు మోసీ పురిటి నొప్పులన్నీ
మునిపంటిన బిగబట్టి బిడ్డకు జన్మనిస్తీ
బిడ్డను చూసి పురిటి నొప్పుల బాధ
ఇంత తీయనా అని మురిసిపోతి
కన్న బిడ్డను చూసి నా కలల ప్రతిరూపం
నా చిట్టి తల్లి అని పొంగిపోతి
రక్త మాంసాలను తెల్లని పాలుగా వట్టి
ఒడిలో ఉన్న బిడ్డకు ఉగ్గు కథలు చెప్పి
పెరుగుతున్న బిడ్డను చూసి
నా బతుకుదెరువు తానేనని మురిసిపోతి
తప్పటడుగులు వేస్తూ పడిపోతే
చెయ్యి పట్టి నడిపించి నా భవిష్యత్తు
ఊత కర్ర తానేనని పొంగిపోతి
చదువు నేర్వ బడికి పోతే
చదువు ఆట పాటల్లో నీ బిడ్డ మేటి
అని పంతులు అంటే కష్టాలు కడతీర్చే
నా కన్నతల్లి నువ్వే అనుకుంటి
పెరుగుతున్న బిడ్డకు బుద్ధులెన్నో చెప్పి
ఖడ్గమృగాలు తిరిగే కారుణ్యంలో
అడుగడుగునా ప్రేమ పేరున వెంటబడి
వేధించే మానవమృగాలు ఈ పాడు లోకంలో
ఎదిరిస్తే యాసిడ్ దాడులు
కాదంటే కత్తులతో దాడులు చేసే ఉన్మాదులు
తిరుగుతుంటారు పైలం తల్లి అని చెప్పి పంపితి
ఒక్కగాను ఒక్కబిడ్డ రాక్షసుని చేతికి
చిక్కిన గొర్రె పిల్ల లాగ నా బిడ్డ సచ్చే
జ్వరం వస్తే సూది మందుకే
గజగజ వణికే నా చిట్టి తల్లి వాడి కత్తి
వేటుకు ఎంతవిలవిలలాడెనో
బిడ్డకు చిన్న ముల్లు కుట్టితేనే తట్టుకోలేని
తన అయ్యా బిడ్డ శవం చూసి గుండె ఆగే
నూరు కోట్లు దాటిన మనసులున్న
దేశంలో నేను ఎవరూ లేని అనాథనైతి
బిడ్డ మరుజన్మంటూ ఉంటే మనిషిగా పుట్టకు
ఆడపిల్లగా అసలే పుట్టకు….
దాసరి లక్ష్మయ్య: 99086 81727